CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి అధ్వర్యంలో సమగ్ర ఇంటి సర్వే విజయవంతంగా పూర్తి చేసుకోగా, ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ద్వారా కులగణన సర్వే నివేదికను సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సర్వే జరిగిన తీరు గురించి సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
అసెంబ్లీలో కులగణన సర్వే నివేదికను ప్రవేశ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధిగా కులగణన సర్వే వివరాలను నివేదిక రూపంలో సభలో ప్రకటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఇదొక చారిత్రాత్మకమైన సందర్భమని సీఎం అన్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కులగణన సర్వే చేపట్టామని, రాష్ట్రంలో 66 లక్షల 99 వేల 602 కుటుంబాల సమాచారాన్ని సర్వే ద్వారా సేకరించామన్నారు.
మొత్తం తెలంగాణలో 96.9 శాతం సర్వే పూర్తి చేశామని, డేటా ఎంట్రీ పూర్తి చేయడానికి 36 రోజులు పట్టిందన్నారు. తమ ఏడాది పాలనలో సర్వేలు విజయవంతంగా పూర్తి చేసి, యావత్ దేశం తమ వైపు చూసేలా సర్వేను నిర్వహించామన్నారు. రాష్ట్రంలో ఎస్సీలు 17.43 శాతం, ఎస్టీలు 10.45 శాతం, బీసీలు 46.25 శాతం, ముస్లిం మైనారిటీల్లో బీసీలు 10.08 శాతం, ముస్లింలతో సహా మొత్తం ఓసీలు 15.79 శాతం ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
దేశంలో బలహీన వర్గాలకు సంబంధించి ఇప్పటివరకు సహేతుకమైన సమాచారం లేదని, దీనితో రిజర్వేషన్లు అమలు చేసే క్రమంలో ఎన్నో ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉందన్నారు. 1931 తర్వాత భారత దేశంలో ఇప్పటివరకు బలహీన వర్గాల సంఖ్య ఎంతో తేల్చలేదని, అందుకే భారత్ జోడోయాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించిన సమయంలో రాష్ట్రంలో కులగణన చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కులగణన పై అసెంబ్లీలో తీర్మానం చేసి, సర్వే ప్రక్రియను కూడా విజయవంతంగా పూర్తి చేయడమే కాక నేడు నివేదికను సభలో ప్రవేశపెట్టామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నివేదికను సభలో ప్రవేశపెట్టినట్లు ప్రకటించగానే సభ్యులు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు.
ఇక సర్వేలో పాల్గొన్న సిబ్బంది గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో తండాల్లో ఎన్యుమరేటర్లు పకడ్బందీగా వివరాలను సేకరించారన్నారు. ప్రతి 150 ఇళ్లను ఒక యూనిట్ గా గుర్తించి ఎన్యుమరేటర్లను కేటాయించి వివరాలు సేకరించామని తెలిపారు. 76,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 36 రోజులు కష్టపడి ఈ నివేదికన రూపొందించారని, ఇందుకు రూ.160 కోట్లు ఖర్చు చేసి నిర్దిష్టమైన పకడ్బందీ నివేదిక రూపొందించినట్లు ప్రకటించారు.
Also Read: CM Revanth Reddy: కేసీఆర్.. సమగ్ర సర్వే వివరాలెక్కడ? సీఎం రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న
పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తర్వాత సభలో ప్రవేశపెట్టామని, 56% ఉన్న బీసీలకు తగిన గౌరవం కల్పించేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దేశానికి ఆదర్శంగా నిలిచేలా నివేదికను రూపొందించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.