Minister Offices: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని కొందరి మంత్రుల పేషీలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయనే విమర్శలు మొదలయ్యాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా కొందరు ప్రైవేట్ వ్యక్తులు మంత్రుల పేషీలపై గురి పెట్టారు. పీఏ, పీఎస్ ల పేరిట కొందరు ప్రైవేట్ వ్యక్తులు(ప్రభుత్వ ఉద్యోగంలో లేని వారు) మంత్రుల పేషీల్లో నేరుగా చెలామణి అవుతుండగా, మరి కొందరు ఆయా పేషీల్లో తమ మనుషులను పెట్టుకొని బ్యాక్ గ్రౌండ్ లో ఉండి వ్యవహరాలను నెట్టుకొస్తున్నారు. ఇక మరి కొన్ని పేషీల్లో ప్రభుత్వాఫీసర్లు ఉన్నప్పటికీ, ఆయా ప్రైవేట్ వ్యక్తులు చెప్పిందే పాటించాల్సిన పరిస్థితులు దాపరించాయి. బయట నుంచి ఆదేశాలు జారీ చేస్తే, సెక్రటేరియట్ నుంచి డిపార్ట్ మెంట్ వరకు ఆ ప్రైవేట్ వ్యక్తులు ఆదేశాలను అమలు చేసేందుకు స్వయంగా ప్రభుత్వాఫీసర్లూ చొరవ తీసుకోవడం గమనార్హం.
మంత్రులకు సన్నిహితులుగా మెలుగుతూ ప్రభుత్వ పాలనలో ప్రైవేట్ వ్యక్తులు తమ భాగస్వామ్యాన్ని ప్రదర్శించడం విశేషం. గత కొన్ని రోజుల నుంచి కొంత మంది మంత్రుల పై వరుస వివాదాలు తెరమీదకు వస్తున్నా. ఈ ప్రైవేట్ సైన్యంపై సదరు మినిస్టర్లు ఫోకస్ పెట్టడం లేదు. తద్వారా మంత్రులు సమర్ధవంతంగా పనిచేస్తున్నప్పటికీ, డ్యామేజ్ అవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. నమ్మిన బంటులుగా ఉన్నందున ఆయా ప్రైవేట్ వ్యక్తులు చెప్పిందే వేదంగా పేషీల్లో ఆదేశాలు అమలవుతున్నాయి. ఈ సిచ్వేషన్ లను చూసి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. మరి కొంత మంది ప్రైవేట్ టీమ్ అయితే ఒకడుగు ముందుకేసి ఐఏఎస్ ఆఫీసర్లపై కూడా ప్రెజర్స్ పెడుతున్నట్లు తెలిసింది. తాము చెప్పినట్లు వ్యవస్థ నడవాల్సిందేనని చెప్పుకొస్తున్నారట. దీన్ని చూసి సెక్రటేరియట్ లోని కొందరు ఆఫీసర్లు అవాక్కవుతున్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీసీ కోటాలో బెర్త్ లభించిన ఓ మినిస్టర్ పేషీలో సీనియర్ అసిస్టెంట్ చక్రం తిప్పుతున్నారనే విమర్శలు ఉన్నాయి. తానే పీఎస్, ఓఎస్డీ అంటూ హాడావిడి చేస్తున్నారట. పైగా ఆ వ్యక్తికి ఇప్పటికీ ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆర్డర్ లేనట్లు తెలిసింది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీనియర్ మహిళా మంత్రి పేషీలోనే ఇదే సిచ్వేషన్ నెలకొన్నది. ఓ ప్రైవేట్ వ్యక్తి చెప్పినట్లు మంత్రి పేషీ ఇప్పటికీ కొనసాగుతున్నట్లు తెలుస్తున్నది. గతంలో ఈ వ్యక్తి ఓఎస్డీగానూ పనిచేశారు. సీఎం స్థాయిలో వివాదం నెలకొన్న తర్వాత ఆయన్ను తొలగించాల్సి వచ్చింది. కానీ ఇప్పటికీ ఆ ప్రైవేట్ వ్యక్తి చెప్పినట్లే పేషీలో యాక్టివిటీస్ సాగుతున్నాయనే విమర్శ ఉన్నది.
Also read: విజయ్ ర్యాలీలో బాంబు కలకలం.. సైకిల్ వదిలి నటుడు పరుగో పరుగు!
ప్రస్తుతం అడిషనల్ పీఎస్ గా ఓ మహిళా అధికారిణి ఉన్పప్పటికీ, సదరు ప్రైవేట్ వ్యక్తి చెప్పినట్లే వీళ్లంతా పాటించాల్సి వస్తున్నదట. పైగా ఈ మహిళా అధికారిణికి కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఆర్డర్ ఇవ్వలేదు. ప్రభుత్వాఫీసర్ గా ఉన్నప్పటికీ ఈ ఆఫీసర్ స్వతహాగా నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. సదరు ప్రైవేట్ వ్యక్తి మంత్రి కి అతి దగ్గరగా ఉన్న నేపథ్యంలో.. ఆయన ఆదేశాలను పాటించాల్సి వస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎస్సీ కోటాలో బెర్త్ లభించిన మరో మంత్రి పేషీలోనూ అవగాహన లేని స్టాఫ్ తో సమస్యలు ఏర్పడుతున్నాయి. సింగరేణిలో రిటైర్డ్ ఆఫీసర్ ను తీసుకువచ్చి ఓఎస్డీగా నియమించారు. సెక్రటేరియట్ అడ్మినిస్ట్రేషన్, డిపార్ట్ మెంట్ పనితీరుపై సదరు ఆఫీసర్ కు అవగాహన లేదు.
దీంతో పాలన పరంగా మంత్రి పేషీ ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందనే చర్చ కూడా ఉన్నది. మరోవైపు ఉమ్మడి ఖమ్మంలో కీలకంగా చెలమణి అవుతున్న మరో మంత్రి వద్ద ప్రైవేట్ పీఏ చక్రం తిప్పుతున్నారనే చర్చ ఉన్నది. గతంలో ఇదే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి వద్ద కూడా పనిచేశారు. ఈయనే మంత్రి తరహాలో పేషీలో హాడావిడి చేస్తూ పబ్లిక్ దగ్గర్నుంచి ఆఫీసర్ల వరకు పరుగులు పెట్టిస్తున్నట్లు టాక్. పైగా ఈ మంత్రిపైనే గత కొన్ని రోజులుగా వరుస వివాదాలు నెలకొన్నాయి. ఇక మరి కొంత మంది మంత్రుల పేషీల్లో బంధుత్వం, ప్రెండ్షిప్ పేరిట ప్రైవేట్ వ్యక్తులు చక్రం తిప్పుతున్నారు. వరుసగా మంత్రులపై కాంట్రవర్సీ ఎపిసోడ్ లు తెర మీదకు వస్తున్నా..ఈ ప్రైవేట్ సైన్యంపై దృష్టికేంద్రీకరించడం లేదు.
ఒక వైపు రాష్ట్ర పరిస్థితిని చక్కదిద్దుతూ ప్రజాపాలనను సంపూర్ణంగా ముందుకు తీసుకువెళ్లేందుకు సీఎం, మంత్రులు శ్రమిస్తుంటే, ప్రైవేట్ సైన్యం అత్యుత్సాహంతో డ్యామేజ్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సహజంగా మంత్రుల పేషీల్లో గవర్నమెంట్ సర్వీస్ లోని వ్యక్తులనే అత్యధికంగా నియమించుకుంటారు. ఉమ్మడి ఏపీలో ఈ తరహాలో నియామకాలు ఉండేవి. కానీ పేషీల్లోకి ప్రైవేట్ వ్యక్తులు ఎంట్రీ కావడంతో పాలనలో చిక్కులు, సమస్యలు వస్తున్నాయి. అవగాహన లేమీ తనం, సర్వీస్ రూల్స్ తెలవకపోవడం, మంత్రులకు సన్నిహితంగా ఉండటంతో పవర్ ఉన్నదనే భ్రమలో తామేం చేసినా చెల్లుందుందనే భ్రమలో ఇష్టారీతిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇవి చివరకు మంత్రులకు డ్యామేజ్ తెచ్చేందుకు కారణమవుతున్నాయి. సహజంగా పేషీల్లో ప్రభుత్వాఫీసర్లు ఉంటే ఏదైన తప్పు జరిగితే వేటు పడుతుందనే భయం ఆయా ఆఫీసర్లలో ఉంటుంది. దీంతో బాధ్యతగా పేషీ వ్యవహారాలు, యాక్టివీటీస్ ముందుకు సాగుతాయి. కానీ ప్రైవేట్ వ్యక్తులు ఇవేమీ పట్టించుకోరు. తమ సొంత వర్క్స్, కార్యకలాపాలపైనే ఫోకస్ పెడతారు. మంత్రుల కంటే వీళ్లే ఆ పవర్ ను వినియోగించేలా ప్రవర్తిస్తుంటారనే విమర్శలు సెక్రటేరియట్ వర్గాల్లో ఉన్నది.
Also read: మిర్యాలగూడలో మిల్లర్ల సిండికేట్ దందా.. తెలంగాణ ధాన్యంపై వేరే రాష్ట్రాల కన్ను..!