Rythu Bharosa Scheme : సంక్రాంతి నుంచి తెలంగాణలో అమలు చేయాలని చూస్తున్న రైతు భరోసా పథకంపై కీలక భేటీ జరిగింది. రైతు భరోసా అమలు, రూపొందించాల్సిన విధివిధానాలపై మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర క్యాబినేట్ నిర్ణయించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేయగా.. నేడు సబ్ కమిటీ భేటిని నిర్వహించారు. ఇందులో రైతు భరోసా అమలుపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన విధానాలపై విస్తృతంగా చర్చ జరిగింది.
రాష్ట్ర సచివాలయంలో దాదాపు రెండు గంటల పాటు నిర్వహించిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో అనేక విషయాలు చర్చకు వచ్చాయి. ఏఏ వర్గాల రైతులకు పెట్టుబడి సాయం అందించాలి, ఏ వర్గాల రైతులకు ఈ సాయాన్ని మినహాయించాలి అనే విషయంపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. ఇప్పటికే వివిధ ప్రవేట్ సంస్థలతో సమావేశం నిర్వహించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. శాటిలైట్ టెక్నాలజీని వినియోగించాలని నిర్ణయించారు. దీని ద్వారా మండలాలు, గ్రామాల వారీగా భూముల వివరాలను సేకరించడం.. సాగులో ఉన్న భూములు, అందులో పండించిన పంటల వంటి సమగ్ర వివరాలు తెలుసుకోనున్నారు. క్షేత్ర స్థాయిలో వచ్చిన సమాచారాన్ని, సాంకేతికంగా సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి అర్హులను నిర్ధరించాలని.. వారికి మాత్రమే రైతు భరోసా సాయాన్ని అందించాలని నిర్ణయించారు. దానికి కొనసాగింపుగా.. నేడు సబ్ కమిటీ భేటీలో రైతు భరోసా విధి విధానాలపై లోతైన చర్చ జరిగింది.
కాగా.. ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసాను అమలు చేయాలనే కీలక అంశం మంత్రివర్గంలో చర్చకు వచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎకరాలతో సంబంధం లేకుండా రైతు భరోసా అందించారు. ఈ విధానంపై రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యింది. వందల ఎకరాల పొలాలున్న రైతులకు పెట్టుబడి సాయం ఎందుకనే ప్రశ్నలు ఎదురయ్యాయి.. ఈ నేపథ్యంలో ఎన్ని ఎకరాలలోపు రైతులకు రైతు భరోసా అందిస్తే బాగుంటుందనే విషయంపై మంత్రివర్గం చర్చించింది.
రైతులు పెట్టుబడి కోసం అధిక వడ్డీలు తీసుకుని ఇబ్బందులు పడకుండా నిరోధించడం, అప్పులు చేసిన వారికే తక్కువ ధరకు పంటల్ని విక్రయించకుండా చేసేందుకు రైతు భరోసా అక్కరకు వస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే.. చిన్న, సన్నకారు, మధ్యస్థాయిలో రైతులకు మాత్రమే రైతు భరోసా అందించేలా నిబంధన పెడితే ఎలా ఉంటుందన్న చర్చ జరిగింది. కానీ.. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలాగే.. ప్రభుత్వానికి పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులను సైతం రైతు భరోసాకు అనర్హులుగా ప్రకటించాలనే చర్చ నడిచింది. కాగా.. ఈ విషయాలపై ఇంకా ఎలాంటి పూర్తి స్పష్టత రాలేదని మంత్రివర్గం వెల్లడించింది.
Also Read : అల్లు అర్జున్ కేసుపై స్పందించిన డీజీపీ.. ఏం చెప్పారంటే?
ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఆయా శాఖల తరఫున సమగ్ర విషయాలతో సాంకేతిక సమాచారం, గణాంకాలను ఆధారంగా చేసుకుని మంత్రివర్గ ఉప సంఘం రైతు భరోసా పై చర్చించింది. ప్రస్తుత సమావేశంలో రైతు భరోసా పథకం అమలకు అనుసరించాల్సిన విధివిధానాలు ఖరారు కాకపోవడం వల్ల మరోసారి సమావేశం నిర్వహించాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది.