Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు కేంద్రం షాక్ ఇచ్చింది. నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పాస్ పోర్టులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కీలక నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుల పాస్ పోర్ట్ లను రద్దు చేయాలని పోలీసులు కేంద్రానికి సిఫారసు చేశారు. పాస్ పోర్ట్ ల సస్పెండ్ ను ప్రభాకర్ రావు సవాల్ చేశారు. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వద్ద ప్రభాకర్ రావు తరపున న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు.
తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని ప్రభాకర్ రావు పిటిషన్ దాఖలు చేశారు. ఇక శ్రవణ్ రావు తనకు కేసుతో సంబంధం లేదని బెయిల్ మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఇంటర్ పోల్ ద్వారా ఇద్దరినీ ఇండియాకు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించి దేశానికి రప్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ అంశం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీజేపీ నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేసి అప్పటి ప్రభుత్వానికి సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో పలువురు బాధితులు, నిందితులను అధికారులు విచారించారు. కానీ ఈ కేసులో ప్రభాకర్ రావు ఏ1గా ఉన్నారు. కేసు విచారణ మొదలవ్వగానే ఆయన అమెరికాకు వెళ్లిపోయారు. దీంతో కేసు విచారణను పూర్తి చేసి నిందితులను అదుపులోకి తీసుకోవాలని చూస్తున్నారు. మరోవైపు ఈ కేసులో శ్రవణ్ రావు ఏ6గా ఉన్నారు. ఈయన ఓ మీడియా సంస్థ అధినేత. ఈయన కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు ఆరోపణలతో అమెరికాకు వెళ్లిపోయారు.