KTR Legal Notice To Konda Surekha: మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రాజకీయా వర్గాలతో పాటు సినిమా పరిశ్రమలో సంచలనం కలిగించాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్.. మంత్రి సురేఖకు లీగల్ నోటీసులు పంపించారు. సంబంధం లేని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో పాటు నాగ చైతన్య-సమంత విడిపోవడానికి తానే కారణం అంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ సీరియస్ అయ్యారు. తన గౌరవానికి భంగం కలిగించాలన్న లక్ష్యంతోనే సమంత- నాగచైతన్య పేర్లను తీసుకుంటూ సురేఖ అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని లీగల్ నోటీసులో కేటీఆర్ వెల్లడించారు. ఆమె చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో పాటు 24 గంటల్లో తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే , పరువు నష్టం దావాతో పాటు క్రిమినల్ కేసులు వేస్తామని హెచ్చరించారు.
కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కేటీఆర్
కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కేవలం రాజకీయ కక్షతో, రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును వాడుకుంటున్నారన్నారు. ఒక మహిళ అయి ఉండి ఇంకొక మహిళ పేరును వాడుకొని, వారి వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడడం దురదృష్టకరం అన్నారు. అసలు సంబంధమే లేని ఫోన్ టాపింగ్ వ్యవహారంలోకి తనను లాగడం దారుణం అన్నారు. ఒక మంత్రిగా కొండా సురేఖ తన హోదాను దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా సురేఖ అసత్య పూరిత వ్యాఖ్యలు, దురుద్దేశ పూరిత మాటలు మాట్లాడరని మండిపడ్డారు. ఒక మంత్రిగా తన సహచర అసెంబ్లీ సభ్యుడు అని సోయి లేకుండా కొండా సురేఖ మాట్లాడడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. గతంలో ఇలాగే అడ్డగోలు మాటలు మాట్లాడిన కొండా సురేఖకు గతంలోనే నోటీసులు పంపించిన విషయాన్ని గుర్తు చేశారు.
Read Also: ఆ హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారు.. మంత్రి కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్
24 గంటల్లో క్షమాపణలు చెప్పకపోతే క్రిమినల్ కేసులు వేస్తాం
కొండ సురేఖ ప్రణాళికబద్ధంగా కావాలనే పదేపదే అవే అబద్దాలను ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యక్తిత్వాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తుందన్నారు. అసత్య ఆరోపణలు చేసిన కొండా సురేఖ మీద భారత ఎన్నికల సంఘం సైతం సీరియస్ వార్నింగ్ ఇచ్చిందన్నారు. అయినా తన తీరు మార్చుకోకుండా దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని తన లీగల్ నోటీసులు డిమాండ్ చేశారు. అబద్దాలు, అసత్యాలతో దురుద్దేశపూర్వకంగా మాట్లాడినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి దురుద్దేశపూర్వక, చిల్లర మాటలు మాట్లాడవద్దని సూచించారు . 24 గంటల్లోగా కొండా సురేఖ క్షమాపణ చెప్పకుంటే చట్ట ప్రకారం పరువు నష్టం దావా, క్రిమినల్ కేసులను వేస్తానని హెచ్చరించారు.
Read Also: మీ వ్యాఖ్యలతో కేటీఆర్ ఇంటొళ్లు బాధపడరా..? వాళ్లు ఆడబిడ్డలు కారా..? : కొండా సురేఖపై సబిత సీరియస్