HCA Case Updates: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ HCAలో అవకతవకలకు పాల్పడిన నిందితుల కస్టడీ నేటితో ముగియనుంది. HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావు సహా మరో నలుగురిని ఇప్పటికే ఐదు రోజుల పాటు సీఐడీ అధికారులు విచారించారు. ఐదు రోజుల పాటు విచారణలో అధికారులు ఎన్ని రకాలుగా ప్రశ్నించినప్పటికీ నిందితులు మాత్రం సహకరించ లేదని సమాచారం. జగన్మోహన్ రావు సహా మిగతా నిందితులు కూడా ఎలాంటి అక్రమాలు జరగలేదంటూ చెబుతున్నట్లు తెలుస్తోంది.
జగన్మోహన్ రావు అడ్డదారిలో పదవి పొందినట్లు ఆరోపణలు
ప్రధానంగా HCA అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు అడ్డదారిలో పదవి పొందారన్న దానిపై సీఐడీ అధికారులు ఫోకస్ చేశారు. శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ కు చెందిన వారి సంతకాలు ఫోర్జరీ చేసి తప్పుడు మార్గంలో జగన్మోహన్ రావు HCA లోని ప్రవేశించాడు. ఆ తర్వాత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీనికి సంబంధించి శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షులు, జాయింట్ సెక్రటరీ ఇళ్లలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. పలు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. తప్పుడు మార్గంలో అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నిస్తున్నప్పటికీ నిందితులు మాత్రం అందుకు ఒప్పుకోవటం లేదని సమాచారం.
జగన్మోహన్ రావు అధ్యక్షుడు ఎలా అయ్యారన్న దానిపై విచారణ
HCA లో నిధుల గోల్ మాల్, అక్రమాలపై ఐదు రోజుల పాటు సీఐడీ అధికారులు నిందితులను విచారించారు. జగన్ మోహన్ రావు అధ్యక్షుడయ్యాక జరిగిన మ్యాచ్ లకు సంబంధించిన అన్ని రికార్డ్ లను స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి టెండర్లు లేకుండానే తన అనుకూల సంస్థ క్యాటరింగ్ కాంట్రాక్ట్ ఇచ్చినట్లు గుర్తించారు. బీసీసీఐ నిధులకు సంబంధించి కూడా సీఐడీ అధికారులు కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేశారు. బీసీసీఐ నుంచి వచ్చిన నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా నిందితులు విచారణకు పూర్తి స్థాయిలో సహకరించలేదని తెలిసింది.
ఐదు రోజుల విచారణలో పలు కీలక ఆధారాలు సేకరణ
ఐదు రోజుల పాటు విచారణలో సీఐడీ అధికారులు కీలక విషయాలను సేకరించారు. నిందితులను హెచ్‌సీఏ ఆఫీస్‌కు తీసుకెళ్లి .. అక్కడ కొన్ని కీలక ఆధారాలను సేకరించారు. నిధుల గోల్ మాల్ కు సంబంధించి ఎవిడెన్స్‌తో పాటు శ్రీ చక్ర క్రికెట్ క్లబ్‌లో మరికొన్ని ఫోర్జరీ డాక్యుమెంట్లు గుర్తించింది. అటు పరారీలో ఉన్న HCA సెక్రటరీ దేవరాజు అచూకీ ఇంకా తెలియ లేదు. అతన్ని విచారిస్తే మరిన్ని వివరాలు సేకరించ వచ్చని సీఐడీ అధికారులు భావిస్తున్నారు.
Also Read: బీజేపీలో బ్లాస్ట్! అగ్గిరాజేస్తున్న ఈటల, బండి కామెంట్స్
బీసీసీఐ నుంచి వచ్చిన నిధులపై సరైన సమాధానం చెప్పని నిందితులు
మొత్తానికి సీఐడీ విచారణలో నిందితులు పూర్తి స్థాయిలో సహకరించపోవటంతో సీఐడీ అధికారులకు కావాల్సినన్నీ ఆధారాలు లభించలేదు. దీంతో మరోసారి నిందితుల కస్టడీ కోరే అవకాశం ఉంది. ఇవ్వాళ విచారణ పూర్తైన తర్వాత నిందితులను మళ్లీ జైలుకు పంపించనున్నారు.