
Kalvakuntla Chandrashekar Rao : అనారోగ్యంతో బాధపడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ కోలుకోవడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుందని చెప్పారు. సాధారణంగా రికవరీ అయ్యే సమయం కంటే ఎక్కువ టైమ్ తీసుకుంటున్ట్లు కేటీఆర్ వివరించారు. ప్రస్తుతం లంగ్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారని.. త్వరలోనే కోలుకుంటారని పేర్కొన్నారు. కేసీఆర్ తొలుత వైరల్ ఫీవర్ తో అనారోగ్యానికి గురయ్యారని .. జ్వరం నుంచి కోలుకున్నాక బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ వచ్చినట్లు.. ఒక ఇంగ్లీష్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో కేటీఆర్ వెల్లడించారు.
సెకండరీ బాక్టీరియల్ సమస్యలతో ఇబ్బంది పడుతుండటంతో.. దాని నుంచి కోలుకునేందుకు సాధారణంగా పట్టే టైమ్ కంటే ఎక్కువ సమయం పడుతుందన్నారు. త్వరలోనే కేసీఆర్ కోలుకుని ఆరోగ్యంగా బయటకు వస్తారని ఆశాభావాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. ఒకటి రెండు రోజుల్లోనే ఆయన కోలుకుని వస్తారన్నారు. కేసీఆర్ సుమారు 20 రోజులపాటు బయటకు రాకపోవటంతో విపక్షాలు ఆయన అనారోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఇటీవల బీజేపీ నేత బండి సంజయ్ సైతం కేసీఆర్ కనిపించకపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. కేటీఆర్ సీఎం అయ్యేందుకు కేసీఆర్ ను బయట కనపడకుండా చేస్తున్నారని బాహాటంగానే విమర్శలు గుప్పించారు. ఇలా కేసీఆర్ కనిపించకపోవడంపై విపక్షాలు రకరకాలు కామెంట్లు చేస్తుండటంతో స్పందించిన కేటీఆర్… కేసీఆర్ ఆరోగ్యంపై ఇలా వివరణ ఇచ్చారు.