Hyderabad: తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా తీర్చిదిద్దాలన్నదే మా సంకల్పమన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. దేశ జీడీపీలో తెలంగాణ 5 శాతం కంట్రిబ్యూట్ చేస్తోందన్నారు. దీన్ని 10 శాతానికి పెంచాలనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. వందల ఏళ్ల కిందట దేశ విదేశాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలకు చార్మినార్ ల్యాండ్ మార్క్‌గా మారిందన్నారు. చార్మినార్ తర్వాత బిజినెస్‌కు ల్యాండ్ మార్క్‌గా హైటెక్ సిటీ మారిందన్నారు.
నూతన పారిశ్రామిక విధానంలో మీరంతా భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి పిలుపు ఇచ్చారు. ఇప్పటివరకు మనవాళ్లు కేవలం కార్పొరేట్ కంపెనీలకు సర్వీస్ చేసే వైపు మాత్రమే ఉన్నారని, మన ప్రాంతానికి చెందినవాళ్లు పెట్టుబడులు పెట్టి గ్లోబల్ స్థాయికి ఎదగాలన్నారు. బుధవారం హైటెక్స్‌లో ‘సమాఖ్య-2026’ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. యువత, పారిశ్రామికాభివృద్ధి, రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలు, దేశ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు నా సూచన ఒక్కటేనని, యువతతో పాటు మహిళలను ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వం వైపు నుంచి కావాల్సిన సహకారం అందిస్తామని, మంచి విధానాలను మా ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు. మీ పెట్టుబడులకు మా భరోసా ఉంటుందని, తెలంగాణ రైజింగ్ లక్ష్యంగా ముందుకు వెళదామన్నారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు, చట్టాలను ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలకు ఎదగడానికి సమాజానికి ఆదర్శంగా ఉండాలన్నారు.
2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నది మా లక్ష్యమని తెలిపారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి రాష్ట్రాన్ని CURE, PURE, RARE అని మూడు భాగాలుగా విభజించి అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతం-CURE కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఐటీ, సేవా రంగాలు, అత్యాధునిక టెక్నాలజీ, ఆవిష్కరణలకు ప్రాధాన్యమిస్తున్నట్లు వివరించారు.
ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతాన్ని PURE ప్యూర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా అభివృద్ధి చేసుకున్నట్లు తెలిపారు. ఆ ప్రాంతాన్ని తయారీ పరిశ్రమలు, పారిశ్రామిక పార్కులు, లాజిస్టిక్స్ రంగాలను ప్రోత్సహిస్తామన్నారు. మిగిలిన గ్రామీణ ప్రాంతాలను RARE రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీగా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. ఆ ప్రాంతంలో వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయాధారిత పరిశ్రమలు, గ్రామీణ ఉపాధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలియజేశారు.
ఒకసారి మనం ప్రపంచాన్ని గమనిస్తే మహిళల భాగస్వామ్యం ఉన్న దేశాలు ఆర్థికంగా బలపడ్డాయని వివరించారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణలో మహిళలకు 61 వేల కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించామని, ఆర్టీసీ బస్సులకు, పెట్రోల్ బంకులకు, సోలార్ ప్లాంట్స్‌కు మహిళలను యజమానులను చేశామని వివరించారు. సమాఖ్య అనే పదానికి చాలా బలం ఉందని, పురాతన కాలంలో వస్తు మార్పిడి పద్దతి ద్వారా వ్యాపారం జరిగేదన్నారు. ఆధునిక యుగంలోనూ సమాఖ్యల అవసరం చాలా ఉందన్నారు.
ఆధునిక కాలంలో వస్తున్న మార్పులను తెలుసుకోవడానికి, అంది పుచ్చుకోవడానికి సమాఖ్యలు ఉపయోగపడతాయన్నారు. కొత్తతరం అభివృద్ధి చెందాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సినిమా, రాజకీయ రంగాల్లో మున్నూరు కాపు సామాజికవర్గం నుంచి వివిధ హోదాల్లో రాణించారని, ఉన్నత శిఖరాలకు ఎదగడమే కాదు.. అందరికీ ఆదర్శంగా నిలిచారని గుర్తు చేశారు. సక్సెస్ స్టోరీస్‌ను సమాఖ్య నిక్షిప్తం చేసి కొత్త తరానికి అందించాలన్నారు. 2047 నాటికి స్వతంత్ర భారత్ వందేళ్లు పూర్తి చేసుకోబోతుందని, ప్రధాని మోదీ 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా పని చేస్తున్నారని వివరించారు. ఇందుకు రాష్ట్రాల సహకారం అవసరమన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు అని, అభివృద్ధి విషయంలో కాదన్నారు. అందుకే 2025లో తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేశామన్నారు.