Bhadrachalam CM Revanth Reddy Sri Rama Navami| భద్రాచలం శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. పవిత్రమైన గోదావరి నది తీరంలో స్థితిచేసిన భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాముల కల్యాణాన్ని దర్శించుకోవడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి అనేక మంది భక్తులు పెద్ద ఎత్తున భద్రాచలానికి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణం అంతా రామ నామ స్మరణతో మార్మోగుతోంది. ఈ శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాలు గత నెల 30వ తేదీ నుండి ప్రారంభమై ఏప్రిల్ 12 వరకు కొనసాగనున్నాయి.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సతీ సమేతంగా విచ్చేసి.. స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించి, కల్యాణోత్సవాన్ని దర్శించకున్నారు. మంత్రి కొండా సురేఖ, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఇప్పటికే ఆలయం వద్దకు చేరుకుని శ్రీరామచంద్రుని దర్శనం చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
కళ్యాణ పూజ ఆధ్యాత్మికత
ఉదయం 10:30 గంటలకు మిథిలా మండపంలో కళ్యాణ పూజలు ప్రారంభమయ్యాయి. ఇవి మధ్యాహ్నం 12:30 వరకు సాగుతాయి. వేద మంత్రోచ్ఛారణతో పూజలు జరుగుతుండగా, అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని శ్రీ సీతారాముల శిరస్సుపై ఉంచుతారు. ఇది శుభ ముహూర్తం మరియు జగత్తు కల్యాణానికి శుభ సంకేతం.
పూజల అనంతరం తలంబ్రాల వేడుక జరుగుతుంది, ఇందులో బ్రహ్మ బంధనం వేయడం జరుగుతుంది. దీనిని బ్రహ్మముడి అంటారు. ఆపై చతుర్వేదాల సహాయంతో నూతన దంపతులకు ఆశీర్వాదాలు ఇవ్వబడతాయి. సాధారణంగా కల్యాణంలో రెండు సూత్రాలు ఉంటాయి, కానీ భద్రాచలం కల్యాణంలో భక్త రామదాసు ఎంతో ప్రేమతో తయారు చేసిన పతకాన్ని కలిపి మూడు సూత్రాలను సీతమ్మవారికి ధరింపజేస్తారు.
సీతమ్మ తల్లికి ప్రత్యేక బంగారు చీర
దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి పొందిన భద్రాచలం శ్రీ సీతారాముల ఆలయంలో కల్యాణ వేడుకలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీరామనవమి వేడుకల కోసం సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్.. సీతమ్మ తల్లికి బంగారు పట్టు చీరను నేసి సమర్పించారు. ఈ చీర సీతమ్మ తల్లి గోల్డెన్ పట్టు చీరగా ప్రసిద్ధి చెందింది.
వెల్ది హరిప్రసాద్ చేనేత కళారంగంలో విశేష ప్రతిభ కలిగిన వ్యక్తి. ప్రతి ఏడాది శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం కల్యాణానికి ప్రత్యేకమైన చీరను అందిస్తుంటారు. ఈ సంవత్సరం కూడా ఆయన సీతమ్మ తల్లికి అందించే బంగారు పట్టు చీర నేయడానికి ప్రత్యేక శ్రద్ధ చూపించారు.
చీర విశేషాలు:
ఒక గ్రాము బంగారు జరీ పట్టు దారం వినియోగం, 800 గ్రాముల బరువు, 7 గజాల పొడవు, చీర కొంగులో భద్రాద్రి ఆలయ మూలవిరాట్ దేవతలు, శంఖు, చక్రనామాలు, హనుమంతుడు, గరుత్మంతుడు చిత్రాలు. చీరలో “శ్రీ రామ శ్రీ రామ రామే రామే మనోరమే” అనే శ్లోకం 51 సార్లు లిఖించబడింది. చీర నేయడానికి మొత్తం పది రోజుల సమయం పట్టింది.
పవన్ కల్యాణ్ భద్రాచలం పర్యటన రద్దు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భద్రాచలం పర్యటనను రద్దు చేసుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణానికి పవన్ హాజరుకావాల్సి ఉండగా.. తన పర్యటన వల్ల భక్తులకు ఇబ్బంది కలగుతుందనే ఆలోచనతో పవన్ పర్యటనను రద్దు చేసుకున్నట్లు సమాచారం.
అయితే.. ఈ నెల 11న ఒంటిమిట్టలో కోదండరాముల కల్యాణోత్సవం జరుగనుంది. ఈ సందర్భంగా స్వామివారికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా పట్టు వస్త్రాలను సమర్పిస్తారు.