RangaReddy District: రాష్ట్రమంతా వర్షాలు దంచికొడుతూ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంటే.. రంగారెడ్డి జిల్లాలోని లింగారెడ్డిగూడెం చెరువు, నాగుల చెరువు మాత్రం నీరు లేక వెలవెలబోతున్నాయి. హైదరాబాద్ సహా ఇతర జిల్లాలను వరదలు ముంచెత్తుతుంటే.. ఈ రెండు చెరువుల్లో నీరు లేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షాబాద్ మండలం తిమ్మారెడ్డిగూడ పరిధిలోని లింగారెడ్డిగూడెం చెరువు, తాళ్ళపల్లి పరిధిలోని నాగుల చెరువు పరిస్థితి ఇదీ..
చెరువులకు నీరొచ్చే కాలువలు పూర్తిగా మొక్కలతో నిండిన వైనం..
గత సర్కార్ చెరువుల అభివృద్ధిపై దృష్టి పెట్టింది కానీ.. వాటికి నీరు వచ్చే కాలువలను మరిచిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెరువులకు నీరు వచ్చే కాలువలు పూర్తిగా మొక్కలతో పూడుకపోయాయంటున్నారు. అక్కడక్కడ గండ్లు పడి.. కొన్నిచోట్ల ఆక్రమణకు గురికావడంతో నీరు రాక చెరువులు ఎండిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు.
కాలువ పూడిక తీయకపోవడంతో ఎండిన స్థితిలో చెరువులు..
ముఖ్యంగా ఈ రెండు చెరువులకు.. ఈసీ నది ఉపనదైన చిన్న వాగు నుంచి లింగారెడ్డిగూడెం చెరువుకు నీరువస్తుంది. ఆ తర్వాత నాగుల చెరువులోకి గొలుసు కట్టు కాలువ ద్వారా నీరు చేరుకుంటుంది. అక్కడి నుంచి ఈసీ నదిలోకి కలుస్తాయి.. కానీ కాలువ పూడిక తీయకపోవడంతో చెరువులు వెలవెలపోతున్నాయని రైతులు వాపోతున్నారు.
రెండు చెరువుల్లో నీళ్లు లేని పరిస్థితి..
ఈ చెరువులకు నీటినందించే కాలువ మక్తగూడ గ్రామ సమీపంలో ప్రారంభమవుతుంది. అక్కడి నుండి ఏడు కిలోమీటర్లు చేరుకున్న తర్వాత తిమ్మారెడ్డి గూడ గ్రామ పరిధిలో ఉన్న లింగారెడ్డిగూడెం చెరువు నిండుతుంది.. అక్కడి నుంచి మరో రెండు కిలోమీటర్ల ప్రయాణించి నాగుల చెరువులో కలుస్తుంది. ఈ రెండు చెరువులు నిండాక.. ఆ నీళ్లు ఈసీ కాలువలో కలుస్తాయి.
బోరు బావులు పూర్తిగా అడుగంటిపోయాయని రైతుల ఆవేదన..
ఈ రెండు చెరువుల కింద ఆయకట్టుగా దాదాపు 400 ఎకరాల భూమి సాగులోకి ఉండేది. అయితే.. ఈ రెండు చెరువుల్లో నీరు లేక బోరు బావులు పూర్తిగా అడుగంటి పోయాయని రైతులు చెప్తున్నారు. మూడేళ్లుగా నీరు లేకపోవడంతో.. చేపలు పెంచుకోలేకపోతున్నామంటూ ముదిరాజులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: KGVB ప్రిన్సిపల్ ఆరోపణలపై ఎమ్మెల్యే కూన రవి రియాక్ట్..
ఇరిగేషన్ అధికారులకు చెప్పినా స్పందన లేదంటున్న రైతులు..
రెండు నెలల క్రితమే దీనిపై ఇరిగేషన్ ఏఈకి వినతి పత్రాలు ఇచ్చినట్లు తాళ్లపల్లి, తిమ్మారెడ్డిగూడ ప్రజలు తెలిపారు. అయినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదంటున్నారు. ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు స్పందించి తమ చెరువుకు నీరందించే కాలువను పునరుద్ధరించాలని.. ఈ రెండు చెరువులను నింపాలని కోరుతున్నారు.