సోషల్ మీడియాలో హరీష్ రావుపై సంచలన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆయన బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తున్నారని, సొంత పార్టీ పెడుతున్నారని కొన్ని సోషల్ మీడియా హ్యాండిళ్లు హడావిడి చేస్తున్నాయి. అక్కడితో ఆగలేదు, పాత టీఆర్ఎస్ పేరుతో ఆయన పార్టీ పెట్టబోతున్నారని కూడా వార్తలు వండి వారుస్తున్నారు. దీనికి కాస్త ఎక్స్ టెన్షన్ గా.. హరీష్ రావు, చంద్రబాబుని కలిశారని, పవన్ కల్యాణ్ వల్లే ఆ భేటీ సాధ్యమైందని కూడా అంటున్నారు. ఈ వార్తలన్నిటికీ మూలం డెక్కన్ క్రానికల్ లో వచ్చిన ఒక వార్త. అందులో హరీష్ రావు ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ని కేసీఆర్ అన్ ఫాలో చేసినట్టు ఉంది. అయితే ఆ వార్తను బీఆర్ఎస్ ఖండించడం ఇక్కడ విశేషం.
బీఆర్ఎస్ ట్వీట్..
సోషల్ మీడియా పుకార్ల నేపథ్యంలో బీఆర్ఎస్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక వివరణ వచ్చింది. హరీష్ రావు ఇన్ స్టా అకౌంట్ ని కేసీఆర్ అన్ ఫాలో చేసినట్టు డెక్కన్ క్రానికల్ లో వార్త ఇచ్చారని, అది పూర్తిగా అసత్యం అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. అసలు కేసీఆర్ కి అధికారిక ఇన్ స్టా అకౌంట్ లేదని వివరణ ఇచ్చారు. అంతే కాదు, అసత్య వార్తలు రాసినందుకు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే డెక్కన్ క్రానికల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు.
We request the @DeccanChronicle to verify facts before publishing.
The news published today in the Deccan Chronicle regarding BRS President Sri KCR garu is false. We would like to clarify that KCR garu does not have an official Instagram account.
We demand that the newspaper… pic.twitter.com/ok3PJLs1u8
— BRS Party (@BRSparty) May 5, 2025
ఈ వివరణ తీసుకుని మరోసారి డీసీ యాజమాన్యం ఇంకో వార్తను ఇచ్చింది. కేసీఆర్ కాదు, హరీష్ ని అన్ ఫాలో చేసింది కేటీఆర్ అంటూ మరో వార్తను ప్రచురించింది. కేటీఆర్ తోపాటు, కవిత కూడా హరీష్ రావు అకౌంట్ ని అన్ ఫాలో చేశారని చెప్పుకొచ్చింది. పనిలో పనిగా సోషల్ మీడియాలో హరీష్ రావు పార్టీ మారబోతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయని డీసీ రాసుకొచ్చింది.
నష్టనివారణ చర్యలు..
సోషల్ మీడియాలో పుకార్లు ఓ రేంజ్ లో షికార్లు చేయడంతో బీఆర్ఎస్ నష్టనివారణ చర్యలు చేపట్టింది. గతంలో కూడా ఇలాంటి పుకార్లు వచ్చినా పార్టీ నుంచి అధికారికంగా ఎప్పుడూ స్పందన రాలేదు. చాలాసార్లు హరీష్ రావు మాత్రమే స్పందించేవారు. ఇప్పటికే చాలాసార్లు చెప్పానని, తాను ఏ పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని అన్నారు. గతంలో మంత్రి పదవి ఆలస్యమైనప్పుడు కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కానీ ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు, హరీష్ రావు వంటి కీలక నేతపై పుకార్లు రావడంతో బీఆర్ఎస్ నేరుగా రంగంలోకి దిగింది. నష్టనివారణ చర్యలు చేపట్టింది. హరీష్ రావుపై వస్తున్న వార్తల్ని పరోక్షంగా ఖండిస్తూ, కేసీఆర్ కి అధికారిక ఇన్ స్టా అకౌంట్ లేదంటూ వివరణ ఇచ్చుకుంది.
హరీష్ ప్రెస్ మీట్..
ఈ పుకార్ల నేపథ్యంలో హరీష్ రావు ప్రెస్ మీట్ మరింత ఆసక్తికరంగా మారింది. అయితే ఆయన కేవలం రైతుల కష్టాల గురించి మాట్లాడారు. అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ, రైతుల కష్టాలపై ప్రభుత్వానికి లేదని విమర్శించారు. తనపై వస్తున్న పుకార్ల గురించి ఆయన ఈ ప్రెస్ మీట్ లో ఏమాత్రం స్పందించకపోవడం విశేషం. అసలు హరీష్ రావులో అసంతృప్తి ఉందా, లేదా అనే విషయాన్ని పక్కనపెడితే.. ఇటీవల బీఆర్ఎస్ రజతోత్సవ సభ తర్వాత ఆ పార్టీ అంతర్గత రాజకీయాల్లో తీవ్ర అలజడి రేగిందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. సభ తుస్సుమనడంతోపాటు, కేసీఆర్ నాయకత్వంపై కూడా ఎవరికీ పెద్దగా అంచనాలు లేవని అంటున్నారు. ఇక కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటే, వారసత్వ పోరులో బీఆర్ఎస్ కోటకు బీటలు వారడం ఖాయమనే అంచనాలున్నాయి. ఈ దశలో హరీష్ రావు పార్టీ మార్పు వార్త మాత్రం సంచలనంగా మారింది.