Ramanthapur Incident: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొంది. హైదరాబాద్ రామాంతపూర్‌లోని గోకులే నగర్‌లో విద్యుత్ తీగలు తగిలిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య ఆరుకు పెరిగింది. కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్ షాక్ తగలడంతో ఈ విషాదం చోటు చేసుకుంది.
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం
కృష్ణాష్టమి సందర్భంగా ఆదివారం రాత్రి రథం ఊరేగింపు చేపట్టారు. అయితే.. రథాన్ని లాగుతున్న వాహనం మరమ్మతుకు గురికావడంతో దాన్ని పక్కనే పెట్టారు యువకులు. రథాన్ని చేతులతో ముందుకు లాగుతూ తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే పైన ఉన్న విద్యుత్ తీగలు రథానికి తగిలి ప్రమాదం జరిగిందన్న మాట విన్పించింది. దీంతో.. రథాన్ని లాగుతున్న 9 మంది యువకులు కరెంట్ షాక్‌తో పక్కకు పడిపోయారు.
అక్కడికక్కడే ఐదుగురు మృతి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి..
హుటాహుటిన స్థానికులు వారందర్నీ ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ఐదుగురు మృతి చెందినట్లు తేల్చారు డాక్టర్లు. మరో నలుగురికి వైద్య చికిత్స అందించారు. కానీ, అందులో మరో వ్యక్తి సైతం మృతి చెందాడు. దీంతో ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఆరుకు పెరిగింది.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన TGSPDCL..
అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు విద్యుత్ శాఖ అధికారులు. స్వయంగా ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు TGSPDCL సీఎండీ ముషారఫ్ అలీ.
రథం తీస్తున్న సమయంలో టీవీ కేబుల్ కండక్టర్..
అయితే రథం తీస్తున్న సమయంలో టీవీ కేబుల్ కండక్టర్ ఎలక్టిరకల్ లైన్స్‌తో కాంటాక్ట్ అయిందని వెల్లడించారు. అందువల్లే ప్రమాదం జరిగిందని చెప్పుకొచ్చారాయన. ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వంతో చర్చించి డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తామని తెలిపారు. నిర్లక్ష్యం ఉన్న అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు సీఎండీ ముషారఫ్ అలీ.
ఎలక్ట్రిక్ వైర్‌కు, టీవీ కేబుల్ వైర్ వేలాడుతోంది – మల్కాజ్‌గిరి ఏసీపీ
ఇక, నిన్న రాత్రి వర్షం పడుతున్న వేళ ప్రమాదం జరిగిందన్నారు మల్కాజ్‌గిరి ఏసీపీ చక్రపాణి. ఎలక్ట్రిక్ వైర్‌కు, టీవీ కేబుల్ వైర్ వేలాడుతోందని.. దాన్నుంచి కరెంట్ పాసై షాక్ తలిగిందన్నారు. దీంతో.. ఆ రథాన్ని లాగుతున్న వాళ్లు పడిపోయారన్నారు ఏసీపీ చక్రపాణి.
Also Read: సామినేని అంతర్మథనం..
పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించామన్న మంత్రి శ్రీధర్ బాబు
రామాంతపూర్ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు మంత్రి శ్రీధర్ బాబు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన ఆయన.. ఈ మొత్తం ఘటనపై పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించామన్నారు. ప్రభుత్వం తరఫున బాధితులను ఆదుకుంటామన్నారు మంత్రి శ్రీధర్ బాబు.