CM Revanth Reddy: నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లో ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తెచ్చేందుకు తొమ్మిది రోజులుగా నిర్విరామంగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ ను సీఎం సమీక్షించారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పర్యాటక శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు.
ALSO READ: Minister Sitakka: నిరుద్యోగుల భారీ గుడ్ న్యూస్.. 14,000 ఉద్యోగాలకు మార్చి 8న నోటిఫికేషన్ రిలీజ్
మంత్రుల బృందంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి సొరంగంలోకి వెళ్లి పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యల వివరాలను సీఎం రేవంత్ రెడ్డికి రెస్క్యూ టీమ్ అధికారులు వివరించారుు.టన్నెల్‌ను పరిశీలించిన అనంతరం ఆయన అధికారులతో పరిస్థితిపై సమీక్షించారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులపై సమావేశమయ్యారు. సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయి? ఎంతవరకు పురోగతి సాధించారు? అనే దానిపై సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. టన్నెల్ పరిశీలన అనంతరం ఆయన అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా చూసుకోవాలి. ఈ ప్రమాదాన్ని ఓ కేస్ కస్టడీగా తీసుకోవాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్ట్ పట్ల నిర్లక్ష్యం వహించింది. గత పదేళ్లలో రెండు కిలోమీటర్లు కూడా టన్నెల్ తవ్వలేదు. 2005 లో ఎస్ఎల్ బీసీ టన్నెల్ పనులు మొదలయ్యాయి. పనులు చేస్తుండగా అనుకోకుండా ప్రమాదం జరిగింది. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలి. పదేళ్లపాటు ఎక్కడి పనులు అక్కడే ఉండిపోయాయి. మిషన్ లకు కూడా కరెంట్ ఇవ్వలేదు. మేం వచ్చాక ప్రాజెక్ట్ పనులు ఊపందుకున్నాయి. బాధిత కుటుంబాలకు సానుభూతి చూపించాలి’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
‘ఆర్మీ, టన్నెల్ నిపుణులతో సహా 11 డిపార్ట్ మెంట్స్ సహాయక చర్యల్లో పనిచేస్తున్నాయి. వారిని మనస్పూర్తిగా అభినందిస్తున్నా. టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఇప్పటికీ ఒక అంచనాకు రాలేదు. ఈ సమస్య ఒక కొలిక్కి రావడానికి మరో రెండు, మూడు రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. కన్వేయర్ బెల్ట్ పాడవడంతో లోపల మట్టిని బయటకు తరలించడం ఇబ్బందిగా మారింది. రేపటిలోగా కన్వేయర్ బెల్ట్ ను రిపేర్ చేస్తే లోపల ఉన్న మట్టిని బయటకు తరలించడం సులువు అవుతుంది. ఆ ఎనిమిది మంది లోపల ఎక్కడ చిక్కుకుపోయారో, ఎక్కడ మిషనరీ పాడైపోయిందో అధికారులు ఇంకా పూర్తిస్థాయి అంచనాకు రాలేదు. ప్రమాదం జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, ప్రస్తుత పరిస్థితిపై సమీక్ష చేశాం. ఇది ఒక విపత్తు… మనందరం ఏకతాటిపై నిలబడి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని సీఎం వ్యాఖ్యానించారు.
‘గతంలో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ లో పవర్ జనరేషన్ లో ప్రమాదం జరిగితే ఎవ్వరినీ అక్కడికి వెళ్లనివ్వలేదు. ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా నేను వస్తే నన్ను జైల్లో పెట్టారు. దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో ఎక్కడ మరణించినా ఆనాడు ప్రభుత్వం విపక్షాలను అనుమతివ్వలేదు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అక్కడకు వెళ్ళలేదు. కానీ ఇవాళ మేం ఘటన జరిగిన వెంటనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పంపి, కేంద్రంతో సమన్వయం చేసుకుని అన్ని సంస్థలను ఇక్కడికి రప్పించాం. ప్రపంచంలోనే అతిపెద్ద టన్నెల్ ఇది. మేం మనోధైర్యం కోల్పోలేదు. ప్రమాదంలో చిక్కుకున్న వారి కుటుంబాలను ఆదుకోవడంతో పాటు ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ఈ సమస్య పరిష్కరించేందుకు అవసరమైతే రోబోలను ఉపయోగించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలనే పట్టుదలతో ఉంది. ఇందుకు మీరంతా సహకరించాలని కోరుతున్నా’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.