CM Revanth Reddy : పరిపాలనలో సామాజిక న్యాయం చేయడం రేవంత్ సర్కార్‌కే సాధ్యమైంది. బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టుగా పదవుల పంపకాలు.. అధికారుల బదిలీల విషయంలో సమతూకం జరగడం లేదా? అంటే అదంతా తప్పు అని బల్లగుద్ది చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటివరకు జరిగిన బదిలీలు, నియామకాల వివరాలను మీడియా ముందుంచారు.
తెలంగాణలో జనరంజక పాలన సాగుతుందని అధికార కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అదే టైంలో కనీసం సామాజిక న్యాయం కూడా పాటించడం లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. మరి ఈ రెండింట్లో ఏది నిజం.. రేవంత్ సర్కార్ కొలువుదీరినప్పటి నుంచి జరిగిన నియామకాలు.. పదవుల పంపకాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం. పదవులు సహా అన్ని రిక్రూట్మెంట్లలో సామాజికవర్గాలవారీగా అందరికీ పెద్దపీట వేస్తున్నామని అధికార పక్షం చెబుతోంది.
రేవంత్ సర్కార్ కొలువుదీరి రెండు నెలలు పూర్తికావొస్తుంది. అంటే ఆల్ మోస్ట్ 60 రోజులు అన్నమాట. కానీ ఈలోగానే ప్రతిపక్ష బీఆర్ఎస్ కాంగ్రెస్‌పై అభాండాలు వేస్తోంది. పాలనలో సామాజిక న్యాయం పాటించడం లేదని ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ ఆరోపణలను కాంగ్రెస్ నేతలు సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి మల్లు రవి.. బీఆర్ఎస్‌కు కౌంటర్లు ఇచ్చారు. మహిళలకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వకుండా వారిని వంటింటి కుందేళ్లుగానే చూసిన పార్టీ బీఆర్ఎస్ అని ఆరోపించారు.
తెలంగాణలో ప్రజాపాలన అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. హామీకి అనుగుణంగానే తన మార్క్ పాలనను షురూ చేశారు రేవంత్‌రెడ్డి. ఎందుకంటే సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం ఓవైపు.. ప్రగతిభవన్ గడీలు బద్దలుకొట్టే పని మరోవైపు. సీన్ కట్ చేస్తే గంటల వ్యవధిలోనే ప్రగతిభవన్ గఢీలు బద్దలయ్యాయి. అప్పటినుంచే ప్రజాపాలన ప్రారంభమైందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
ఇక కేబినెట్‌తోపాటు అధికారులకు పోస్టింగ్ ఇవ్వడంలోనూ రేవంత్ సర్కార్ సామాజిక న్యాయం పాటిస్తోంది. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్ ఎంపిక. అవును ఉమ్మడి ఏపీయే కాదు.. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో దళితులు ఏనాడూ స్పీకర్‌గా పనిచేసిన సందర్భాలు లేవు. కానీ రేవంత్ ప్రభుత్వంలో మాత్రం వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గడ్డం ప్రసాద్ కుమార్‌కు స్పీకర్‌గా అవకాశమిచ్చారు… సీఎం రేవంత్‌రెడ్డి. డిప్యూటీ సీఎం పదవి దళితుడైన భట్టి విక్రమార్కకు దక్కింది. ఇక మంత్రిమండలి కూర్పులోనూ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటించింది. ఆందోల్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే దామోదర రాజనర్సింహా దళితుడు. ఆయనకు వైద్యారోగ్యశాఖ మంత్రిగా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్.
కోయ జాతికి చెందిన ములుగు ఎమ్మెల్యే సీతక్క, పద్మశాలి సామాజికవర్గానికి చెందిన కొండా సురేఖ, గౌడ సామాజికవర్గం నుంచి పొన్నం ప్రభాకర్, బ్రాహ్మణ సామాజికవర్గం నుంచి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మంత్రివర్గంలో ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావుకు వెలమ సామాజికవర్గం కోటాలో మంత్రి పదవులు దక్కాయి. ఆ తర్వాత కీలకమైన ప్రభుత్వ విప్‌లలోనూ సామాజిక న్యాయం పాటించిన చరిత్ర కాంగ్రెస్ సర్కార్‌దే. ప్రస్తుతానికి శాసనసభలో నలుగురు ప్రభుత్వ విప్‌లు ఉన్నారు. అందులో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బీసీ-కురుమ, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎస్సీ, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బీసీ-మున్నూరుకాపు, డోర్నకల్ ఎమ్మెల్యే లంబాడా వర్గానికి చెందిన రాంచంద్రనాయక్ కూడా ఉన్నారు.
ఇక సీఎంవో అధికారుల నియామకంపైనా కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి. సీఎం పేషీలో అన్ని సామాజికవర్గాల అధికారులు ఉన్నారు. సీఎం కార్యదర్శులుగా ఉన్న శేషాద్రి బ్రాహ్మిణ్, సంగీత దళిత్, మాణిక్‌రాజ్ బీసీ, షాన్‌వాజ్‌ఖాసీం మైనార్టీ, శ్రీనివాస్ ఓసీ సామాజికవర్గానికి చెందినవారు. ఇక ప్రభుత్వంలోనూ కీలకమైన పోస్టుల్లో వివిధ వర్గాలకు చెందిన అధికారులు ఉన్నారు. పురపాలక శాఖ కార్యదర్శిగా షెడ్యూల్డ్ క్యాస్ట్‌కు చెందిన దాన కిషోర్ ఉన్నారు. విద్యాశాఖ కార్యదర్శిగా బీసీ అయిన వెంకటేశం, గనులశాఖ ముఖ్యకార్యదర్శిగా ఎస్టీ సామాజికవర్గానికి చెందిన మహేశ్ దత్ ఎక్కా, విద్యుత్‌శాఖ ముఖ్య కార్యదర్శిగా మైనార్టీ వర్గానికి చెందిన రిజ్విని రేవంత్ సర్కార్ అపాయింట్ చేసింది.
పోస్టింగ్‌లు, ట్రాన్స్‌ఫర్‌లలోనూ రేవంత్ సర్కార్ న్యాయం పాటించింది. రాచకొండ కమిషనరేట్‌కు దళితుడైన సుధీర్‌బాబును సీపీగా నియమించింది. సైబరాబాద్‌కు బ్రాహ్మిణ్ అయిన అవినాష్ మహంతి, హైదరాబాద్‌కు రెడ్డి సామాజికవర్గానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డిని నియమించింది. ఇక రాష్ట్రంలోనే కీలకమైన సింగరేణి సంస్థకు సీఎండీగా లంబాడా జాతిబిడ్డకు అవకాశం కల్పించారు. బలరాం నాయక్‌ను ఆ సంస్థకు సీఎండీగా అపాయింట్ చేశారు. గతంలో ఓ అధికారిని బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు కొనసాగించింది.
ఇక స్టేట్ హెల్త్ డైరెక్టర్‌గా రవీంద్రనాయక్, సీఎం పీఆర్వోలుగా శ్రీనివాస్‌గౌడ్, అయోధ్య రెడ్డి, కమ్మ సామాజికవర్గానికి చెందిన విజయ్‌కుమార్, రజక కులానికి చెందిన శ్రీధర్‌ను సీఎం రేవంత్ రెడ్డి తన పీఆర్వోలుగా నియమించుకున్నారు. మరోవైపు TSPSC సభ్యుల ఎంపికలోనూ సీఎం రేవంత్ రెడ్డి ఎంతో జాగ్రత్తలు తీసుకున్నారు. పాల్వాయి రజనీ ఎస్సీ, యాదయ్య బీసీ కురుమ, అనితా రాజేంద్రన్ బీసీ గౌడ్, రామ్మోహన్ ఎస్టీ, అమీరుల్లాఖాన్‌ను అపాయింట్ చేశారు.
ఇటీవల భర్తీ అయిన నలుగురు ఎమ్మెల్సీల్లో ముగ్గురు వివిధ సామాజికవర్గాలకు చెందినవారే. అమీర్ అలీఖాన్, మహేశ్‌కుమార్‌గౌడ్‌తో పాటు వెలమ సామాజికవర్గానికి చెందిన బల్మూరి వెంకట్‌ను ఎమ్మెల్సీలుగా చేసింది కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు సలహాదారుల నియమాకాల్లోనూ సమతూకం పాటించింది. దళతుడైన మల్లు రవి, మైనార్టీ అయిన షబ్బీర్ అలీ, బ్రాహ్మిణ్ అయిన వేణుగోపాలరావును రేవంత్ సర్కార్ సలహాదారులుగా నియమించుకుంది.
హైకోర్టు పీపీగా దళిత సామాజికవర్గానికి చెందిన పల్లె నాగేశ్వరరావును ప్రభుత్వం నియమించింది. అడిషినల్ పీపీలుగా బీసీ సామాజికవర్గాలకు అవకాశం ఇచ్చింది. సుప్రీంకోర్టులో ప్రభుత్వ పీపీగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన శ్రవణ్‌ను నియమించింది. గతంలో హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా దళితుడిని నియమించిన చరిత్ర లేదు. రేవంత్ రెడ్డి సర్కార్ దళితుడిని నియమించడం ద్వారా ఆ సామాజిక వర్గంలో ప్రభుత్వానికి మంచి మైలేజ్ వచ్చింది అంతేకాదు ప్రజా యుద్ధ నౌక, తెలంగాణ ఉద్యమ కారుడు దళితుడు అయిన గద్దర్ పేరుతో అవార్డ్స్ ఇవ్వడంపై కూడా ప్రభుత్వంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. అంతేకాదు.. కళాకారులకు గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తామని ప్రకటించి సీఎం రేవంత్‌రెడ్డి చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. గద్దర్ పేరుతో యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తామని.. దమ్మున్న సర్కార్ ఇది అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.