BRS MLC Elections: స్వేచ్ఛ బ్యూరో: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్‌ఎస్ దృష్టి సారించింది. వచ్చే మార్చిలో ఖాళీ కానున్న నల్లగొండ–ఖమ్మం–వరంగల్, హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల కోసం పార్టీ ఇప్పటి నుంచే వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టింది. అధికారిక నిర్ణయం వెలువడకముందే సామాజిక సమీకరణాలపై పార్టీలో చర్చ మొదలైంది. రెండు స్థానాల్లో ఒకటి రెడ్డి సామాజికవర్గానికి, మరొకటి బీసీ వర్గానికి కేటాయించే దిశగా బీఆర్‌ఎస్ ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందులో నల్లగొండ–ఖమ్మం–వరంగల్ స్థానాన్ని రెడ్డి సామాజికవర్గానికి, హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ స్థానాన్ని బీసీకి ఇవ్వాలన్న ప్రతిపాదనపై చర్చ జరుగుతున్నది. అభ్యర్థుల సామాజిక నేపథ్యంతో పాటు వ్యక్తిగత పరిచయాలు, పట్టభద్రుల్లో ఉన్న గుర్తింపు, పార్టీ కోసం పనిచేసిన తీరు, ఎన్నికల నిర్వహణ సామర్థ్యం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని పార్టీ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం.
6 జిల్లాల పరిధిలో..
రాష్ట్రంలో త్వరలో జరుగనున్న పట్టభద్రుల రెండు అసెంబ్లీ స్థానాలు 6 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్నాయి. ఒకటి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలో ఉండగా, రెండోది హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. అంటే దాదాపు సగం రాష్ట్రానికి పైగా కవర్ అవుతుంది. అందుకే ఈ ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ కీలకంగా తీసుకుంటుంది. దీంతో ప్రకటించే అభ్యర్థికి వ్యక్తిగత నెట్‌వర్క్ కీలకంగా మారనుంది. గ్రాడ్యుయేట్లలో గుర్తింపు ఉండటంతోపాటు క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సమన్వయం చేసే సామర్థ్యం ఉన్న నేతల కోసం పార్టీ అన్వేషిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా ఈసారి అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణాలతోపాటు వ్యక్తిగత బలం, ప్రజల్లో పరిచయం, ఆర్థిక సామర్థ్యం, గ్రాడ్యుయేట్లతో సంబంధాలు, ఎన్నికల నిర్వహణ సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని బీఆర్‌ఎస్ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. విస్తృత నియోజకవర్గం కావడంతో ఆరు జిల్లాల పరిధిలో పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయగలిగే నేతలకే ప్రాధాన్యం ఇవ్వాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
‘పనిచేసేవారికే పదవులు’
పార్టీని పునర్‌నిర్మించే క్రమంలో క్షేత్రస్థాయిలో పనిచేసే నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న లైన్‌ను బీఆర్‌ఎస్ నాయకత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా ఉండే వారికే బాధ్యతలు అప్పగించాలన్న విధానాన్ని కేసీఆర్ కూడా గతంలో వెల్లడించారు. పార్టీ కోసం పనిచేసే వారిని గుర్తించి బాధ్యతలు ఇవ్వాలని, యువత, విద్యార్థి, కార్మిక సంఘాల్లో చురుగ్గా ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించిన విషయం తెలిసిందే.అదే ధోరణిని ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలోనూ అనుసరించాలని కేటీఆర్ సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేవలం సామాజిక సమీకరణాలను మాత్రమే కాకుండా ఎన్నికల్లో కష్టపడి పనిచేసే సామర్థ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
వరంగల్–ఖమ్మం–నల్లగొండపై ప్రత్యేక దృష్టి
2024లో ఈ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున ఏనుగుల రాకేశ్‌రెడ్డిని బరిలో నిలిపింది. గత ఎన్నికల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి అభ్యర్థి ఎంపికను ఆచితూచి చేపట్టాలని పార్టీ భావిస్తోంది. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న చేతిలో బీఆర్‌ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఓడిపోయిన విషయాన్ని కేటీఆర్ ఇటీవల ఉమ్మడి జిల్లా నేతల సమావేశంలో ప్రస్తావించారు. ఈసారి అభ్యర్థి ఎవరైనా పార్టీ నేతలంతా సమష్టిగా పనిచేసి గెలిపించాలని సూచించారు. ఈ ఏన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నిలపాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. నల్లగొండ, వరంగల్, ఖమ్మంలో రెడ్డిసామాజిక వర్గానికి పట్టుండటంతోనే పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన రాకేష్ రెడ్డిని మరోసారి బరిలో నిలపాలని భావిస్తుంది. ఈ టికెట్ ను ఉద్యమకారుడు, దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి సైతం ఆశిస్తున్నారు. ఆయన సైతం ఓటరు నమోదుపై దృష్టిసారించారు. ఇద్దరు ప్రస్తుతం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల నేతలతో కేటీఆర్ విడివిడిగా సమావేశమయ్యారు. నోటిఫికేషన్ వచ్చేలోపే ఓటర్ల నమోదుపై దృష్టి పెట్టాలని, ప్రతి అర్హుడైన పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలని ఆదేశించారు. అభ్యర్థి ఎంపిక కంటే ముందే ఎన్నికల యంత్రాంగాన్ని సిద్ధం చేయడంపైనే పార్టీ ఎక్కువగా దృష్టి సారిస్తోంది.
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ సీటుపైనా కసరత్తు
హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ స్థానాన్ని కూడా బీఆర్‌ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. గతంలో వాణీదేవిని బరిలో నిలిపి ఈ స్థానాన్ని గెలుచుకున్నది. మరోసారి సమష్టి కృషితో సీటును నిలబెట్టుకోవాలని పార్టీ భావిస్తుంది. ఈనెల 28న ఓటరుగా తన పేరును కూడా కేటీఆర్ నమోదు చేసుకున్నారు. అర్హులైన పట్టభద్రులందరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలని పిలుపునిచ్చారు. నవంబరు 6లోగా నమోదు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అయితే ఈ టికెట్ ను బీసీలకు అప్పగించబోతున్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గంలో బీసీ జనాభా ఎక్కువగా ఉండటం, రెండు స్థానాలు ఒకే సామాజిక వర్గానికి ఇస్తే ప్రజల్లోనూ వ్యతిరేకత వస్తుందని భావించే పార్టీ ఈ నియోజకవర్గం తీసుకున్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గం నుంచిబీసీ సామాజిక వర్గానికి చెందిన సాట్స్ మాజీ చైర్మన్ నరేందర్ గౌడ్, కాసాని వీరేశ్ ఆశీస్తున్నారు. వీరితో పాటు మరికొంతమంది టికెట్ రేసులో ఉన్నారు. గౌడ్ లతో పాటు బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉండటంతో నరేందర్ గౌడ్ తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. కాసాని వీరేశ్ మాత్రం ఈ మూడు జిల్లాల పరిధిలో ముదిరాజ్ జనాభా అధికంగా ఉందని, రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ లో గత ఎన్నికల్లో పనిచేసిన అనుభవం ఉండటంతో తనకు కలిసి వస్తుందని పార్టీకి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. టికెట్ ఇవ్వాలని కోరినట్లు సమాచారం.
ఆరు జిల్లాల్లో ‘ఎన్‌రోల్‌మెంట్’ ఆపరేషన్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నమోదు అత్యంత కీలకం కావడంతో బీఆర్‌ఎస్ ఈ ప్రక్రియను పార్టీ కార్యక్రమంగా చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఓటు వేసిన వారు సైతం ప్రస్తుత ఎన్నికల కోసం మళ్లీ నమోదు చేసుకోవాల్సి ఉండటంతో ఈసారి అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్‌ను గుర్తించే బాధ్యతను స్థానిక నేతలకు అప్పగిస్తోంది.కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, అనుబంధ సంఘాల ద్వారా అర్హులైన పట్టభద్రులను గుర్తించి ఓటర్లుగా నమోదు చేయించేలా కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సమయానికి పార్టీ యంత్రాంగం పూర్తిగా సన్నద్ధంగా ఉండాలన్నది నాయకత్వం వ్యూహంగా కనిపిస్తోంది.
సామాజిక సమీకరణాలపైనే ఉత్కంఠ
ఇదిలా ఉండగా, రెండు సీట్లలో ఒకటి బీసీకి, మరొకటి రెడ్డి సామాజికవర్గానికి కేటాయించే ఫార్ములాపై పార్టీలో చర్చ సాగుతున్నట్లు తెలుస్తోంది. నల్లగొండ–ఖమ్మం–వరంగల్ స్థానంలో రెడ్డి సామాజికవర్గం నుంచి పలువురు పేర్లు ఆశావహుల జాబితాలో వినిపిస్తుండగా, హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ స్థానంలో బీసీ నేతల పేర్లపైనా చర్చ జరుగుతోంది. అయితే చివరి నిర్ణయం అభ్యర్థి వ్యక్తిగత బలం, పార్టీకి అందుబాటు, గ్రాడ్యుయేట్లలో ఉన్న పరిచయం, ఎన్నికల ఖర్చును నిర్వహించే సామర్థ్యం తదితర అంశాల ఆధారంగానే ఉండవచ్చని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. టికెట్ ఎవరికన్నదానికంటే.. గెలిపించగలిగే నేత ఎవరన్నదే కీలకంగా మారింది. అందుకే సామాజిక సమీకరణాలను పాటిస్తూనే క్షేత్రస్థాయిలో పనిచేసే, ఆర్థికంగా–సామాజికంగా బలంగా ఉన్న అభ్యర్థుల వైపు బీఆర్‌ఎస్ మొగ్గు చూపే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రాబోయే ఎన్నికల్లో పట్టుకోసం..
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సైతం ఈ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు కీలకం కానున్నాయి. నిరుద్యోగ యువత, ఉద్యోగుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఎలా ఉందని, గులాబీపార్టీకి వారిలో ఏం అభిప్రాయం ఉంది.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ముందుకు పోవాలనేది కూడా పార్టీ అధిష్టానానికి స్పష్టంగా తెలియజేయనున్నాయి. దీంతో ఎలాగైనా ఈ రెండు స్థానాల్లో విజయం సాధిస్తే రాబోయే కాలంలో ఏ ఎన్నికలు జరిగినా ఈ ప్రభావం చూపనుంది. అందుకే ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు పోతుంది. గత ఎన్నికల్లో తప్పిదాలను సైతం అధ్యయనం చేస్తూ పక్కా వ్యూహంతో ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతుందని పార్టీ నేతలు తెలిపారు.
Also Read: రష్యాలో కుప్పకూలిన బాంబర్ విమానం.. ఆరుగురు సైనికులు దుర్మరణం