BigTV English

CM Revanth Reddy: చదువు-పోరాటం నేర్పింది ఓయూ.. మానవ రూపంలో మృగాలున్నాయి, జాగ్రత్త చెప్పిన సీఎం రేవంత్

CM Revanth Reddy: చదువు-పోరాటం నేర్పింది ఓయూ.. మానవ రూపంలో మృగాలున్నాయి, జాగ్రత్త చెప్పిన సీఎం రేవంత్

CM Revanth Reddy: చదువుతోపాటు పోరాటాన్ని నేర్పింది ఉస్మానియా యూనివర్సిటీయేనని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీ.. తెలంగాణ అనే పదానికి ప్రత్యామ్నాయమని అన్నారు. ఈ రెండూ అవిభక్త కవలల్లాంటివన్నారు. ఉస్మానియా గడ్డ మీది నుంచే పీవీ నరసింహారావు దేశ స్వాతంత్య్రం కోసం ధిక్కార స్వరాన్ని వినిపించారని గుర్తు చేశారు.


1938 సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిలూదిన గడ్డన్నారు.  చెన్నారెడ్డి, జైపాల్ రెడ్డి వంటి నేతలు ఇక్కడి నుంచి వచ్చినవారేనని అన్నారు. తెలంగాణలో ఏదైనా సమస్య వచ్చినా, ఉద్యమానికి పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటియేనని వివరించారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించారు. కొత్తగా నిర్మించిన హాస్టల్ భవనాలను ప్రారంభించారు.

రూ.10 కోట్లతో డిజిటల్ లైబ్రరీ రీడింగ్ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్‌లను అందించింది ఓయూ అని తెలిపారు. ఓయూని సందర్శించి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాలని వీసీ ఆహ్వానం మేరకు వచ్చినట్టు చెప్పారు.


తెలంగాణ నలుమూలలా ఏ సమస్య వచ్చినా మొదట చర్చ జరిగేది ఇక్కడేనన్నారు. ఓయూకు గొప్ప చరిత్ర ఉందని, వందేళ్లలో వీసీగా దళితుడిని ప్రభుత్వం నియమించిందన్నారు. గత పాలకులు కుట్ర వల్ల ఓయూను నిర్వీర్యం చేశారన్నారు. రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం చేతులెత్తేసినప్పుడు.. తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లింది ఉస్మానియా యూనివర్సిటీ అని గుర్తు చేశారు.

ALSO READ: మంచుకొస్తున్న మరో అల్పపీడనం.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి అని అన్నారు. యాదయ్య, ఇషాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి రాష్ట్ర సాధనలో సమిధలయ్యారని చెప్పారు. ఎంతో మంది మేధావులను అందించిన ఘనత ఉస్మానియా యూనివర్సిటీ సొంతమన్నారు.

ఉస్మానియా యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకురావాలని ఆలోచన చేశామని, అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో వర్సిటీలకు వీసీలను నియమించామన్నారు. చదువుకుని చైతన్యం ఉన్నవారిని వీసీలుగా నియమించినట్టు వివరించారు ముఖ్యమంత్రి.

21 ఏళ్ల వయసులో IASలుగా దేశానికి సేవలందిస్తున్నప్పుడు, ఆ వయస్సులో శాసనసభలో ఎందుకు అడుగుపెట్టకూడదని ప్రశ్నించారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆవేదన కలుగుతోందన్నారు. ప్రస్తుతం యువతను గంజాయి, డ్రగ్స్ పట్టి పీడిస్తున్నాయన్నారు. చదువు, చైతన్యం ఉంటేనే సమాజంలో రాణిస్తారని, పంచడానికి తన దగ్గర భూములు, ఖజానా లేవన్నారు.

మీకు తాను ఇవ్వగలిగింది కేవలం విద్య ఒక్కటేనని, మీ తలరాతలు మార్చేది చదువొక్కటేన్నారు. అదే మిమ్మల్ని ధనవంతులు, గుణవంతులను చేస్తోందన్నారు. పేదరికం మాకు కొత్త కాదని అవన్నీ చూసి వచ్చామన్నారు. యూనివర్సిటీ అభివృద్ధి అధ్యయనానికి ఇంజనీర్స్ కమిటీ వేయాలని అధికారులను ఆదేశించారు. ఓయూని స్టాన్‌ఫర్డ్, ఆక్స్‌ఫర్డ్ స్థాయిలో తీర్చిదిద్దుతామన్నారు.

వర్సిటీ అభివృద్ధికి ఏం కావాలో అడగాలని, అంచనాలు తయారు చేసి ఇవ్వాలన్నారు సీఎం. మళ్లీ యూనివర్సిటీకి వస్తానని, ఆర్ట్స్ కాలేజీ వద్ద మీటింగ్ పెట్టి నిధులు మంజూరు చేస్తానన్నారు. ఆ రోజు యూనివర్సిటీలో ఒక్క పోలీస్ కనిపించొద్దని, నిరసన తెలిపేవారిని తెలపనివ్వాలన్నారు. తాను రావొద్దని అడ్డుకునేవారికి సమాధానం చెప్పే చిత్తశుద్ధి తనకు ఉందన్నారు.

కొంతమంది రాజకీయ నాయకులకు పదవులు పోయాయన్న ఆవేదన ఉంటారని, వారి ఉచ్చులో యువత పడొద్దన్నారు. సమస్య ఉంటే మాకు చెప్పండి.. మా మంత్రులు మీకు నిత్యం అందుబాటులో ఉంటారన్నారు. ప్రొఫెసర్ కోదండరామ్‌పై కుట్ర చేసి పదవి తొలగించారన్నారు. ఆయనకు మళ్లీ ఎమ్మెల్సీ ఇస్తామన్నారు. అపోహలకు లోనుకావద్దని, అబద్ధాల సంఘం చెప్పే మాటలు నమ్మొద్దన్నారు.

వాట్సాప్, సోషల్ మీడియాలో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు సీఎం. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో సెంట్రల్ యూనివర్సిటీలో సింహాలు, ఏనుగులు ఉన్నాయని ప్రచారం చేసి అడ్డుకుంటున్నారని గుర్తు చేశారు. అసలు తెలంగాణలో సింహాలు, ఏనుగులు లేనేలేవన్నారు.

మానవ రూపంలో ఉన్న మృగాలు ఉన్నాయని, వాళ్లు తెలంగాణ సమాజానికి పట్టిన చెదలు లాంటివారన్నారు. వాళ్లు మళ్లీ వస్తే ఉస్మానియా యూనివర్సిటీని ఉండనివ్వరని, మీ చదువుకు ఏం కావాలో అడగాలని, అభివృద్ధి చేసే బాధ్యత తనది చెప్పుకొచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి.

 

 

Related News

KTR: కేంద్రంలో 2 కోట్లు, రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఏమైనయ్.. అన్ని వట్టి మాటలేనా..? కేటీఆర్ ఫైర్

Khairatabad Ganesh: విశ్వశాంతి మహాశక్తి రూపంలో ఖైరతాబాద్ గణపతి.. ఈసారి ఎన్ని అడుగులంటే..

Wife beats husband: భర్తను చితక్కొట్టిన భార్య.. ఏడుస్తూ పోలీసులకు ఆశ్రయించిన భర్త

Rain Alert: ముంచుకోస్తున్న మరో అల్పపీడనం.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Telangana: తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. గణేష్, దుర్గా మండపాలకు ఉచిత విద్యుత్..

Big Stories

×