Kcr comments : తెలంగాణాలో ఈసారి జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని, 100 శాతం విజయం తమనే వరిస్తుందన్నారు.. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR). ఈ విషయంలో ఎవరూ, ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని సూచించారు. గత ఎన్నికల్లో ఓటమి అనంతరం ఇప్పటి వరకు కేసీఆర్ ప్రజల ముందుకు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. ప్రజా సమస్యలపై పోరాటానికో, ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు వచ్చిన సందర్భాలు అయితే అసలే లేవు. అలాంటిది.. తామే అధికారంలోకి వస్తామంటూ… కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశారు.. మాజీ ముఖ్యమంత్రి.
రాష్ట్రంలో అనేక అంశాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య యుద్ధ వాతావరణమే ఉంది. ముఖ్యంగా.. మూసీ, హైడ్రా వంటి అంశాల్లో అయితే నిత్యం విమర్శలు గుప్పించుకుంటూనే ఉన్నారు. వాటితో పాటే, ఎన్నికల వాగ్దానాలు, హామీల అమలు వంటి అనేక విషయాల్లో ఇరుపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులున్నాయి. అయినా.. ఇన్నాళ్లు, ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోయిన కేసీఆర్, ఇప్పుడు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసారు. తమమే అధికారంలోకి వస్తున్నాం, ఏం కంగారు పడకండి అంటూ హితబోధ చేశారు.
ఇటీవల వివిధ కేసుల్లో, గత ప్రభుత్వ అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా దర్యాప్తు చేస్తున్న తరుణంలో.. తాము అరెస్టులకు భయపడేదే లేదని బీఆర్ఎస్ అధినేత తేల్చేశారు. తమ పాలనలో అందరికీ మంచే చేశామని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత.. తామేం కోల్పోయారో ప్రజలకు అర్థమయ్యిందని, అందుకే.. వచ్చేసారి మనకే అధికారం అప్పగిస్తారంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రభుత్వాలు సమాజాన్ని ఉద్దరించేందుకు పనిచేయాలని సూచించిన కేసీఆర్.. ఒక వ్యక్తి కోసమో, రాజకీయాల్లో ఓట్ల కోసమే పని చేయొద్దని పిలుపునిచ్చారు. రాజకీయ నాయకులు తీసుకునే నిర్ణయాలు.. విశాల దృక్పథంతో, బలహీన వర్గాల వారిని ఉన్నతంగా తీసుకువచ్చేందుకు ఉపయోగపడాలని అన్నారు. అధికారం ఇచ్చింది.. ప్రజలను కాపాడేందుకు అన్న బీఆర్ఎస్ అధినేత, ప్రస్తుత ప్రభుత్వం ప్రజలను బెదిరిస్తోందని ఆరోపించారు. మనకు లభించిన అధికారం.. నిర్మించడానికి కానీ, కూల్చడానికి కాదంటూ వ్యాఖ్యానించారు.
రౌడీ పంచాయితీలు చేయడం మాకు తెలుసు అంటూ మాట్లాడిన కేసీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 11 నెలలు గడిచిపోయిందని గుర్తుచేశారు. కొత్త ప్రభుత్వానికి మంచి చేసేందుకు సమయం ఇచ్చానని, ఇకపై తామూ రాజకీయాలు చేస్తామని ప్రకటించారు. తమకూ తిట్టడం వచ్చని వ్యాఖ్యానించి కేసీఅర్.. అధికారం ఇచ్చింది తిట్టడానికి కాదని హితవు బోధ చేశారు.
Also Read : మూసీ ప్రక్షాళనకు మద్ధతిస్తామన్న కిషన్ రెడ్డి.. కానీ, షరతులు వర్తిస్తాయట.. అవేంటంటే
పిచ్చిపిచ్చి వ్యాఖ్యలతో పని లేదన్న కేసీఆర్.. ఇదేం రాజకీయాలంటూ ప్రశ్నించారు. ఇది పద్ధతి కాదని అన్నారు. గత ఎన్నికల్లో ప్రజలకు తామిచ్చిన వాగ్దానాల కంటే చేసిన మంచే ఎక్కువన్న కేసీఆర్.. మ్యానిఫెస్టోలో చెప్పిన వాటికంటే 95 శాతం ఎక్కువగా మంచి చేశామని వ్యాఖ్యానించారు.