Competition on DCC post: అదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి పదవి ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠభరితంగా మారింది. డీసీసీ పగ్గాల కోసం ముగ్గురు కీలక నేతలతో పాటు ఓ ఎమ్మెల్యే మధ్య కూడా పోటీ నెలకొందట. 2023 నుండి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంది.. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ బలం, ఓట్ల శాతం పెరిగింది. ఈ క్రమంలో పార్టీని బలోపేతం చేసిన వారికే పోస్ట్ ఇవ్వాలని డిమాండ్ వ్యక్తం అవుతుందట.. ఇంతకీ కాంగ్రెస్ అధిష్టానం ఎవరి వైపు మొగ్గుచూపిస్తుంది? .. అసలు పోటీలో ఉన్న జిల్లా దిగ్గజాలు ఎవరు?
ఆదిలాబాద్ డీసీసీ పగ్గాల కోసం పోటా పోటీ
అదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి పోస్టుకు లీడర్ల మధ్య పోటీ తీవ్రంగా పెరిగిపోతోందంట. అదిలాబాద్ నియోజకవర్గం నుండి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి పోటీ చేసి ఓడిపోయిన కంది శ్రీనివాస్ రెడ్డితో పాటు, కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డిలు డీసీసీ అధ్యక్షుడి పదవి కోసం పోటీ పడుతున్నారట.. వారితో పాటు ఆదివాసీ ఎమ్మెల్యే , ఖానాపూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వెడ్మ బొజ్జు పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది.
కొత్త డీసీసీ అధ్యక్షుడిపై కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ
రెండున్నర ఏళ్ల క్రితం కంది శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీకాంత్‌రెడ్డి 2004 నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 2013 లో గణేష్‌రెడ్డి టిడిపి నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఇటీవల నూతనంగా పార్టీలో చేరిన వారి కంటే మొదటి నుండి పార్టీ కోసం కష్టపడ్డ వారికే అవకాశాలు ఉంటాయని చెప్పడంతో ఆశావహులైన ఒకరిద్దరు నాయకుల్లో డీసీసీ పదవిపై ఆశలు సన్నగిల్లాయట. ఆ క్రమంలో అసలు డీసీసీ పోస్ట్ ఎవరిని వరిస్తుందో అనేది ఇపుడు జిల్లా రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.
లోక్‌సభ ఎన్నికల్లో గణనీయంగా పెరిగిన కాంగ్రెస్ ఓటు బ్యాంకు
అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ గణనీయంగా పెరిగింది. అదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ లో మొత్తం 16 లక్షల 50 వేల 175 ఓట్లు ఉండగా తాజా లోక్ సభ ఎన్నికల్లో 12 లక్షల 21వేల 563 ఓట్లు పోలయ్యాయి..4 లక్షల 80వేల ఓట్లతో కాంగ్రెస్ రెండవ స్థానంలో ఉంది. 2019 ఎన్నికల కంటే లక్ష యాభై ఏడు వేల ఓట్లు ఎక్కువగా వచ్చాయి. అయితే ఎన్నికల్లో పార్టీ ఓటు బ్యాంక్ పెంచేందుకు తాము కృషి చేశామని, పార్టీ బలోపేతం కోసం పని చేసిన తమకు కాంగ్రెస్ అధిష్ఠానం జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని అంటున్నారట సీనియర్లు.
నేతల సీనియార్టీ, పనితీరు పరిశీలిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్
పార్టీలో సీనియారిటీ, గత అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పని తీరు, లీడర్ల సామర్థ్యం పరిశిలిస్తుందట కాంగ్రెస్ హై కమాండ్.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేలా, బాధ్యతతో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళే వారినే ప్రెసిడెంట్‌గా ఎంపిక చేయాలని హై కమాండ్ భావిస్తోందట. మరో వైపు అదిలాబాద్ జిల్లాలో ఓటర్లను ప్రభావితం చేసే సామాజికవర్గంతో పాటు, లీడర్ల ఆర్థిక బలాబలాలను కూడా అధిష్ఠానం పరిశిలిస్తోందట.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీ వత్తిళ్లు, వేధింపులు తట్టుకుని, కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేశామని సీనియర్లు వాదిస్తున్నార.. అక్రమ కేసులు పెట్టినా భయపడకుండా పార్టీ లైన్‌కి కట్టుబడి ఉన్నామని, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడామని సీనియర్లు అంటున్నారట..
Also Read: పి.గన్నవరం టీడీపీలో జరుగుతున్న రాజకీయం ఏంటి?
పని చేసే నేతకే పగ్గాలు ఇవ్వాలంటున్న క్యాడర్
మధ్యలో వచ్చిన వారికి కాకుండా పార్టీ కోసం కష్టపడిన వారికే డీసీసీ పోస్ట్ ఇవ్వలని సీనియర్లు రాష్ట్ర పార్టీ పెద్దలపై ఒత్తిళ్లు పెంచుతున్నారంట.. గతంతో పోలిస్తే పార్టీని బలోపేతం చేసి, పూర్వ వైభవం తీసుకువచ్చిన వారికే అధ్యక్ష పదవి ఇవ్వలని జిల్లా కాంగ్రెస్ క్యాడర్ కూడా అభిప్రాయపడుతోంది. మరో వైపు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పేరు డీసీసీ పీఠం రేసులో ప్రధానంగా ఫోకస్ అవుతోంది. ఆయనకే పార్టీ పగ్గాలు అప్పజెప్తారన్న వాదన పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. మరి ప్రస్తుత పరిస్థితుల్లో కీలకంగా మారిన ఆదిలాబాద్ జిల్లా డీసీసీ పగ్గాలు ఎవరు చేజిక్కించుకుంటారో చూడాలి.
Story By Rami Reddy, Bigtv