CM Revanth Reddy: అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసినా.. బీఆర్ఎస్ ఓర్చుకోలేకపోతుందని సీఎం తీవ్ర స్థాయలో ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేస్తుంటే బీఆర్ఎస్ ఎందుకు ఓర్చుకోలేకపోతుంది. ప్రభుత్వంపై ప్రజల్లో కోపం ఉంటుందని అంటున్నారు. అసలు ప్రజలకు ఎందుకు కోపం ఉంటుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినందుకు కోపం ఉంటుందా..? ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 55 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించినందుకు కోపం ఉంటుందా..? గ్రూప్-1 ఉద్యోగాలకు సక్రమంగా నిర్వహించినందుకు కోపం ఉంటుందా..? గ్రూప్-2 ఉద్యోగాలకు భర్తీ చేస్తున్నందుకు కోపం ఉంటుందా.? రైతు రుణమాఫీ చేసినందుకు కోపం ఉంటుందా..? రైతు భరోసా ఇచ్చినందుకు కోపం ఉంటుందా..? వీటికి బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలి’ అని సీఎం రేవంత్ రెడ్డి ఫైరయ్యారు.
‘ఓటమి అవమానంతో ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ ను బయటకు రప్పించలేమా.. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి. వారి గౌరవానికి భంగం కలిగించం. వందం శాతం ఆయన సలహాలు ఇస్తే పాటిస్తాం. కేసీఆర్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు పద్ధతిగా ఉండాలని చెప్పాలి. ప్రతిపక్ష పార్టీగా ఓ పద్దతిగా ఉండండి. ఇష్టారీతిన ప్రవర్తించొద్దు. అసలు జర్నలిస్టులు అంటే ఎవరు..? జర్నలిస్టులు అంటే ఎవరో మీరే నిర్వచనం ఇవ్వండి. జర్నలిస్ట్ సంఘాలను పిలుద్దాం. దీనిపై చర్చ జరగాలి. ఎవరైనా జర్నలిస్ట్ పేరుతో ఇష్టారీతిన ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయి’ అని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఎవరు పడితే వారు జర్నలిస్ట్ ఎలా అవుతారు..? అని సీఎం రేవంత్ రెడ్డి మండి పడ్డారు. ప్రభుత్వం గుర్తించిన పత్రికలు, మీడియా సంస్థలు, అక్కడ పని చేసే ప్రతినిధులు జర్నలిస్టులా లేకా కుటుంబాలపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్లు జర్నలిస్టులా అని ఫైరయ్యారు. వాళ్ల కామెంట్స్ చూస్తుంటే రక్తం మరిగిపోతుందని సీఎం కొంత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాజీవితంలో ఉన్నాం కాబట్టి ఊరుకొని ఉంటున్నామని చెప్పారు. లేకుంటే పరిస్థితి ఇంకోలా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్టు కామెంట్ చేస్తుంటే బాధ కలుగుతుందని సీఎం రేవంత్ అన్నారు. అందుకే దీనిపై అందరూ బాధ్యతగా స్పందించాలని సూచించారు. అవసరమైతే చట్టం తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. జర్నలిజం ముసుగులో కొందరు చేసే వ్యక్తిగత కామెంట్స్‌ను చూస్తుంటే తనతో పాటు చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు. ఇదే విషయం ప్రజలకు పార్టీ కార్యకర్తలకు తెలిస్తే బట్టలు ఊడదీసి రోడ్డుపైకి తీసుకొచ్చి కొడతారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులను కూడా తిటిస్తే రక్తం మరిగిపోదా అని సీఎం ప్రశ్నించారు. మా స్థానంలో వారి కుటుంబ సభ్యులు ఉంటే ఆ బాధ ఏంటో అప్పుడు తెలుస్తుందని అన్నారు. ప్రజాజీవితంలో ఉన్నాం కాబట్టి చూసీచూడనట్టు వెళ్లిపోతున్నామని ఇకపై ఉపేక్షిస్తే చూస్తూ ఊరుకోమని సీఎం రేవంత్ రెడ్డి ఫైరయ్యారు.