E-Paper
Advertisement

BRS: గులాబీ బాస్‌కు సొంత లీడర్ల సెగ.. పార్టీని ముంచుతున్న ఒంటెద్దు పోకడలు!

BRS: గులాబీ బాస్‌కు సొంత లీడర్ల సెగ.. పార్టీని ముంచుతున్న ఒంటెద్దు పోకడలు!

BRS: స్వేచ్చ బ్యూరో: పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి, ప్రజల్లోకి దూసుకుపోవాలని గులాబీ అధిష్టానం వ్యూహాలు రచిస్తుంటే.. కొందరు నేతల వైఖరి మాత్రం పార్టీ కొంపముంచేలా తయారైంది. సొంత అజెండాలు, వివాదాస్పద వ్యాఖ్యలు, గ్రూపు రాజకీయాలతో కొందరు గులాబీ నేతలు చేస్తున్న ‘ఒంటెద్దుపోకడలు’ ఇప్పుడు పార్టీకి పెద్ద మైనస్‌గా మారాయి. క్లిష్టసమయంలో ప్రజల మద్దతు కూడగట్టాల్సింది పోయి, తమ చేష్టలతో పార్టీ గ్రాఫ్‌ను పాతాళానికి పడిపోయేలా చేస్తున్నారనే చర్చ అంతర్గతంగా నడుస్తోంది.

వరుస వివాదాలు..

గులాబీ దళంలో ముసలం పుడుతోంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి, ప్రజల్లోకి వెళ్లాలని అధిష్టానం భావిస్తుంటే, కొందరు నేతల ఒంటెద్దు పోకడలు పార్టీ కొంపముంచుతున్నాయి. వరుస వివాదాలు, బాధ్యతారహిత వ్యాఖ్యలు, సమన్వయ లోపంతో గులాబీ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది. స్వయంకృతాపరాధాలతో పార్టీ మైలేజీని పలువురు నేతలు దెబ్బతీస్తున్నారు. వివాదాల సుడిగుండంలో నేతలుపార్టీకి అండగా నిలవాల్సిన కొందరు కీలక నేతలు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. భూవివాదాలు, సెటిల్మెంట్లు, స్థానిక అధికారులతో ఘర్షణలు, కేడర్ ను కలుపుకొని పోకుండా వర్గాలకు ఆజ్యం పోస్తుండటం వంటి అంశాలతో పార్టీ ప్రతిష్ట మసకబారుతోంది.

నోటి దురుసుతనం..

మరికొందరు నేతలు వివిధ కేసులతో లింకులు కలిగి ఉండటం కేడర్‌ను ఆత్మరక్షణలో పడేస్తోంది. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాల్సింది పోయి, సొంత పార్టీ నేతల వ్యవహార శైలిని సమర్థించుకోలేక ద్వితీయ శ్రేణి నాయకత్వం సతమతమవుతోంది. కాంట్రవర్సీ కామెంట్లు.. శ్రేణుల్లో కలకలం నోటి దురుసుతనం గులాబీ పార్టీకి పెద్ద మైనస్‌గా మారుతోంది. పబ్లిక్ ప్లాట్‌ఫారమ్స్, మీడియా సమావేశాల్లో కొందరు నేతలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీని ఇరుకున పెడుతున్నాయి. క్షేత్రస్థాయి వాస్తవాలు మాట్లాడకుండా, ప్రజల్లో వ్యతిరేకత పెంచేలా వ్యవహరిస్తున్న తీరుపై అంతర్గతంగా తీవ్ర చర్చ నడుస్తోంది. క్రమశిక్షణ తప్పి మాట్లాడుతున్నా అధిష్టానం కఠిన చర్యలు తీసుకోవడం లేదనే అసంతృప్తి కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది.

Also read: అచ్చం అద్దం లాగే.. ఇండియాలోని ఈ సరస్సులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారెంటీ!

రోడ్డు ప్రమాదం కేసులో..

గులాబీ అధిష్టానానికి కొందరి నేతల తీరు తలనొప్పులు తెచ్చి పెడుతుంది.ఒక నేత వివాదం ముగిసేసరికి మరొక నేత వివాదం తెరపైకి వస్తుంది. అలాంటి వారితో పార్టీకి నష్టం జరుగుతుంది అనే అభిప్రాయం గులాబీ పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతుంది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ వివాదం గతంలో హైదరాబాద్‌లో జరిగిన హై ప్రొఫైల్ రోడ్డు ప్రమాదం కేసులో షకీల్ కుమారుడి పేరు ఎంతలా మారుమోగింది. ఆ వివాదం నుంచి బయటపడక ముందే తాజాగా వెలుగులోకి వస్తున్న వరుస ఘటనలు పార్టీ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తున్నాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళ్లేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్న గులాబీ పార్టీకి సొంత పార్టీ నేతల వ్యవహార శైలి మైనస్ గా మారిందనే ప్రచారం జరుగుతుంది.

కుటుంబ సభ్యులపై కేసులు..

ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్మూర్ ఆర్టీసీ కాంప్లెక్స్ వివాదం అప్పట్లో రాజకీయ చర్చకు దారి తీసింది. ఆ తర్వాత ఇదే అంశంలో జీవన్ రెడ్డి హైకోర్టుకు వెళ్లారు. మరో వైపు భూముల అంశంలోను జీవన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. చేవెళ్ల పరిధిలో ఉన్న భూమి విషయంలో జీవన్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులపై కేసులు నమోదు అయ్యాయి. ఇక ఇదే విషయంలో జీవన్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నారు. ఎమ్మెల్యేగా ఆర్మూర్ నియోజకవర్గంలో చక్రం తిప్పిన గులాబీ నేత ఓటమి తర్వాత వరుస వివాదాల్లో తెరపైకి వచ్చారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి అయితే గులాబీ బాస్‌కు గుబులు పుట్టించేలా చేసింది.పలు సార్లు దూకుడు తగ్గించుకోమని పార్టీ హెచ్చరించిన ఆయన తీరులో మార్పు కనిపించడం లేదనే చర్చ పార్టీ వర్గాల్లో ఉంది.

తాండూర్ మాజీ ఎమ్మెల్యే..

రాజకీయాల్లో కౌశిక్ శైలీ వేరు. అదేఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిందనే ప్రచారం జరుగుతోంది. కౌశిక్ రెడ్డి తీరు కొన్ని సందర్భాల్లో పార్టీ లైన్‌ను దాటిపోతుందనే ఆందోళన సొంత పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వ్యవహార శైలి సైతం గులాబీ పార్టీకి అతిపెద్ద తలనొప్పిగా మారింది. ఆయన ఒంటెద్దు పోకడలు, వివాదాస్పద నిర్ణయాలు డ్రగ్స్ కేసులో దొరకడం బిఆర్ఎస్ ను నియోజకవర్గంలో డిఫెన్స్‌లో పడేశాయి. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే కాక ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత రోహిత్ రెడ్డి తన పంథాను మార్చుకోకపోవడంపై అధిష్టానం తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: సరికొత్త ‘మింట్’ కలర్‌లో Samsung Galaxy A27.. లాంచ్‌కు ముందే లీకైన వివరాలు!

ఫామ్ హౌస్ లో డ్రగ్స్ కేసు..

సీనియర్ నాయకులను, క్షేత్రస్థాయి కేడర్‌ను కలుపుకొని పోవడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలతో పాటుగా పార్టీ ప్రయోజనాల కంటే సొంత ఇమేజ్, వ్యక్తిగత ప్రాధాన్యతలకే రోహిత్ రెడ్డి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనే ఆరోపణలు గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పాలిటిక్స్ లో వినిపించాయి. ఫామ్ హౌస్ లో డ్రగ్స్ కేసు అంశంలో వివరణ ఇవ్వాలని పార్టీ షోకాజు నోటీసులు ఇచ్చింది. పైలెట్ రోహిత్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశామని నేతలు చెబుతున్నా ఆయన మాత్రం గులాబీ కండువాతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అది పార్టీకి మైనస్ గా మారే అవకాశం ఉందని తాండూరు నియోజకవర్గ గులాబీ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

ఒంటెద్దు పోకడలు..

బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి లీజుకు తీసుకున్న ఫాం హౌస్ లో కోడి పందేలు కేసినో ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనిపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. తాజాగా బాల్క సుమన్ కార్మిక సంఘం మీటింగ్ లో చేసిన కామెంట్స్ వివాదం అయ్యాయి. సింగరేణి జీఎం ఆఫీసును తగలబెట్టాలని,అదే విధంగా రైలు పట్టాలను కోసిమిలిటెంట్ పోరాటం చేయాలని బాల్క సుమన్ చేసిన కామెంట్స్ వివాదానికి దారి తీశాయి. ఇకదీనిపై స్వయంగా సుమన్ తాను చేసిన కామెంట్స్ పై వివరణ ఇచ్చుకున్నారు. కేసులు నమోదు అయ్యాయి. తాజాగా ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ద్వితీయ శ్రేణి నాయకులను పట్టించుకోవడం లేదని, ఒంటెద్దు పోకడలు పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై పార్టీ అధిష్టానికి ఫిర్యాదు చేసేందుకు పలువురు నేతలు సిద్ధమయ్యారు. ఇలా రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో నేతల తీరు చర్చకుదారితీసింది. పార్టీ ప్రతిపక్షంలో ఉండటం.. నేతలు వరుసగా వివాదాల్లో ఇరుక్కుంటే పార్టీకి నష్టం తప్పదనే చర్చ గులాబీ పార్టీలో నడుస్తోంది.

పార్టీకి పెద్ద మైనస్..

రాష్ట్రవ్యాప్తంగా ప్రజాసమస్యలపై పోరాడుతూ, ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని అధిష్టానం ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసుకుంది. అయితే, ఈ కీలక సమయంలోనే సొంత పార్టీ నేతల శైలి పార్టీకి పెద్ద మైనస్‌గా మారుతోంది. క్షేత్రస్థాయికి వెళ్లి మైలేజ్ తెచ్చుకోవాల్సిన తరుణంలో, నేతల వ్యక్తిగత వివాదాలను చక్కదిద్దడానికే సమయం సరిపోతోందని సమాచారం. ప్రజాదరణను పెంచుకోవాల్సిన సమయంలో ఈ ఒంటెద్దు పోకడలు తీవ్ర నష్టం చేకూరుస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

అధిష్టానం యాక్షన్ ప్లాన్ ఏంటి?

సొంత నేతల తీరుపై కేడర్ నుంచి వస్తున్న ఫిర్యాదులతో గులాబీ హైకమాండ్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ లైన్ దాటి ప్రవర్తించే వారిపై, వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. త్వరలోనే కొందరు నేతలకు క్లాస్ పీకడమే కాకుండా, అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోరనే సంకేతాలు వస్తున్నాయి. కేవలం హెచ్చరికలతో వదిలేస్తారా? లేక పార్టీ లైన్ దాటిన వారిపై వేటు వేస్తారా అనేది చూడాలి. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా సహించేది లేదనే బలమైన సంకేతాలు పంపకపోతే, రాబోయే రోజుల్లో పార్టీకి మరిన్ని ఇబ్బందులు తప్పవని పలువురు నేతలే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ ‘ఒంటెద్దుపోకడల’కు అధిష్టానం ఎలా బ్రేక్ వేస్తుందో చూడాలి!

Also Read: హిట్ల‌ర్ పాల‌న .. అహంకార ప్ర‌ద‌ర్శ‌న‌!? ఎవ‌రిది..!? నియంతృత్వ పోక‌డ‌ల చ‌రిత్ర ఎట్టిద‌నిన‌..!

 

Related News

తెలంగాణలో రేవంత్ సర్కార్ హరిత యజ్ఞం.. ఈ ఏడాది లక్ష్యం ఎంతంటే..?

‘హిట్లర్’ చుట్టూ రాజకీయాలు.. కేటీఆర్‌కు సామ స్ట్రాంగ్ కౌంటర్, వేలెత్తి చూపే ముందు..

మేమేమన్నా ఓట్లేసే మిషన్లమా?.. కిషన్ రెడ్డిపై వీహెచ్ యుద్ధప్రకటన!

రేవంత్ ఒక హిట్లర్.. విద్యాశాఖ ఒక సర్కస్.. కవిత సంచలనం!

బీఆర్ఎస్​ నేత ఇంట్లో భారీ చోరీ.. కోటిన్నరతో ఉడాయించిన దొంగలు!

జలమండలి ఫలితమే దిక్సూచి.. జీహెచ్‌ఎంసీలోనూ కాంగ్రెస్‌దే గెలుపు: మహేష్ కుమార్ గౌడ్

కేసీఆర్ ఆనవాళ్లు తీసేస్తారా? చరిత్ర ఉన్నంత వరకు ఆయనే ఉంటారు.. తలసాని హాట్ కామెంట్స్!

Big Stories

×