BigTV English

CM Revanth Reddy : నీటిలో మన వాటా కోసం కొట్లాడండి.. అధికారులకు సీఎం డైరెక్షన్

CM Revanth Reddy : నీటిలో మన వాటా కోసం కొట్లాడండి.. అధికారులకు సీఎం డైరెక్షన్

CM Revanth Reddy : కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాల విషయంలో రాజీపడవద్దని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ ప్రయోజనాలకు వీసమెత్తు నష్టం రాకుండా ట్రిబ్యునల్ ముందు వాదనల్ని సమర్థవంతంగా వినిపించాలని సూచించారు. రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులు, నీటి వాటాల విషయంలో సమస్యలపై.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో అనేక విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. 


తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల పరిస్థతి, కృష్ణా గోదావరి జలాలపై ఉన్న అంతరాష్ట్ర వివాదాలు, నీటి వాటాల పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. నీటి వాటాల విషయమై ట్రిబ్యునల్ ముందు రాష్ట్రం వాదనల్ని గట్టిగా వినిపించాలని సూచించిన రేవంత్ రెడ్డి.. అందుకు అవసరమైన సాక్ష్యాధారాలు, రికార్డులు, ఉత్తర్వుల్ని సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. 

రాష్ట్ర పునర్ వ్యవస్తీకరణ చట్టం ప్రకారం కృష్ణా, గోదావరి నదుల నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తీసుకోవాల్సిన నీటి వాటాలను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నిర్దేశించనుంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అభిప్రాయాలను, ఆధారాలను మాత్రమే సేకరించగా..  త్వరలోనే రాష్ట్రాల వాదనలు విననుంది. ఆ తర్వాత ట్రిబ్యునల్ నిర్ణయం వెలువరించనుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రయోజనాలకు ఎలాంటి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశంలో చర్చించారు. 


కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించి ఇప్పటి వరకు ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులను అధ్యయనం చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి.. ట్రిబ్యునల్ కి ఇచ్చిన డీపీఆర్ లు, జలశక్తి మంత్రిత్వ శాఖకు ఇచ్చిన నివేదికలను సిద్ధంగా ఉంచుకోవాలని, వాటి ఆధారంగా ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించాలని అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ నీటి సూత్రాల ప్రకారం నదీ పరివాహక ప్రాంతాన్ని బట్టి.. దామాషా నిర్ణయిస్తారని తెలిపారు. కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో 70 శాతం ఉండగా.. ఏపీలో కేవలం 30 శాతమే ఉందని.. దాని ప్రకారం చూసుకున్నా.. మొత్తం 1,005 టీఎంసీల్లో 70 శాతం నీటి వాటా తెలంగాణకు దక్కేలా వాదనలు వినిపించాలని సూచించారు. 

పోలవరం ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను ఏపీ కృష్ణా డెల్టాకు వినియోగిస్తున్నందున, వాటికి బదులుగా నాగార్జున సాగర్ ఎగువన 45 టీఎంసీలు తెలంగాణకు నీటి కేటాయింపులున్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు.  ఆ నీటి వాటాను ఎగువన ఉన్న ప్రాజెక్టుల ద్వారా వినియోగించుకునే ప్రణాళికను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. 

ఇప్పటి వరకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నీటి వాటాల పంపిణీ పూర్తి చేయనందున.. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీల నిర్ణయాలను ఎందుకు పట్టించుకోవాలని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ట్రిబ్యునల్ నీటి వాటాల పంపిణీ పూర్తయ్యేవరకు గోదావరి, కృష్ణా బోర్డుల జోక్యం ఉండకూడదని సుప్రీం కోర్టులో వాదనలు వినిపించాలని అధికారులకు సూచించారు. వివిధ ప్రాజెక్టుల ద్వారా కృష్ణా జలాల్లో కోటాకు మించి ఎక్కువ నీటిని ఏపీ తరలిస్తోందని చర్చ జరిగింది. నీటి  ప్రవాహాన్ని శాస్త్రీయంగా లెక్కించే టెలీ మెట్రీ విధానంతో దీనికి అడ్డుకట్ట వేసే వీలుందని అధికారులు సీఎంకు వివరించారు. టెలీ మెట్రీ పరికరాలకయ్యే రూ.12 కోట్లు రెండు రాష్ట్రాలు చెరి సగం  చెల్లించాలని అధికారులు సీఎంకు వివరించారు.

నీటి వాటాలో నష్టం జరుగుతున్నందున అవసరమైతే మొత్తం డబ్బుల్ని ముందే భరించి టెలీమెట్రీ పరికాల్ని తీసుకోవాలని సూచించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏపీ ఇచ్చినప్పుడు రీయింబర్స్ చేసుకుందామంటూ సూచించారు. నీటి వినియోగం విషయంలో జరుగుతున్న అన్యాయానికి అడ్డుకట్ట వేయాలని అధికారులను ఆదేశించారు. కృష్ణాపై ఉన్న ప్రాజెక్టు అన్నింటి ద్వారా ఏ రాష్ట్రం ఎన్ని నీళ్లు వాడుకుంటుందో లెక్కలు తీయాలని ఆదేశించారు. శ్రీశైలం, పోతిరెడ్డిపాడు, బంకంచెర్ల హెడ్ రెగ్యులేటరీ, తెలుగు గంగా, కేసీ కెనాల్, హంద్రీనీవా, గాలేరు నగరి, వెలుగోడు ప్రాజెక్టుల నుంచి ఎంత నీటిని తరలిస్తున్నారనే వివరాలన్నీ రికార్డు చేయాలని చెప్పారు. 

Also Read : రైతుల‌కు గుడ్ న్యూస్.. నాలుగో విడుత రుణమాఫీ.. రూ.2747.67 కోట్లు విడుదల

సీతారామ ప్రాజెక్టు, సమ్మక్క బ్యారేజీకి అవసరమైన అనుమతులు తీసుకోవాలని,  పూర్తి ఆయకట్టుకు నీరు అందించేందుకు అవసరమైన పనులన్నీ తొందరగా చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టులు, నీటి వాటాలకు సంబంధించి సమర్థంగా వాదనలు వినిపించేందుకు 2014 నుంచి ఇప్పటివరకు ఉన్న జీవోలు, తీర్పులే కాకుండా.. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవోలు, మెమోలు, ప్రాజెక్టుల డీపీఆర్లు, అప్పటి నుంచి నీటి వాటాల్లో తెలంగాణకు జరిగిన నష్టాలపై సమగ్రంగా నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. వీటి ఆధారంగా అన్ని వేదికలపై తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించేలా సమర్థమైన వాదనలు వినిపించాలని సూచించారు.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×