Hyderabad: పార్టీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం- సర్ పై నేతల వ్యవహారశైలిని తప్పుబట్టారు. ఎస్‌ఐఆర్ చాలా సీరియస్ అంశమని, ఈ విషయంలో పార్టీకి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమని తేల్చిచెప్పారు.
పార్టీ నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి జూమ్ మీటింగ్
తెలంగాణలో గురువారం అనగా జూన్ 25 నుంచి ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం-ఎస్‌ఐఆర్ ప్రారంభంకానుంది. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ అగ్రనేతలు కార్యకర్తలతో పలు సమావేశాలు నిర్వహించారు. ఈ విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ఈ క్రమంలో బుధవారం గాంధీభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు.
ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఎస్ఐఆర్ అంశం చాలా సీరియస్ అని, దీనిపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
‘SIR’ అంశంపై పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ సీరియస్ వార్నింగ్
ఈ విషయంలో కొందరు నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పార్టీకి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమని తేల్చిచెప్పారు. సర్ అంశం మీద జిల్లాల వారీగా నిర్వహించిన అవగాహన సదస్సులకు సంబంధించి తన వద్ద పూర్తి రిపోర్టు ఉందన్నారు. ఈ అంశంపై మరిన్ని అవగాహన సదస్సులు జరగాలన్నారు. ఇన్‌ఛార్జ్ మంత్రులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహారించాలన్నారు.
దీనిపై సరిగా వ్యవహారించకపోతే ప్రజలకు అన్యాయం జరుగుతుందని తేల్చిచెప్పారు. పేదల ఓట్లు పోతే వాళ్ల ఆధార్, రేషన్ కార్డు పోతుందని, ఈ విధంగా వారికి అన్యాయం జరగకూడదని స్పష్టం చేశారు. పార్టీ ఆదేశాలను ఎవరైనా పాటించాల్సిందేనని, పట్టించుకోని గుర్తించి వారి స్థానంలో మరొక ఇన్‌ఛార్జ్‌ని నియమిస్తామని స్పష్టంచేశారు.
ALSO READ: బాధ్యతలు చేపట్టరు.. రాజీనామా చేయరు.. ప్రేమ్ సాగర్ ‘సివిల్ సప్లయిస్’ సస్పెన్స్!
పది రోజుల సమయం ఇచ్చి చూస్తామని, పార్టీ సర్పంచ్‌లతో సర్ పై గ్రామాల్లో ప్రచారం చేయించి అవగాహన కల్పించాలన్నారు. ఓటరు జాబితా సవరణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని వివరించారు. దేశవ్యాప్తంగా బీజేపీ రాజకీయ వ్యూహాలను గమనించాలని వివరించాలన్నారు. బెంగాల్‌లో ఓట్ల నిర్వహణ విషయంలో జరిగిన పరిణామాలను ప్రస్తావించారు పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్.
తమకు అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించే అవకాశం ఉందని, లౌకికవాద ఓట్లను లక్ష్యంగా చేసుకుని కుట్రలు జరిగే ప్రమాదం ఉందన్నారు. అర్హత కలిగిన ఓటు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని, బూత్ లెవల్ ఏజెంట్లు కీలకంగా పని చేయాలని సూచన చేశారు.