CM Revanth Reddy: అసలే పేద కుటుంబం. కళ్ల ముందు కుమారుడు కదలని స్థితిలో ఆ తల్లిదండ్రుల ముందున్నాడు. కుమారుడు పడే భాదను సాధ్యమైనంత వరకు దూరం చేసే ప్రయత్నం చేశారు ఆ తల్లిదండ్రులు. కానీ అప్పటికే చేతులు ఖాళీ అయ్యాయి. ఎవరో వస్తారు ఏదో చేస్తారన్న ఆలోచనలో ఆ బాలుడి తల్లిదండ్రులు ఉన్నారు. చివరకు బాలుడి దీనస్థితి గురించి సమాచారం అందుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. స్వయంగా తానే స్పందించి, ఆ బాలుడికి అండదండగా నిలిచారు. తమ సమస్యకు సాక్షాత్తు సీఎం స్పందించడంపై బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రంగయ్య పల్లి గ్రామంలో లక్ష్మి, సమ్మయ్య దంపతులు నివసిస్తున్నారు. వీరికి రాకేష్ అనే కుమారుడు సంతానం. చిన్నపాటి ఇంటిలో ఉంటూ.. తమ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే రాకేష్ నాలుగేళ్ల వయస్సు నుండి కండరాల క్షీణత వ్యాధితో కదలలేని స్థితిలో ఉన్నాడు. కుమారుడి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వీరు.. సుమారు రూ. 10 లక్షల వరకు ఖర్చు చేశారు.
రాకేష్ నడవలేని స్థితిని తల్లిదండ్రులు చూస్తూ తల్లడిల్లి పోయేవారు. అయితే చదువుపై మక్కువ పెంచుకున్న రాకేష్.. ప్రతిరోజు మూడు చక్రాల సైకిల్ పై తల్లి సాయంతో బడికి వెళ్లేవాడు. అంతేకాదు పదో తరగతి ఉత్తీర్ణత కూడా సాధించి రాకేష్.. తన సత్తా చాటాడు. ఇటీవల రాకేష్ ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించారు.
ఐదు నెలల పాటు రూ. 32 వేల విలువైన ఇంజక్షన్స్ వేయించాలని, అప్పుడే రాకేష్ ఆరోగ్యం కుదుటపడుతుందంటూ వైద్యులు తెలిపారు. ఈ ఇంజక్షన్స్ వేయించని పక్షంలో మృత్యు ఒడికి చేరే అవకాశం ఉన్నట్లు వైద్యులు హెచ్చరించారు. తండ్రి సమ్మయ్య లారీ డ్రైవర్.. తల్లి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా, వైద్యులు చెప్పిన మాట విన్న వారు ఆందోళన చెందారు. తమ కుమారుడి దీనావస్థను తలుచుకుంటూ, కన్నీటి పర్యంతమయ్యారు. చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి.. తమను ఎవరు ఆదుకుంటారని ఆ ఇంటి గుమ్మం ఎదురు చూపుల్లో ఉంది. మానవతావాదులు స్పందించక పోతారా అంటూ రాకేష్ తల్లిదండ్రులు భావించారు.
ఎవరో వస్తారనుకుంటే.. సాక్షాత్తు సీఎం స్పందించారు
తమ కుమారుడి దీనావస్థను తెలుసుకొని ఎవరో వస్తారని ఎదురుచూపులు చూస్తున్న ఆ తల్లిదండ్రులకు.. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి స్పందించడంతో వారి ఆనందానికి అవధులు లేవు. రాకేష్ అనారోగ్య పరిస్థితి గురించి ఆరా తీసిన సీఎం రేవంత్ రెడ్డి, ఉచితంగా వైద్యం అందించడంతో పాటు రాకేష్ కోసం ఛార్జింగ్ వాహనాన్ని కూడా అందించాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలిచ్చిన క్షణం వ్యవధిలోనే.. అధికారులు నేరుగా రాకేష్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు.
Also Read: Raja Lingam Case Updates: రాజలింగం హత్యపై సీఎం ఆగ్రహం.. సీఐడీకి అప్పగించే ఛాన్స్
రాకేష్ ను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని, ఖరీదైన వైద్యం సైతం అందించేందుకు ప్రభుత్వం సహకరిస్తుందంటూ వారికి భరోసానిచ్చారు. తినడానికి తిండి లేని స్థితిలో ఉన్న తాము, బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడుకోలేక పోతున్నామంటూ తీవ్ర ఆవేదన చెందుతున్న పరిస్థితుల్లో నేరుగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం ఆనందంగా ఉందంటూ రాకేష్ తల్లిదండ్రులు తెలిపారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డికి, అధికారులకు వారు ధన్యవాదాలు తెలిపారు.