CM Revanth Reddy: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరగడంపై రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న సంఘటనలు దృష్టికి రావటంతో అధికారులతో మాట్లాడారు. దీన్ని గమనించిన సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు కీలక సూచనలు చేశారు.
ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పెడితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లఘించేవారిపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే వ్యాపారులపై ఎస్సెన్సియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్(ESMA) కింద చర్యలు తీసుకోవాలని సూచించారు.
కొనుగోళ్లు సాఫీగా జరిగేలా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని చెబుతూనే, పంటల కొనుగోళ్లలో మోసాలకు పాల్పడకుండా చూడాలన్నారు. రైతులను వేధిస్తే ఊరుకునేది లేదన్నారు. ఏమైనా ఇబ్బందులుంటే ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో తరుగు పేరిట దోపిడీకి గురవుతున్నారు రైతులు. ఈ క్రమంలో వ్యాపారులు చెలరేగి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని విపక్షాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి.
ALSO READ: హైదరాబాద్ లో కాల్పుల కలకలం.. ప్రేయసిని విదేశానికి పంపాడని ఆమె తండ్రిపైనే!
కొనుగోళ్లు జాప్యం జరగడంతో మిల్లర్లు, రైస్ వ్యాపారులు రంగంలోకి దిగేశారు. రైతుల నుంచి దోచుకోవడం మొదలైంది. ఈ క్రమంలో అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి. కొనుగోళ్ల సెంటర్లకు పంటను తీసుకొచ్చినా కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోతున్నారు.
అక్టోబర్ చివరికి 8.16 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని పౌర సరఫరా శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే నవంబర్ తొలివారానికి దాదాపు 4 లక్షల టన్నులు మాత్రమే కొనుగోళ్లు జరిగాయి.
గతనెల మొదటివారం వరి కోతలు మొదలుకాగా, కొనుగోళ్లు మాత్రం నవంబరు మొదటివారం ప్రారంభమయ్యాయి. ఒకేసారి సెంటర్లకు వరి పంట వచ్చింది. పరిస్థితి గమనించిన దళారులు, వ్యాపారులు రంగంలోకి దిగేశారు.
వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడంతో రైతులు కంగారుపడ్డారు. వర్షం పడితే మొదటికి ముప్పు వస్తుందని భావించిన రైతులు, దళారులను ఆశ్రయించారు. ఈ క్రమంలో తరుగు పేరిట దోపిడీకి శ్రీకారం చుట్టిన విషయం తెల్సిందే.