CM Revanth Reddy: కుల గణనను వక్రీకరిస్తే ఇంకో వందేళ్లయినా బీసీలకు న్యాయం జరగదన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి సర్వే చేయలేదన్నారు. కులగణను పకడ్బంధీగా చేశామని, తప్పులు దొరక్కుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని గుర్తు చేశారు. ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని కులగణన చేశామని, గాంధీ కుటుంబం మాట ఇస్తే శిలాశాసనమన్నారు.
సర్వాయి సర్దార్ పాపన్నకు సరైన గౌరవం దక్కాలన్నారు. త్వరలో ఆ రోజు రాబోతుందన్నారు. ఆయన గొప్ప యోధుడని కొనియాడారు. గత ప్రభుత్వం ఖిలాషాపూర్ కోటను మైనింగ్ లీజుకు ఇచ్చిందన్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కోటను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
ఆగష్టు 18న సర్వాయి పాపన్న 375వ జయంతి సందర్భంగా సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న స్థలంలో విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అనంతరం రవీంద్రభారతిలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 375వ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, అమరవీరుల స్తూపం పక్కన సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు కానుంది.
ఆర్డినెన్సు గవర్నర్ ఆమోదించకుండా రాష్ట్రపతి వద్దకు పంపారని గుర్తు చేశారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు తావులేదన్నారు. ఈ విషయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మొండివాదన వినిపిస్తున్నారని అన్నారు. తాము పంపిన ఆర్డినెన్సులో మతం ప్రస్తావన లేదన్నారు. యూపీ, గుజరాత్ రాష్ట్రాల్లో బీసీల కోటాలో వెనుకబడిన ముస్లింలు ఉన్నారని వివరించారు. బీసీ బిల్లుకు బీజేపీ అడ్డు పడుతోందన్నారు.
ALSO READ: రాష్ట్రమంతా వర్షాలు కురుస్తున్నా.. చెరువుల్లో చుక్క నీళ్లు లేని పరిస్థితి
కరీంనగర్‌లో ఇచ్చిన మాటను సోనియాగాంధీ నిలబెట్టుకున్నారని తెలిపారు. బీసీల బిల్లుకు కోసం ఢిల్లీ వెళ్లి ధర్నా చేశామన్నారు. ఈ ధర్నాకు బీజేపీ-బీఆర్ఎస్ పార్టీలు ఎందుకు మద్దతు పలకలేదని ప్రశ్నించారు. రిజర్వేషన్ బిల్లుకు అడ్డుపడుతుందన్నది మోదీ, కిషన్‌రెడ్డి కాదా అంటూ ప్రశ్నలు రైజ్ చేశారు.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా కులగణన చేశామని, అందులో ఏదైనా తప్పుంటే చూపించాలని కోరామన్నారు. దీనికోసం ఎన్నోసార్లు మేధావులతో సమావేశాలు నిర్వహంచామన్నారు. తెలంగాణలో 56.33 శాతం మంది బలహీన వర్గాల ప్రజలున్నారని ఈ సందర్భంగా వివరించారు.
ఐదునెలలుగా ఈ అంశం పెండింగ్ లో ఉందన్న సీఎం రేవంత్, సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వాహించాలంటే చట్టం అడ్డంకిగా ఉందన్నారు. బీసీల నైతిక మద్దతు ఉంటే రిజర్వేషన్ల కోసం ఎక్కడివరకైనా వెళ్లి పోరాటం చేస్తామన్నారు. బలహీన వర్గాలు బలపడాలంటే ప్రతీ ఒక్కరు చదువుకోవాలన్నారు.
అందుకోసమే యంగ్ ఇండియా స్కూల్స్ తీసుకొచ్చామన్నారు. దొంగ ఓట్లపై అధినేత రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. మహారాష్ట్రలో కేవలం నాలుగు నెలల వ్యవధిలో కోటి కొత్త ఓటర్లు ఎలా పుట్టుకొచ్చారని సూటిగా ప్రశ్నించారు.
కొత్త ఓట్లు వల్లే అక్కడ బీజేపీని అధికారంలోకి వచ్చిందన్నారు. దేశంలో ముమ్మాటికీ ఓట్ల చోరీ జరుగుతోందన్నారు. బీహార్ లో 65 లక్షల మంది ఓట్లు తొలగించారని, ఎన్నికల నేపథ్యంలో ఇది జరిగిందన్నారు. ఎన్నికల సంఘం తప్పు చేసి అఫిడవిట్ అడుగుతోందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.