Bhadrachalam In Danger: భద్రాచలంను గోదావరి వరదల నుంచి కాపాడే కరకట్ట ప్రమాదంలో పడింది. ఎప్పటికప్పుడు తాత్కాలిక మరమ్మత్తులు చేసినా.. రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి 50 మీటర్ల మేర రక్షణ గోడ కూలిపోయింది. ఇప్పటికిప్పుడు పెద్ద నష్టం ఏమీ లేకపోయినా.. భారీ వరదలొస్తే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయంటున్నారు నిపుణులు.
ప్రమాదంలో భద్రాచలం కరకట్ట..
బ్రిడ్జ్ సెంటర్-కొత్త కాలనీ మధ్య కరకట్ట కుంగిపోయింది. గోదావరి వెంట నిర్మించిన కరకట్టపైన కూడా భారీగా పగుళ్లు కనిపిస్తున్నాయి. కరకట్ట కుంగిన చోట ఇసుక బస్తాలతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు అధికారులు. వరదల వేళ కరకట్ట బలహీనపడటంతో భద్రాచలం వాసులు ఆందోళనలో ఉన్నారు.
20 ఏళ్ల కిందట కరకట్ట నిర్మాణం..
80 అడుగుల మేర వరదలొచ్చినా ముంపు తలెత్తకుంగా భద్రాచలాన్ని కాపాడేందుకు 20 ఏళ్ల కిందట కరకట్టను నిర్మించారు. గత మూడేళ్లుగా కరకట్టకు అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టలేదు. కరకట్టపైన సీసీ రోడ్లు పగుళ్లు ఇచ్చినా పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన తర్వాత దాదాపు 5 కిలోమీటర్ల పొడవైన కట్ట తెలంగాణలో ఉండగా.. మిగతా భాగం ఏపీలోకి అల్లూరి జిల్లా ఎటపాక పరిధిలోకి వెళ్లింది. గోడ కూలిన విషయాన్ని రంపచోడవరంలోని ఇరిగేషన్ అధికారులకు సమాచారమిచ్చినా ఎవరూ పట్టించుకోలేదని తెలుస్తుంది.
మళ్లీ వరదలోస్తే ఆగని కరకట్ట
గోదావరి కరకట్టకు వెంటనే మరమ్మతులు చేయించి, బలోపేతం చేయాలని స్థానికులు కోరుతున్నారు. 70 అడుగుల మేర గోదావరి వరద వచ్చినప్పటికీ భద్రాచలం పట్టణానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా గోదావరి కరకట్టకు మరమ్మతు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం స్పందించి దీనిపై చర్యలు చేపట్టాలని వారు విన్నవిస్తున్నారు. మళ్లీ గోదావరి వరదలు 72 అడుగులు మేర వచ్చినట్లయితే కరకట్ట ఆగే పరిస్థితి లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరకట్ట పైభాగంలో నిర్మించిన సీసీ రోడ్డు చాలాచోట్ల గుంతలు ఏర్పడి పగుళ్లు ఏర్పడ్డాయి. కరకట్టకు రెండు వైపులా పెద్ద పెద్ద చెట్లు, పిచ్చి చెట్లు, ముళ్ల కంపలతో దర్శనమిస్తోంది.
Also Read: స్కూల్ వ్యాన్‌ను ఢీ కొన్న రైలు.. 15 మంది స్టూడెంట్స్..
ఘటనపై పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు
ఏపీ అధికారుల అనుమతి లేకుండా కూలిన చోట మరమ్మతులు చేస్తే సాంకేతిక చిక్కులు వస్తాయని భద్రాచలం ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. భద్రాచలం- ఎటపాక మధ్య మేడువాయి వాగుకు వరద చేరితే ఆ నీరు విరిగిపడ్డ గోడ వైపున స్లూయీస్‌కు చేరుతుంది. అదే జరిగితే ప్రమాదం తలెత్తొచ్చు.