CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబులో మార్పు వచ్చిందా? రాష్ట్ర ఆర్థికస్థితిని వివరిస్తూనే.. గతంలో జరిగిన తప్పిదాలను ఆయన ఎందుకు గుర్తు చేసుకున్నారు? గతంలోని పొరపాట్లు మళ్లీ పునరావృతం కావంటూనే.. తప్పు చేసిన వారికి మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ సీబీఎన్ చేసిన వ్యాఖ్యల వెనుక మర్మమేంటనే చర్చ సాగుతోంది. తన మనోగతాన్ని బయటపెట్టిన చంద్రబాబు.. పనిలో పనిగా తాను చేయాలనుకున్న అంశాలపైనా క్లారిటీ ఇచ్చేశారనే టాక్ సాగుతోంది.
ఏపీని.. జగన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి వెళ్లిపోయారని.. సమస్యలను భరిస్తూ ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాత్రికి రాత్రి సరిదిద్దడానికి తమ దగ్గరేమీ మంత్రదండం లేదన్నారు ఏపీ సీఎం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి తాము పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతుంటే.. మళ్లీ జగన్ వస్తే ఎలాగని అడుగుతున్నారని తెలిపారు. పారిశ్రామికవేత్తల చెయ్యి మెలిపెట్టి వాటాలు రాయించుకోవడం, జే ట్యాక్స్ వసూలు చేయటం.. కూటమి ప్రభుత్వంలో ఉండవని స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వం.. ఆరు నెలల్లో రాష్ట్రానికి 4 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించిందని.. రాష్ట్ర చరిత్రలో ఇది రికార్డని తెలిపారు. మిగిలిన రాష్ట్రాల నుంచి తీవ్రమైన పోటీ ఉన్నా తట్టుకుని వీటిని తెచ్చామన్నారు. లక్ష కోట్ల పెట్టుబడితో పెట్టే బీపీసీఎల్ రిఫైనరీ నుంచి ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 75 శాతం వాళ్లకు తిరిగి ఇవ్వడానికి అంగీకరించి దానిని సాధించామని చెప్పారు.
మరోవైపు.. అభివృద్ధి, సంక్షేమం, పాలనలో తన మార్క్ ఉంటుందనే సంకేతాలిచ్చారు ఏపీ సీఎం. ప్రజలే తనకు హైకమాండ్ అంటున్న చంద్రబాబు.. తన తీరు మార్చుకుంటానని స్పష్టం చేశారు. తద్వారా.. తన వ్యవహార శైలి మారుతుందని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పేశారు. గతంలో చేసిన తప్పులు రిపీట్ చేయనని. ఇకపై అధికారులతోనూ జాగ్రత్తగానే ఉంటానని చంద్రబాబు అన్నారు. 2029 ఎన్నికల లక్ష్యంగా ఇప్పుడి నుంచే అడుగులు పడేలా చూస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.
Also Read: పాడేరు పొలిటికల్ వార్.. ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
మరోవైపు.. కొన్ని అంశాలపై చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. 2004, 2019లో ఓటమి కారణం తానేనని వ్యాఖ్యానించారు. ఆయా సమయంలో టెక్నాలజీ అభివృద్ధి పేరుతో ప్రజలకు దగ్గర కాలేకపోయానన్నారు. అభివృద్ధి ఉంటే చాలనే నినాదంతో.. అటు ప్రజలకి.. ఇటు కార్యకర్తలకి దూరమైనట్లు సీఎం చెప్పారు. ప్రజల ఆశలకు అనుగుణంగా ఉండలేకపోయానని తెలిపారు. హైదరాబాద్ సిటీ ఈ స్టాయిలో అభివృద్ధి జరిగిందంటే కారణం తానేనన్న CBN.. అభివృద్ధితోపాటు ప్రజల కోరికలు ఆశలు నెరవేర్చాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
గతంలో అధికారులే సుప్రీంగా వ్యవహరించి.. ప్రభుత్వానికి.. ప్రజలకి దూరం పెంచారని సీఎం చంద్రబాబు అన్నారు. తనకు.. ప్రజాప్రతినిధులకు కూడా అదే దూరాన్ని తయారు చేశారని తెలిపారు. ఎంత అభివృద్ధి చేసినా ప్రజలకి అందుబాటులో ఉండాలని.. అధికారులతో స్నేహపూర్వకంగా మెలగాలని సీబీఎన్ అన్నారు. గతంలో అధికారులను నమ్మి ఇబ్బందులు పడ్డానని.. వారు తెచ్చిన ప్రతి ఫైలుపైనా చూడకుండానే సంతకాలు పెట్టినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని.. ప్రతి ఫైలు.. ప్రతి కార్యక్రమం పూర్తిగా పరిశీలించిన తర్వాతే సంతకం పెడుతున్నట్లు సీఎం వివరించారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం.. మరో 20 సంవత్సరాలు పాటు ఉంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడున్న అధికారులంతా సమిష్టిగా పనిచేస్తే.. డెవలప్‌మెంట్ మరింత సులభతరం అన్నారు. కూటమి ప్రభుత్వం.. కావాలని రాజకీయ కోణంలో ఎవరినీ వేధించదన్న చంద్రబాబు.. అదే సమయంలో తప్పులు చేసిన వారిని ఉపేక్షించదని స్పష్టం చేశారు. తమ హయాంలో రాజకీయ కక్ష సాధింపులు ఉండవని.. దోచుకున్న వారిని మాత్రం వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
భవిష్యత్‌లో సినిమా రంగంలో అమరావతి కూడా ప్రభావం చూపే ప్రాంతం అవుతుందని సీఎం వ్యాఖ్యానించారు. మొదట్లో ఈ రంగానికి.. బెజవాడ కేంద్రస్థానంగా ఉండేదని.. స్టూడియోలు, నటులంతా మద్రాసులోనే ఉన్నా.. సినిమా పంపిణీ సంస్థలు, ఇతర వ్యవస్థులు బెజవాడలోనే ఎక్కువగా ఉండేవని గుర్తు చేశారు. ఆ రంగంలో హైదరాబాద్ ప్రాముఖ్యం విస్తరించిందని.. ఇప్పుడు పరిస్థితి ఇంకా మారిందన్నారు సీఎం. భవిష్యత్‌లో అమరావతి కూడా ప్రభావం చూపించే స్థాయికి రావచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.