కళ్లజోడు తీస్తే మీలాంటి వాడ్నే, షర్ట్ పైకి పెడితే మీ లాంటి వాడ్నే.. అంటూ గేమ్ ఛేంజర్ సినిమాలో ఓ పాట ఉంటుంది. తాను కూడా ప్రజల్లో ఒకడినే అని చెప్పేందుకు ఓ జిల్లా కలెక్టర్ పాడే పాట అది. అలాంటి మార్పులేవీ లేకుండానే తాను జనంలో ఒకడిని, జనంలో మనిషిని అని చెబుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా కామారెడ్డి జిల్లాలో సీఎం రేవండ్ రెడ్డి పర్యటన ఇలాగే జరిగింది. ముఖ్యమంత్రి అనే హంగు ఆర్భాటాలు లేవు. దూరం నుంచి కనపడి చేయి ఊపడం, హై సెక్యూరిటీ మధ్య ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం కాదు, జనంలోకి వచ్చి, జనంలో ఒకరిగా కలసిపోయారు సీఎం రేవంత్ రెడ్డి. వరద బాధితులకు కొండంత ధైర్యాన్నిచ్చారు.
హంగు, ఆర్భాటం లేనే లేవు..
ముఖ్యమంత్రి పర్యటన అంటే హంగు ఆర్భాటాలు, టైట్ సెక్యూరిటీ.. ఆ రేంజే వేరు అన్నట్టుగా ఉంటుంది. ఫంక్షన్ కి వచ్చినా, పరామర్శకు వచ్చినా, అధికార, అనధికార కార్యక్రమం ఏదయినా ఈ లాంఛనాలు తప్పనిసరి. వరద పరామర్శలైనా సరే బ్యారికేడ్ వరకే జనాలు వస్తుంటారు, ఆ తర్వాత అంతే అధికారులే ఏవేవో వివరాలు ముఖ్యమంత్రికి చెబుతుంటారు. కానీ తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి పర్యటనలో ఇలాంటివేవీ కనపడలేదు. అత్యంత సాదాసీదాగా, జనంలో ఒకరి లాగా, ఇంట్లో మనిషి లాగా ప్రజల వద్దకు వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. వరద ముంపుకి గురైన కాలనీలన్నీ కాలి నడకన కలియ తిరిగారు. నాయకులు, అధికారుల మధ్యన ఇరుక్కుపోయి ప్రజల బాధలు విని వెళ్లిపోకుండా.. నేరుగా ప్రజల మధ్యకే వెళ్లిపోయారు.
నేనే మీ ముందుకు..
సహజంగా సీఎం వస్తే బాధితులు ఆయన వద్దకు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకోవడం సహజం. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి స్వయంగా బాధితుల వద్దకు వెళ్లారు. బాధితులను తన వద్దకు పిలుపించుకోకుండా, ఆయనే బాధితుల వద్దకు వెళ్లిపోయారు. పొలాల గట్లపై ఎక్కారు, పొలంలో దిగి, మడుల మధ్యకు నడిచి వెళ్లి రైతులతో మాట్లాడారు. కూలిపోయిన బ్రిడ్జిని, ధ్వంసమైన రోడ్లను ఆయనే దగ్గరుండి పరిశీలించారు. కాలనీల్లో ప్రజలతో, పొలాల్లో రైతులతో.. నేరుగా తనే మాట్లాడారు. కేవలం మైక్ లో మాట్లాడి, నష్టపరిహారం ప్రకటించి చేతులు దులుపుకోలేదు సీఎం రేవంత్ రెడ్డి. నేనే మీ దగ్గరకు వచ్చా, మీ బాధలేవైనా నాకు మీరే చెప్పండి అని సూచించారు. అక్కడికక్కడే వారికి హామీలు ఇచ్చారు. వారి కళ్లలో ఆనందం చూశారు.
ట్రెండ్ సెట్టర్..
సహజంగా ప్రతిపక్ష నేతలు చొరవగా జనంలోకి వెళ్తుంటారు, అధికారంలో ఉన్నవారు సెక్యూరిటీ మధ్య మిగిలిపోతారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతలకంటే ఎక్కువ చొరవగా జనంలోకి వెళ్లారు. ముఖ్యమంత్రి స్థాయిలో సెక్యూరిటీ ఉన్నా కూడా వారందర్నీ పక్కనపెట్టి సామాన్యుల్లో కలసిపోయి వారి కష్టాలు విన్నారు. ప్రజా నాయకులు కావాలనుకునే వారికి రేవంత్ రెడ్డి మార్గదర్శి అని సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ స్థాయిలో జనంలోకి వెళ్లలేదని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. రేవంత్ రెడ్డి ట్రెండ్ సెట్టర్ గా మారారని, కామారెడ్డి టూర్ దీనికి ఉదాహరణ అని చెబుతున్నారు.