తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ రోజు సీఎం పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా నరసింహస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తరవాత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవం కార్యక్రమంలో భాగంగా నదీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఇప్పటికే సీఎం పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీగా పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు.
Also read: టీడీపీ స్కెచ్.. గుడివాడలో కొడాలి నాని అడ్రస్ గల్లంతేనా?
సీఎం పర్యటన షెడ్యూల్ ఇదే
ఉదయం 9 గంటలకు రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుండి 9.20 గంటలకు యాదగిరిగుట్టకు హెలిప్యాడ్ ద్వారా చేరతారు. అక్కడ నుండి వాహనాల్లో 9.30 నుండి 10గంటల వరకు ప్రెసిడెన్షియల్ సూట్ కు చేరుకుంటారు. 10.05గంటల నుండి 11.15 గంటల వరకు యాదగిరిగుట్ట లక్ష్మి నరసింహస్వామివారికి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. 11.20 ప్రెసిడెన్షియల్ సూట్ కు చేరుకుని,11.30 గంటల ఒంటిగంట వరకు వైటీడీఏ అధికారులతో యాదాద్రి ఆలయ అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.
అనంతరం హెలిప్యాడ్ వద్ద ఒంటి గంట నుండి భోజనం చేయనున్నారు. తరవాత 1.30 గంటలకు ప్రెసిడెన్షియల్ సూట్ నుండి రోడ్డుమార్గంలో వలిగొండ మండలం సంగెం బయలుదేరుతారు. 2.10 నుండి 3 గంటల వరకు బీమలింగం వద్ద పూజల్లో పాల్గొని, పాదయాత్ర చేపడతారు. అక్కడ నుండి సీఎం మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రను ప్రారంభిస్తారు. మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరిస్తారు. ఇదిలా ఉంటే ఇప్పటికే సీఎం పుట్టినరోజు వేడుకలు ప్రారంభం అయ్యాయి. సీఎంకు కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.