CM Revanth Reddy :
⦿ వచ్చే నెల 20న దావోస్‌కు సీఎం రేవంత్ రెడ్డి
⦿ మంత్రి శ్రీధర్ బాబు సహా అధికారులు కూడా
⦿ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్‌కు హాజరు
⦿ ఐదు రోజుల పాటు పెట్టుబడిదారులతో భేటీలు
⦿ రాష్ట్రానికి భారీ స్థాయిలో నిధులు తెచ్చే ప్రయత్నం
స్వేచ్ఛ తెలంగాణ బ్యూరో: వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్‌లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, మరికొందరు మంత్రులు, ఆయా శాఖల అధికారులు జనవరి మూడో వారంలో దావోస్ వెళ్లనున్నారు. మొత్తం ఐదు రోజుల పాటు జరిగే ఈ సెషన్ జనవరి 20న మొదలై 24న ముగుస్తుంది. దీనికి సంబంధించి ఫోరమ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి తెలంగాణ తరఫున ప్రతినిధి బృందం వెళ్ళనుంది.
రైజింగ్ తెలంగాణ నినాదం
గతేడాది జరిగిన సమ్మిట్‌కు వెళ్లిన సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు దాదాపు రూ.41 వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా వివిధ కంపెనీలతో అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ, ఫ్యూచర్ స్టేట్ లాంటి థీమ్‌లను వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు పరిచయం చేశారు. రైజింగ్ తెలంగాణ, రైజింగ్ హైదరాబాద్ పేరుతో ఇటీవలే తొలి వార్షికోత్సవాన్ని (ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా) ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ఆయా శాఖలు సాధించిన ప్రగతిని ప్రజలకు ప్రభుత్వం వివరించింది. ఇదే క్రమంలో గతేడాదికంటే ఎక్కువ స్థాయిలో పెట్టుబడులను తీసుకురావాలని రేవంత్ సర్కార్ ప్రస్తుతం కృత నిశ్చయంతో ఉంది.
ఈసారి గుజరాత్, మహారాష్ట్రతో పోటీగా..
గుజరాత్, మహారాష్ట్రలతో ఈసారి పోటీపడి తెలంగాణను ప్రపంచ చిత్ర పటంలో ప్రముఖంగా నిలబెట్టాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. వాతావరణ పరిస్థితులతో పాటు సుస్థిర ప్రభుత్వం, ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీ తదితరాలను సీఎం, మంత్రి సమావేశాల్లో వివరించనున్నారు. వీరు దావోస్ వెళ్లడానికి ముందే ఐటీ, కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, వాణిజ్యం తదితర విభాగాలకు చెందిన సిబ్బంది అక్కడకు వెళ్లి.. తెలంగాణ పెవిలియన్‌ను నెలకొల్పనున్నారు.
Also Read : రాష్ట్రంలో ఊహించని రీతిలో పెరిగిన సన్న రకం వడ్లు.. ఫలించిన ప్రభుత్వం ‘బోనస్’ హామీ..
దీని ద్వారా రాష్ట్రంలో ఏయే రంగాల పరిశ్రమల స్థాపనకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో, వాటికి ఇప్పటి వరకు గ్లోబల్ పరిశ్రమలుగా గుర్తింపు పొందిన కంపెనీలు కొత్తగా స్థాపించిన యూనిట్లు, వాటి ద్వారా జరిగిన ఎగుమతులు, ఉపాధి కల్పన తదితరాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించనున్నారు.