KTR: బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో వెళ్లిన ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఏడాదిన్నర కాంగ్రెస్ పాలన చూశాక ఈ దశాబ్ధపు అతి పెద్ద మోసం కాంగ్రెస్ మేనిఫెస్టోనే అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో గద్వాల నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. వారందరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
‘ఉప ఎన్నికలు వస్తే గద్వాల్ లో మళ్ళీ గులాబీ జెండా ఎగరేస్తామని కేటీఆర్ అన్నారు. ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభయ హస్తమని వ్యాఖ్యానించారు. ‘తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తరువాత 10ఏండ్లు రాష్ట్రానికి బలమైన పునాది వేశాం. దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీని పాలమూరు ప్రజలు నమ్మి బొక్క బోర్ల పడ్డారు. ఇంకా ఎన్ని రోజులు ఈ పాలన చూడాలని ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. కాంగ్రెస్ పాలన చూసి రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారు’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
‘బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన 10 మందికి కర్రు కాల్చి వాతపెట్టాలి. మనతోనే ఉండి మనకే వెన్నుపోటు పొడిచి వెళ్లిపోయారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను తగిన బుద్ది చెప్పాలి. ఆవేశంతో చెప్పడం లేదు. బాధతో మాట్లాడుతున్నా. నాడు నీళ్లు, నిధులు , నియామకాలు కోసం ఉద్యమం చేయాల్సి వస్తే.. నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నిందలు, దందాలు, చందాలు కోసం ఉద్యమం చేయాల్సి వస్తుంది. రుణమాఫీపై అనేక సార్లు మాట మార్చిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి. చారానా కోడికి భారానా మసాలా అన్నట్లు రుణమాఫీ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది’ అని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.
‘సీఎం రేవంత్ రెడ్డి ఒకసారి రాము, ఇంకోసారి రెమో అయితాడు. సినిమాలో రెమోకు జుట్టు ఉంటుంది, రేవంత్ రెడ్డికి జుట్టు ఉండదు అంతే.. మిగదంతా సేమ్ టు సేమ్. రేవంత్ రెడ్డి మాటలను వింటుంటే ఆయన మానసిక స్థితిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చార్మినార్‌ను రాచరికపు ఆనవాళ్లు అన్న సీఎం ప్రపంచ సుందరాంగులను అక్కడికే తీసుకెళ్లి ఫోటో షూట్ చేయించారు’ అని కేటీఆర్ సెటైర్ వేశారు.
ALSO READ: Emmanuel Macron: ముగ్గురు పిల్లలున్న టీచరమ్మతో 15 ఏళ్లకే ప్రేమ.. ఈ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఆటగాడే!
‘గద్వాల్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ఖాయం. 200 జెట్ స్పీడ్ తో కారు గెలవడం ఖాయం. కారు అంటే కేసీఆరే. జూన్ మాసంలో బీఆర్ఎస్ మెంబర్ షిప్ ప్రోగ్రామ్ ప్రారంభిస్తున్నాం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తున్నాం. ఎన్నిక ఏదైనా కాంగ్రెస్, బీజేపీకి గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉండాలి’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ALSO READ: Covid Effect In India: వారంతా జాగ్రత్తగా ఉండాలి.. కొవిడ్ పై ICMR అధికారిక సూచన