BRS Formation: స్వేచ్చ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ 27న నిర్వహించేందుకు అధిష్టానం సన్నద్ధమవుతోంది. అయితే ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతినిధుల సభ నిర్వహించాలా? లేకుంటే ప్లీనరీని నిర్వహించాలనేదానిపై పార్టీ నేతల నుంచి సైతం అభిప్రాయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. మరో రెండువారాలు మాత్రమే గడువు ఉండటంతో నిర్ణయాన్ని సైతం వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాదిలో నిర్వహించే కార్యక్రమాలతో పాటు.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధంను పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నట్లు తెలిసింది.
పార్టీ ఆవిర్భవించి 26 ఏళ్లు అవుతుంది. గతేడాదే పార్టీ రజతోత్సవ సభను హనుమకొండజిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏ జిల్లాల్లో నిర్వహించాలనేదానిపై పార్టీ సీనియర్ నేతల నుంచి అభిప్రాయం ను అధినేత కేసీఆర్ తెలుసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే నీటిపారుదల ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టేందుకు పాలమూరురంగారెడ్డి ప్రాజెక్టుపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో, ఉమ్మడి నల్లగొండ ప్రాజెక్టులపై పోరాట సభను నిర్వహిస్తమని గతంలోనే పార్టీ ప్రకటించింది.
పాలమూరులో సభ స్థలినిసైతం పరిశీలించారనే ప్రచారం జరిగింది. పాలమూరు ప్రాజెక్టు సమీపంలోనే సభనిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం జరుగుతుందని నేతలు తెలిపారు. అయితే ఆ సభ వాయిదాలతోనే కొనసాగుతుంది. అయితే ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏ జిల్లాలో ప్లీనరి లేక ప్రతినిధుల సభను నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతుంది. ఉమ్మడి కరీంనగర్ లోని జగిత్యాలలో ఈ నెల 20న జీవన్ రెడ్డి చేరికను పురస్కరించుకొని సభను నిర్వహిస్తుంది. దీంతో కరీంనగర్ లో పార్టీ ఆవిర్భావసభ లేదని స్పష్టమవుతోంది. అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే ఆవిర్భావ వేడుకలను నిర్వహిస్తారనేది విశ్వసనీయ సమాచారం. మరోవారం రోజుల్లో క్లారిటీ రానుందని సమాచారం.
Also Read: ఓ కేటీఆర్ పశ్చాత్తాపం.. తమ పాలనలో లోపాలు, తమ వైఖరిలో దోషాలు..!
ప్రజాసమస్యలపై పోరుబాటకు బీఆర్ఎస్ మరోవైపు సన్నద్ధమవుతుంది. నియోజకవర్గాలు, మండలాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు సమాచారం. గ్రామాల్లో తిష్టవేసిన మౌలిక సమస్యలు, రైతు, మహిళ, నిరుద్యోగ, యువత సమస్యలపై ప్రధానంగా గళం ఎత్తేందుకు పార్టీ సిద్ధమవుతోంది. ఇప్పటికే అందివచ్చి ఏ అవకాశాన్ని వదిలిపెట్టకుండా సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగ, ఆశ, అంగన్ వాడీ, రైతు అంశాలపై ఇప్పటికే ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమం చేపడుతుంది. కార్మికులు, కర్షకులు ధర్నా చేస్తే వారికి మద్దతు పలుకుతుంది. హైడ్రా బాధితుల పక్షాన ఇప్పటికే గళం వినిపిస్తుంది. పార్టీ నిర్వహించబోయే ప్లీనరీ లేదా ప్రతినిధుల సభలో పార్టీ నేతలకు ప్రజలపక్షాన పోరాడేందుకు కార్యచరణ ఇవ్వబోతున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ వైఫల్యాలు, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీలు, హామీలను మరోసారి ఎత్తిచూపేలా పార్టీ ఆవిర్భావం రోజూ పార్టీ ముఖ్యులకు దిశానిర్దేశం చేయబోతున్నట్లు సమాచారం. రెండున్నరేళ్లకాలంలో కాంగ్రెస్ ఏం చేసింది.. వైఫల్యాలు ఏంటనేది క్లుప్తంగా వివరించాలని, అందుకు బుక్ లేట్ ను సైతం అందజేయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. గ్రామస్థాయిలో కార్యక్రమాలతో కేడర్ లో జోష్ నింపాలని భావిస్తుంది. పార్టీ కేడర్ అభిప్రాయాలను తెలుసుకొని పార్టీ నేతలకు కేడర్ కు మధ్య ఏర్పడిన సమన్వయ లోపంను పూడ్చేందుకు చర్యలు తీసుకోబోతున్నారు. పార్టీ బలోపేతంపై సారించాల్సిన దృష్టిపై పలు సూచనలు చేయబోతున్నారు. ఏది ఏమైనా పార్టీ నేతలకు మాత్రం ఈ ఆవిర్భావ దినోత్సవం రోజూకు గట్టిక్లాస్ తీసుకోబోతున్నట్లు సమాచారం.
Also read: ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి మంత్రుల పేషీలు.. అధికారుల ప్రతిష్టకు గండం!