Revanth Kodangal Visit :
⦿ కొడంగల్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్
⦿ మద్దూరు, రేగడి మైలారంలో ఆత్మీయ పరామర్శ
⦿ చనిపోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు భరోసా
కొడంగల్, స్వేచ్ఛ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం కొడంగల్ నియోజక వర్గంలో పర్యటించారు. మద్దూరు మండల కేంద్రంలోని కాంగ్రెస్ సీనియర్ నేత కల్లపు శివరాజ్ కుమారుడు సతీష్ ఇటీవల మరణించగా, శనివారం జరిగిన సతీష్ దశదినకర్మ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అనంతరం ఆయన బొంరాస్‌పేట మండలం రేగడి మైలారంలో ఇటీవల కన్నుమూసిన కాంగ్రెస్ నేత నర్సిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సీఎం వెంట మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్ కుమార్, మాజీ జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు శివరాజ్, సొసైటీ చైర్మన్ నర్సింలు, కోస్గి మార్కెట్ చైర్మన్ బీములు, వైస్ చైర్మన్ గిరి ప్రసాద్ రెడ్డి, కోస్గి మండల అధ్యక్షుడు రఘువర్ధన్ రెడ్డితో పాటు, మల్లికార్జున, తిరుపతిరెడ్డి, సంజీవ్, మహేందర్ రెడ్డి, రవికుమార్, తదితరులున్నారు.
ALSO READ : చివరి దశకు కాళేశ్వరం కమిషన్ విచారణ.. నివేదికపై ఉత్కంఠ.. అవినీతి నిరూపితమైతే అరెస్టులు తప్పవా!
ధైర్యంగా ఉండండి..
శనివారం ఉదయం 11 గంటలకు సీఎం ప్రత్యేక హెలికాప్టర్‌లో కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని మద్దూరు మండలానికి చేరుకొన్నారు. మద్దూరు మండల కేంద్రంలోని కాంగ్రెస్ సీనియర్ నేత కల్లపు శివరాజ్ నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి ఇటీవల మరణించిన శివరాజ్ కుమారుడు కల్లపు సతీష్ దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. సతీష్ చిత్రపటానికి ముఖ్యమంత్రి ఘన నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సతీష్ అకాల మరణం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులెవరూ అధైర్య పడొద్దని, అండగా ఉంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.
నేనున్నా..
అనంతరం మద్దూరు నుంచి ముఖ్యమంత్రి మ.12 గంటలకు బొంరాస్‌పేట మండలం రేగడి మైలారం గ్రామానికి చేరుకున్న సీఎం ఇటీవల మృతి చెందిన సీనియర్ నేత నర్సిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. నర్సిరెడ్డి చిత్రపటానికి నివాళి అర్పించి, ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులను పేరుపేరునా పలకరించి, వారికి ధైర్యంచెప్పారు. ఏ సహాయం కావాలన్నా తానున్నానని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. కొడంగల్ పర్యటన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు బయలుదేరారు.