Panchayat Raj: స్వేచ్ఛ బ్యూరో: తొలిసారి గ్రామపంచాయతీల సమావేశాల తీరును రికార్డు చేసి అప్ లోడ్ చేయబోతున్నారు. సమావేశాల తీరును సైతం పరిశీలించబోతున్నారు. ఈ బాధ్యతను పంచాయతీ కార్యదర్శులకే అప్పగించింది. ఎవరైనా సమావేశానికి హాజరు కాకపోయినా, వెబ్ సైట్‌లో అప్ లోడ్ చేయకపోయినా వారిపై సైతం చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. పంచాయతీల తీరుతెన్నులను బట్టి కేంద్రం నిధులు సైతం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఏది ఏమైనప్పటికీ గ్రామాలపై మాత్రం నిఘా పెట్టినట్లు స్పష్టమవుతోంది.
కేంద్రం మరో కొత్త నిబంధనలు అమలుల్లోకి తీసుకొచ్చింది. గ్రామపంచాయతీ పాలనలో పారదర్శకత, వాటి వివరాలను తెలుసుకునేందుకు వెబ్ సైట్ ను తీసుకొచ్చింది. గ్రామాల్లో ప్రతి నెల జరిగే గ్రామసభ తీరును, చర్చించే అంశాలను వెబ్ సైట్‌లో అప్ లోడ్ చేయాలని మార్గదర్శకాలను రాష్ట్రాలకు పంపింది. ‘సభాసార్’ పోర్టల్‌లో రికార్డు చేసి అప్‌లోడ్ చేయాలని ఆదేశాలిచ్చింది. సమావేశాల నిర్వహణ, ఎలా రికార్డు చేయాలని, ఎలా అప్ లోడ్ చేయాలనేదానిపై స్పష్టంగా ఆ మార్గదర్శకాల్లో పేర్కొంది. సమావేశానికి ముందు, జరుగుతున్నప్పుడు ముగిసిన తర్వాత పంచాయతీ కార్యదర్శులు పాటించాల్సిన విధి విధానాలను సైతం సూచించింది. డిజిటల్ కెమెరాను వినియోగం, వాయిస్ రికార్డింగ్, ఎంపీ 4 లేదా ఎంపీ3 ఫార్మాట్‌లో సేవ్ చేయాలని, ఈ-గ్రామ స్వరాజ్ లాగిన్ ఐడిని ఉపయోగించి ‘సభసార్’ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని పేర్కొంది. సిగ్నల్ తక్కువగా ఉన్నా రికార్డింగ్ పూర్తిచేసి, ఆ తర్వాత నెట్ అందుబాటులో ఉన్నప్పుడు అప్‌లోడ్ చేయవచ్చు అని, ఈ ప్రక్రియలో గ్రామాల్లోని యూత్ వాలంటీర్లు లేదా పంచాయతీ డిజిటల్ కోఆర్డినేటర్ల సాయం తీసుకోవచ్చని మార్గదర్శకాల్లో పేర్కొంది.
Also read: 180 మంది బాలికలపై అఘాయిత్యం.. కామాంధుడిని వీధుల్లో ఊరేగించిన పోలీసులు
కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ‘సభసార్’ పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సరికొత్త టూల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రామ సభల్లో చర్చలు, తీర్మానాలను రికార్డ్ చేయడం, వాటిని భద్రపర్చడం సులువు అవుతుంది. డాక్యుమెంట్లుగా మార్చేందుకు దోహదపడుతుంది. గ్రామ సభ నిర్వహించిన తర్వాత దానికి సంబంధించిన ఆడియో లేదా వీడియో ఫైల్‌ను సభసార్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఏఐ టూల్ ఆ రికార్డింగ్‌ను విశ్లేషించి, అందులో మాట్లాడిన అంశాలను రాతపూర్వక రూపంలోకి మారుస్తుంది. గరిష్టంగా 1 జీబీ సైజు వరకు ఉన్న ఫైళ్లను ఇందులో అప్‌లోడ్ చేయవచ్చు అని అందులో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఈ టూల్ కేవలం ఇంగ్లీష్‌లోనే కాకుండా తెలుగుతోపాటు మరో 12 భాషల్లో అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. సభలో స్థానిక భాషలో మాట్లాడిన అంశాలను ఇంగ్లీష్‌లోకి, తిరిగి తెలుగులోకి మార్చుకునే అవకాశం ఉంటుంది. దీంతో అధికారులు తీర్మానాలను ఎడిట్ చేసుకోవడం, పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవడం సులభమవుతుంది. పంచాయతీ సెక్రటరీలు లేదా అడ్మిన్ అధికారులు ‘ఈ-గ్రామ స్వరాజ్’ లాగిన్ వివరాలను ఉపయోగించి sabhasaar.panchayat.gov.in వెబ్‌సైట్ ద్వారా ఈ సేవలను పొందవచ్చు. అని కేంద్ర మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
గతంలో గ్రామసమావేశాలు నిర్వహిస్తున్నట్లు బుక్ లో నమోదు చేసేవారు. గ్రామ వార్డు సభ్యులు సమావేశానికి హాజరుకాకున్నా.. సర్పంచ్, ఉపసర్పంచ్ సైతం పాల్గొనకున్నా.. అసలు సమావేశాలే నిర్వహించుకున్నా నిర్వహించినట్లు రికార్డులు రాసేవారు. సమావేశంలో తీర్మాణాలు చేయకున్నా చేసినట్లు, సమావేశానికి ఖర్చులు అయినట్లు సైతం రికార్డుల్లో పేర్కొనేవారు. అంతేగాకుండా గ్రామానికి వచ్చిన నిధులు సైతం ఖర్చుల కింద జమచేయడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు సైతం అభివృద్ధి పనులకు ఖర్చు చేసినట్లు చూపి పక్కదారి పట్టించారనే అరోపణలు ఉన్నాయి. సర్పంచ్, ఉప సర్పంచ్ ల మధ్య ఆర్ధిక అంశాల్లో విభేదాలు రావడం.. అవిశ్వాసం పెట్టాలని కోర్టులకు, కలెక్టర్లకు వినతులు సైతం ఇచ్చిన ఘటనలు ఉన్నాయి. అయితే వీటన్నింటికి చెక్ పెట్టేందుకు కేంద్రం తీసుకొచ్చిన సభసార్ పోర్టల్ దోహదపడుతుందని, అన్ని వివరాలను ఇందులో నమోదు చేయడంతో అవి పక్కాగా ఉండే అవకాశం ఉంది. దీంతో గ్రామాల్లో పారదర్శక పాలన కొనసాగే అవకాశం ఉంది.
Also Read: Digvesh Vs Bishnoi: దిగ్వేష్ ను ట్రోల్ చేసిన రవి బిష్ణోయ్..ఇక జన్మలో ఓవరాక్షన్ చేయడు