TG Govt: తెలంగాణలో మండే ఎండల ధాటికి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఉదయం కాగానే భగభగ మండే సూర్యుడు, తన ప్రతాపం చూపుతున్నాడు. చిన్నపాటి వ్యాపారస్తులు తప్పని పరిస్థితుల్లో తమ వ్యాపారాలను సాగిస్తున్న పరిస్థితి. కానీ ఎండల ధాటికి విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వీపుకు బ్యాగ్, చేతిలో చిన్నపాటి గొడుగు ఇలా ఎందరో విద్యార్థులు, ఎండల ధాటికి అవస్థలు పడుతున్న పరిస్థితి. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఒంటి పూట బడులు అమలు చేయాలన్న డిమాండ్ ను విద్యార్థి సంఘాలు వినిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం కూడా ఇదే విషయంపై ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
తెలంగాణ వ్యాప్తంగా వేసవి కాలం ముందుగానే వచ్చింది. మార్చిలో ప్రారంభమయ్యే సమ్మర్ సీజన్ ముందుగానే పలకరించిందని చెప్పవచ్చు. దీనితో ఎండలు విపరీతం కాగా, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 9 గంటలకే సూర్యుడు ప్రతాపం చూపుతుండగా, వృద్దులు, చిన్నారులు బయటకు వచ్చేందుకు సాహసించని పరిస్థితి. హైదరాబాద్ నగరంలో ఎండల తీరే వేరు. గ్రామాల కంటే భిన్నంగా ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎండలే ఎండలు అనేస్తున్నారు నగర వాసులు. ఆఫీసులలో పని చేసే వారికి ఏసీ సదుపాయం ఉన్నప్పటికీ, బయట చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించే వ్యాపారస్థుల పరిస్థితి దారుణమని చెప్పవచ్చు.
అయితే శీతల పానీయాల వ్యాపారాలు జోరందుకున్నాయి. కాగా ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాలలకు ఒంటి పూట బడులు మంజూరు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. గత ఏడాది మండే ఎండలను దృష్టిలో ముందుగానే ఒంటి పూట బడులు ముందుగానే ప్రకటించినట్లు, ఈ ఏడాది కూడా అదే రీతిలో ముందుగానే ఒంటి పూట బడులు ప్రకటించాలని విద్యార్థులు కోరుతున్నారు. అసలే ఎండలు విపరీతం కానున్నట్లు ఇప్పటికే తెలంగాణ వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలోని పలు జిల్లాలలో 35 డిగ్రీల నుండి 37 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి.
నిజామాబాద్ జిల్లాలో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో వడదెబ్బ సోకే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వృద్దులు, చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేకుంటే ఎండల ధాటికి ఆరోగ్య సమస్యలు తప్పవని కూడా వైద్యులు తెలుపుతున్నారు. అందుకే ఈ ఏడాది ముందే వచ్చిన ఎండలను దృష్టిలో ఉంచుకొని, పాఠశాలలకు ముందే ఒంటి పూట బడులు ప్రకటించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం, అతి త్వరలో వేసవి బడులపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.
Also Read: Nizamabad Crime News: స్నేహితుడే కాలయముడు.. సందీప్ హత్య కేసు చేధించిన పోలీసులు
ఫిబ్రవరి 25 నుండి ఒంటి పూట బడులు అమలు చేస్తే, విద్యార్థులకు ఎండల తీవ్రత నుండి ఉపశమనం లభిస్తుందని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. మరి ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా తెలంగాణలో ఒంటి పూట బడులపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే నిజమైతే ముందే వచ్చిన వేసవి ఇబ్బందుల బారి నుండి విద్యార్థులకు కాస్త ఉపశమనం లభించినట్లే.