Prem Sagar: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో కీలకమైన, కోట్లాది మంది రైతులు, ప్రజలతో నేరుగా ముడిపడి ఉన్న ‘రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ’ (సివిల్ సప్లయిస్ కార్పొరేషన్) చైర్మన్ పదవి వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రతిష్టాత్మక పదవికి ప్రభుత్వం సీనియర్ నేత, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును నియమించింది. అయినప్పటికీ ఆయన మాత్రం బాధ్యతలు చేపట్టేందుకు విముఖత చూపుతున్నారు. కొంతమంది నేతలు పదవుల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైనా ఒక పదవి వస్తే చాలు అని భావిస్తున్నారు. కానీ ప్రేమ్ సాగర్ రావు తీరు మాత్రం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. నియమించి నెలలు గడుస్తున్నా ఆయన అటు బాధ్యతలూ స్వీకరించడం లేదు.. ఇటు పదవికి రాజీనామా కూడా చేయడం లేదు. ఈ విచిత్ర పరిస్థితితో సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ పోస్టు గత 8నెలలుగా ఖాళీగానే దర్శనమిస్తోంది.
నిర్ణయాల్లో జాప్యం.. రైతాంగానికి నష్టం?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆయన సేవలను గుర్తించిన కాంగ్రెస్.. పౌరసరఫరాల సంస్థ చైర్మన్ గా నియమిస్తూ గతేడాది అక్టోబర్ 31న నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాటి నుంచి ఆయన చైర్మన్ బాధ్యతలు చేపట్టేందుకు నిరాసక్తతో ఉన్నారు. చైర్మన్ పదవికాలం రెండేళ్లు. ఇప్పటికే దాదాపు 8 నెలలు గడించింది. ఆయన చైర్మన్ బాధ్యతలు చేపట్టకపోవడంతో రాష్ట్రంలో వరి కొనుగోలు, మిల్లింగ్, సబ్సిడీల పంపిణీ వంటి కీలకమైన అంశాలను పర్యవేక్షించాల్సిన కార్పొరేషన్‌కు పూర్తిస్థాయి చైర్మన్ లేకపోవడం ఇప్పుడు పెద్ద మైనస్‌గా మారింది. రాష్ట్రంలోని ఉన్నతాధికారులు అంతా తామై నడిపిస్తున్నప్పటికీ, రాజకీయంగా ఒక బలమైన చైర్మన్ ఉంటేనే రైతుల సమస్యలపై సత్వర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. చైర్మన్ లేకపోవడంతో క్షేత్రస్థాయిలో రైతుల పక్షాన నిలబడి, గట్టి నిర్ణయాలు తీసుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మంత్రి పదవి కోసమేనా ఈ వ్యూహం?
ప్రేమ్ సాగర్ రావు కార్పొరేషన్ చైర్మన్ పదవిని లైట్ తీసుకోవడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయనకు కేబినెట్ ర్యాంక్ హోదా ఉన్న కార్పొరేషన్ ఇచ్చినప్పటికీ.. ఆయన మాత్రం రాబోయే మంత్రివర్గ విస్తరణపైనే ఉన్నట్లు సమాచారం. ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రి పదవి దక్కుతుందని మొదటి నుంచి ఆశిస్తున్నారు. పార్టీకి చేసిన సేవలను గుర్తించి కేబినెట్ లోకి తీసుకుంటారని ప్రేమ్ సాగర్ రావు ఆశతో ఉన్నారు. చైర్మన్ బాధ్యతలు స్వీకరిస్తే.. భవిష్యత్తులో మంత్రి పదవి రేసు నుంచి తప్పుకోవాల్సి వస్తుందేమోననే దూరంగా ఉంటున్నట్లు సమాచారం. అందుకే అటు బాధ్యతలు తీసుకోకుండా, ఇటు పదవిని వదులుకోకుండా అధిష్ఠానం వద్ద ‘మంత్రి పోస్టు’ కోసం గట్టిగా ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఆయన అనుసరిస్తున్న తీరు ఇప్పుడు పార్టీ వర్గాల్లోనూ, ప్రభుత్వ పెద్దల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందనే చర్చ విస్తృతంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రేమ్ సాగర్ రావు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇందులో ఆయనకు చోటు దక్కుతుందా? లేదా? అనేది కూడా చర్చకుదారితీసింది.
క్యూ కడుతున్న ఆశావహులు?
మరోవైపు ప్రేమ్ సాగర్ రావు సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ పదవిపై విముఖత చూపిస్తుండటంతో.. ఆ ఖాళీని భర్తీ చేసుకునేందుకు పార్టీలోని ఇతర సీనియర్ నాయకులు రంగంలోకి దిగినట్లు సమాచారం. గత 8 నెలలుగా ఖాళీగా ఉన్న ఈ కీలక చైర్మన్ గిరిని ఎలాగైనా దక్కించుకోవాలని పలువురు నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆశావహుల వ్యూహాలు ఫలించే కేంద్రంగా ఉన్న గాంధీభవన్‌లో లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. అధిష్ఠానం దృష్టిలో పడి పౌరసరఫరాల చైర్మన్ సీటు దక్కించుకోవడం కోసం తమ సన్నిహితులతో లాబీయింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
రాష్ట్ర నేతలతో పాటు ఏఐసీసీ ఒత్తిడి
ఢిల్లీ స్థాయి సిఫార్సులు.. రాష్ట్ర నేతలతో పాటు ఏఐసీసీ పెద్దల ద్వారా ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించినట్లు సమాచారం. తమకు అవకాశం ఇస్తే కార్పొరేషన్‌ను బలోపేతం చేయడమే కాకుండా, ప్రభుత్వానికి మంచి పేరు తెస్తామంటూ సీఎం కార్యాలయం చుట్టూ, గాంధీ భవన్ చుట్టూ నేతలు ప్రదక్షిణలు చేస్తున్నారు. రైతులతో నేరుగా కనెక్ట్ అయ్యే ఈ పదవి ద్వారా రాజకీయంగా మైలేజ్ పెంచుకోవచ్చని పలువురు సీనియర్లు భావిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్రేమ్ సాగర్ రావు అంశానికి సంబంధించిన సస్పెన్స్‌కు ముఖ్యమంత్రి ఎప్పుడు తెరదించుతారో.. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్‌కు కొత్త బాస్ ఎప్పుడు వస్తారో చూడాలి.
Also Read: నన్ను నమ్మితే.. బీఆర్ఎస్ ను పాతాళానికి తొక్కుతా.. గువ్వల బాలరాజు వార్నింగ్!