CM Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు చెందిన బండారు దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలని సీఎం డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితం ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖర్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే ఉపరాష్ట్రపతి పదవిపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రధాని మోదీ గౌరవించాలని అన్నారు. దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇస్తేనే బీసీలకు న్యాయం జరుగుతోందని చెప్పారు. తెలుగు వారికి సరైన గౌరవం దక్కుతుందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇండియా కూటమితో మాట్లాడుతా..
బీసీలకు నాయకత్వమే లేకుండా బీజేపీ కుట్ర చేస్తోందని సీఎం ఆరోపించారు. గతంలో బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించిన బీజేపీ.. బండారు దత్తాత్రేయను గవర్నర్ పదవి లేకుండా చేసిందని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రధాని మోదీ గౌరవించాలని సీఎం డిమాండ్ చేశారు. ఇండియా కూటమి తరఫున కాదు.. తెలంగాణ ప్రజల తరఫున తాను మాట్లాడుతున్నానని చెప్పారు. దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే.. ఇండియా కూటమితో మాట్లాడే బాధ్యత తాను చూసుకుంటానని అన్నారు. దత్తాత్రేయ ఉపరాష్ట్రపతి పదవి ఇస్తే బీసీలకు న్యాయం జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తెలంగాణ దేశానికే రోల్ మోడల్..
‘తెలంగాణ కులగణన దేశానికే రోల్ మోడల్ అని చెప్పారు. కులగణనను నెల రోజుల్లోనే పూర్తి చేశాం. అసెంబ్లీలో తీర్మానాలు చేసి పార్లమెంట్ కు పంపాం. ఆమోదించడంలో కేంద్రం జాప్యం చేస్తోంది. రాహుల్ గాంధీ ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాం. రేపు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ను కలిసి కులగణన, రిజర్వేషన్లపై చర్చిస్తాం. విపక్షాలను కలుపుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాం.. కాంగ్రెస్ ఎంపీలకు కులగణన అంశాలను వివరిస్తాం. సెప్టెంబర్ 30 లోపు స్థానిక ఎన్నికలు నిర్వహిస్తాం. రిజర్వేషన్లపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలి. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వితండవాదం చేస్తోంది.. ముస్లింలను రిజర్వేషన్ల నుంచి తొలగించే కుట్ర జరుగుతోంది’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
రిజర్వేషన్లకు బీజేపీ అంగీకరించకపోతే వ్యూహం ఉంది..
గుజరాత్, యూపీ, మహారాష్ట్రలో ముస్లి రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లు తొలగించాలి. తర్వాత తెలంగాణలో తొలగించాలి. నిపుణుల కమిటీ నివేదికపై కేబినెట్ లో చర్చించాం. సామాజిక వర్గాల వారీగా ప్రజల లెక్కలు తేల్చాం. బీఆర్ఎస్, బీజేపీ అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలి. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు లేవు. వెనుకబాటుతనం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉన్నాయి. మధ్యప్రదేశ్ లో 38, గుజరాత్ లో 27, యూపీలో 7 ముస్లిం ఉపకులాల రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. రిజర్వేషన్లకు బీజేపీ అంగీకరించకపోతే వ్యూహం ఉంది’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ALSO READ: BJP – BRS: కేసీఆర్ కి ఉపరాష్ట్రపతి పదవి, కేంద్ర కేబినెట్ లోకి కవిత.. ఎంపీ అర్వింద్ రియాక్షన్ ఇదే
ALSO READ: Pawan Kalyan: ప్రమోషన్స్ లో పవన్ కళ్యాణ్ కొత్త ప్లాన్, మంచి ఐడియా వేశారు