Hyderabad News : ఉద్యమాల్లో క్షేత్రస్థాయిలో పోరాడి అసువులు బాసిన వాళ్ల కంటే వారిని అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ది పొందిన వారి గురించే గత పదేళ్ల కాలంలో ఎక్కువగా చర్చ జరుగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బుక్ ఫెయిర్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. యువతను పుస్తక పఠనం వైపు మళ్లించాల్సిన ఆవస్యకత ఉందని అభిప్రాయపడ్డారు. ఉద్యమాలు, చరిత్ర సహా అనేక విషయాలపై ఆలోచింపజేసే ప్రసంగం చేశారు.
మూడు దశాబ్దాలుగా నిర్విరామంగా కొనసాగుతున్న హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఏర్పాటు చేసిన 37 వ పుస్తక ప్రదర్శనలో పాల్గని.. స్టాళ్లను తిలకించారు. అనంతరం స్టేడియంలో ఏర్పాటు చేసిన బోయి విజయ భారతి సభా వేదిక నుంచి ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి.. రచయితల గొప్పదనాన్ని వివరించారు. సమాజానికి పుస్తకాలు చేస్తున్న ఉపయోగాన్ని ప్రస్తావించి సీఎం రేవంత్ రెడ్డి.. రచనా రంగంలో సరిచేసుకోవాల్సిన అంశాల్ని సూచించారు.
చరిత్రలో ఎప్పుడూ గెలిచిన వాళ్లదే ఆధిపత్యం అని వ్యాఖ్యానించి సీఎం రేవంత్ రెడ్డి.. వాళ్లు రాసుకునేదే చరిత్రగా ఆవిష్కృతమవుతోందని అన్నారు. కానీ క్షేత్రస్థాయి పోరాటాల్లో అసులు బాసిన వాళ్లు, అమరులైన వీరుల గురించి చరిత్రలో కొంత నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. వారి గురించిన సమాచారం అనుకున్న స్థాయిలో లభ్యం కాదన్న విషయాన్ని గుర్తు చేశారు. అలాగే.. సాయుధ రైతాంగ పోరాటం, తొలి దశ తెలంగాణ ఉద్యమైనా, మలి దశ తెలంగాణ ఉద్యమమైనా.. ఉద్యమాల్లో సమిధలైన, అమరులైన వారు నిర్లక్ష్యానికి గురైయ్యారని వ్యాఖ్యానించి సీఎం.. రాజకీయంగా ప్రయోజనం పొందిన వారి గురించే ఎక్కువ చర్చలు జరుగడాన్ని ప్రస్తావించార. కానీ.. చరిత్రలో అసలైన చరిత్రకారులకే తొలిస్థానం కల్పించాలని సూచించారు.
ఉద్యమాల పట్ల చరిత్రకారులు వాస్తవాలను రాయకపోతే అసలైన పోరాట యోధులు, ఉద్యమాల్లో అసువులు బాసిన అమరుల గురించి భవిష్యత్తు తరాలకు అసంపూర్తి సమాచారమే అందుబాటులో ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అందువల్ల వాస్తవాలను సమాజం ముందు ఆవిష్కరించాలంటే కవులు, కళాకారులు తమ కలాలకు పదును పెట్టాలని, తమ గళాలను విప్పాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. గత పదేళ్లుగా మన కళ్ల ముందున్న చరిత్రలో వాస్తవాలు, అవాస్తవాలు గమనించి కవులు, కళాకారులు తమ కలాలను పదును పెట్టాలని కర్తవ్య బోధ చేశారు. అసలైన చరిత్రలో ఎలాంటి వక్రీకరణలు లేకుండా ప్రజల ముందుంచాలని కోరారు.
సమాజం అధునాతన యుగం వైపు, సాంకేతిక పరిజ్ఞానం వైపు వెళుతున్న సందర్భంలో డిజిటల్, సోషల్ మీడియాల వల్ల ప్రజలకు ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో గ్రహించే అవకాశం లేకుండా పోతుందని అన్నారు. ఇలాంటి వాటన్నింటికీ పుస్తకాలే సమాధానాలుగా నిలవాలని సూచించారు. యువతను పుస్తక పఠనం వైపు మళ్లిస్తే వాస్తవాలు తెలుసుకునే వీలుంటుందని అభిప్రాయ పడ్డారు.
Also Read : పండక్కి ఊరు వెళుతున్నారా?.. మీకు హాలిడే, దొంగలకు వర్కింగ్ డే.. పోలీసుల కీలక సూచనలు
జాతీయ స్థాయి పుస్తక ప్రదర్శన ఈ స్థాయికి రావడాన్ని అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి.. 1985 లో సిటీ సెంట్రల్ లైబ్రరీలో చిన్నగా ప్రారంభించిన బుక్ ఫెయిర్ ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో చేపట్టడాన్ని ప్రశంసించారు. ఈ ప్రదర్శనలో ఎంతో మంది మేధావులు, రచయితలు పాల్గొని వచ్చే తరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని అన్నారు. బుక్ ఫెయిర్ నిర్వహకులు ప్రస్తావించిన విషయాలపై ప్రొ. కోదండరాం ను నివేదిక కోరిన సీఎం రేవంత్ రెడ్డి.. వాటిని పరిశీలించి సామాజిక బాధ్యతగా నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.