BRS Politics: కవిత వ్యవహారం బీఆర్ఎస్‌లో ఎంతవరకు వచ్చింది? అదిగో ఇదిగో కూతురుపై వేటు వేయడం ఖాయమంటూ ప్రచారం సాగింది. పాత ఫార్ములానే కేసీఆర్ కంటిన్యూ చేస్తున్నారా? అర్థరాత్రి వరకు కేసీఆర్ ముఖ్యనేతలతో జరిగిన చర్చల సారాంశం ఏంటి? ఆ పార్టీలు నేతలు ఏమంటున్నారు? అనేదానిపై చర్చ బీఆర్ఎస్ నేతల్లో మొదలైంది.
సోమవారం ఉదయం నుంచి అర్థరాత్రి వరకు తీరిక లేకుండా మాజీ సీఎం కేసీఆర్ గడిపారు. కాళేశ్వరం కేసుని ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించడం, సీబీఐ విచారణ ఆపాలంటూ న్యాయస్థానంలో పిటిషన్ల వేయడం జరిగింది. సాయంత్రం అయ్యేసరికి కవిత వ్యవహారంతో ఒక్కసారిగా టాపిక్ అంతా డైవర్ట్ అయ్యింది.
కాళేశ్వరం కేసు డైవర్ట్ చేసేందుకు బీఆర్ఎస్ ఈ స్కెచ్ వేసిందా? అవుననే అంటున్నారు కొందరు నేతలు. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో అర్థరాత్రి వరకు ఆ పార్టీ ముఖ్యనేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించారు.
సోమవారం నుంచి ఫామ్ హౌస్‌లో మాజీ మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరంపై సీబీఐ విచారణ, కవిత కామెంట్లపై నేతలతో కేసీఆర్ సుదీర్ఘ చర్చించారు. నేతలంతా కవిత ఆరోపణల విషయాన్ని అధినేతకే అప్పగించారు. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది మీరేనని తప్పించుకునే ప్రయత్నం చేశారట.
ALSO READ: కాళేశ్వరంపై సీబీఐ విచారణ.. జరగబోయేది ఇదేనా?
కవిత కామెంట్స్ వల్ల కాళేశ్వరం వ్యవహారం కాస్త డైవర్ట్ అయ్యిందని, ఈ విషయంలో ఏ ఒక్కరూ నోరు ఎత్తవద్దని నేతలతో కేసీఆర్ అన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే మీడియా అటెక్షన్ అంతా మనవైపు ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో నాన్చుడి ధోరణి బెటరని భావిస్తున్నారట.
ఆవేశంలో కవితపై చర్యలు తీసుకుంటే పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని అన్నారట. ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చినప్పుడు కవిత దీక్షకు దిగారని గుర్తు చేశారట. కాళ్వేశ్వరం అవినీతిపై సీబీఐ దర్యాప్తు వేయడంపై అదే పంథాను అనుసరిస్తున్నట్లు గుర్తు చేసుకున్నారట. దీనిపై నేతలు ఎంత సైలెంట్‌గా ఉంటే అంత మంచిదని, కవిత వ్యవహారం తాను చూసుకుంటానని కేసీఆర్ అన్నట్లు సమాచారం.
ఈ వ్యవహారంలో దిగువస్థాయి నేతలు నోరు ఎత్తవద్దని, ఇప్పటికే నేతలకు సంకేతాలు వెళ్లినట్టు ఆ పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది. మీడియాలో ప్రచారం జరిగినట్టుగా వెంటనే నిర్ణయాలు తీసుకోవడం పార్టీకి నష్టమే అవుతుందని అన్నారట. కవిత విషయంలో నోరు ఎత్తడం కంటే సైలెంట్‌గా ఉంటేనే మంచిదని అన్నట్లు తెలిసింది.