HYD Fake doctors : సమాజంలో వైద్యులకు ప్రత్యేక గౌరవం, విలువ ఇస్తుంటారు. వైద్యో నారాయణో హరి అంటూ.. ప్రాణాలు పోసే దేవుళ్లుగా కొలుస్తుంటారు. కానీ.. వైద్యులుగా దొంగ బోర్డులు పెట్టుకుని డబ్బుల దందా నడిపిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. వైద్యం చేసేందుకు ఎలాంటి అర్హతలు, నైపుణ్యాలు లేకుండానే గది ముందు బోర్డు పెట్టుకుని.. అనారోగ్యంతో వచ్చిన వారికి ఇష్టానుసారం వైద్యం చేస్తున్నారు. తాజాగా.. హైదరాబాద్ నగరంలో ఇలాంటి ఎనిమిది మంది నకీలను పట్టుకున్న అధికారులు.. వారిపై కేసులు నమోదు చేశారు.
గత నెలలో హైదరాబాద్ లోని వైద్యశాలలు, క్లీనిక్ లపై తెలంగాణ వైద్య మండలి (TGMC) అధికారులు తనిఖీలు నిర్వహించారు. నగరంలోని అనుమానిత ప్రాంతాల్లో చేపట్టిన సోదాల్లో నకిలీ వైద్యుల గుట్టురట్టైంది. వైద్యం తెలియకున్నా, ఎలాంటి విద్యార్హతలు లేకుండానే క్లీనిక్ లు నడుపుతున్న ఎనిమిది మందిని గుర్తించారు. వారిపై.. నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ – (NMC) కింద కేసులు నమోదు చేసారు. చట్టంలోని సెక్షన్ 34, 54 కింద కేసులు నమోదు చేశారు. ఈ విషయాన్ని టీజీఎంసీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ వెల్లడించారు.
ప్రస్తుత తనిఖీల్లో బయటపడిన వాళ్లంతా ఆర్‌ఎంపి, పీఎంపీ అనే పేరుతో బోర్డులను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. కేవలం డబ్బుల కోసమే ఈ క్లినిక్స్ నడుపుతున్న కేటుగాళ్లు.. వైద్యం, మందులు అవసరం లేకున్నా.. తమ వద్దకు వచ్చిన అమాయక రోగులకు యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్లు ఇస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అందుకు ఆధారాలు సేకరించి, వారిపై కేసులు నమోదు చేశారు.
వీరిపై.. నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ – 2019లోని సెక్షన్ 34 ప్రకారం.. రాష్ట్ర రిజిస్టర్, జాతీయ రిజిస్టర్‌లో నమోదుకానీ వ్యక్తులు వైద్యుడిగా ప్రాక్టీస్ చేయకూడదు. అలాంటి వ్యక్తులు వైద్యానికి, వైద్య సంబంధమైన ఔషధాలు సూచించేందుకు అనర్హులు. అలాగే.. సెక్షన్ 54 ప్రకారం, సంబంధిత చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తులపై నేరపూరిత చర్యలు తీసుకునే వీలుంటుంది. అర్హత లేకుండా అల్లోపతి వైద్యం చేస్తే.. రూ.5 లక్షల వరకు జరిమానా, ఏడాది జైలు శిక్ష విధించవచ్చు.
కేసులు నమోదైన నకిలీ వైద్యుల వివరాలలో..
శ్రీ సాయి క్లినిక్ -డాక్టర్ రమేష్ (నవాబ్‌పేట)
శ్రీ అంబికా హాస్పిటల్ – కే శ్రీధర్ (నవాబ్‌పేట)
శ్రీ వెంకటేశ్వర క్లినిక్ – ఎల్‌వీఆర్ రెడ్డి (ఇందిరా నగర్, కూకట్ పల్లి)
శరణి ప్రథమ చికిత్స కేంద్రం – బిసా వెంకటేశ్వర్లు (హనుమాన్ నగర్, మౌలాలి)
శ్రీ కృప ప్రథమ చికిత్స కేంద్రం – జి భాగ్య రేఖ (నేరేడ్ మట్ పోలీస్ స్టేషన్)
డీఎస్‌ఆర్ హెల్త్ కేర్ పాలీ క్లినిక్, డయాగ్నస్టిక్ సెంటర్ – శ్రీకాంత్ (ఎఎస్ రావు నగర్, హనుమాన్ నగర్)
అస్సాం ప్లస్ క్లినిక్ కౌన్సెలింగ్ సెంటర్ – మొహమ్మద్ అజామ్ హుస్సేన్, మొహమ్మద్ అష్ఫాక్ హుస్సేన్ (హకీంపేట)
శ్రీ మారుతీ క్లినిక్ – చంపాపేట్ శ్రీనివాసా చారి (సరూర్ నగర్)
అక్షయ క్లినిక్ & సాయి అక్షిత – భర్తన్ రషీద్ (చంపాపేట్)
సాయి చైతన్య ప్రథమ చికిత్స కేంద్రం – డి రాంబాబు (శ్రీనివాసనగర్ కాలనీ)
Also Read : కేసీఆర్‌తో చేతులు కలిపారా? ఇక అంతే సంగతులు – అంతా ఇంటి దారి పట్టాల్సిందే!