సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో ఈనె 8వ తేదీ ఉదయం 11 గంటలకు చర్చకు రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. 72 గంటలు డెడ్ లైన్ అంటూ కేటీఆర్ చేసిన హడావిడికి కాంగ్రెస్ ఘాటుగా బదులిచ్చింది. కాంగ్రెస్ తరపున మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్.. కేటీఆర్ కి సవాల్ విసిరారు. ప్రెస్ క్లబ్ కి కాదని, దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలన్నారు. ప్రజాస్వామ్యంలో చర్చలకోసం చట్ట సభలున్నాయని గుర్తు చేశారు కాంగ్రెస్ నేతలు. అక్కడ జరిగే చర్చలు రికార్డు అవుతాయి కాబట్టే అసెంబ్లీలో చర్చకు రాావాలని సీఎం రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా సవాల్ విసురుతున్నారని గుర్తు చేశారు. కృష్ణా, గోదావరి జలాలతో పాటు అన్ని అంశాలపై అసెంబ్లీలో చర్చకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. దమ్ముంటే అసెంబ్లీ సమావేశాలు కోరుతూ స్పీకర్ దగ్గరకు వెళ్లి బీఆర్ఎస్ తరపున లేఖ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని వారు సవాల్ విసిరారు.
కేటీఆర్ కు మంత్రి సీతక్క కౌంటర్..
సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ కేటీఆర్ కు అర్దం కానట్లు ఉంది
విదేశాలలో ఉన్న కేటీఆర్ ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకుంటే మంచిది
అసెంబ్లీలో చర్చిద్దాం రా అంటే.. ప్రెస్ క్లబ్ కు రమ్మనడం ఏంటి?
డెడ్ అయిన పార్టీ డెడ్ లైన్ పెట్టడం విడ్డూరంగా… https://t.co/0L2PviIR5F pic.twitter.com/8i7HFqqlD7
— BIG TV Breaking News (@bigtvtelugu) July 5, 2025
మీరు ఎమ్మెల్యేనే కదా..!
ప్రెస్ క్లబ్ లో చర్చలకు పిలవాల్సింది కేటీఆర్ కాదని, ఆయన ఎమ్మెల్యే కాబట్టి.. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని సవాల్ విసిరారు మంత్రి సీతక్క. కేటీఆర్ ఈ దేశంలో లేకపోవడం వల్ల సీఎం రేవంత్ రెడ్డి మాటలు ఆయనకు సరిగా తెలిసినట్టు లేవని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాస్తే అసెంబ్లీలో చర్చకు సిద్ధం అని రేవంత్ చెప్పినట్టు గుర్తు చేశారు సీతక్క. కానీ కేటీఆర్ శాసన సభ కాదని ప్రెస్ క్లబ్‌కు రావాలని సవాల్ చేస్తున్నారని అన్నారు. ప్రెస్ క్లబ్ లో కాదని, చర్చ అసెంబ్లీలో జరగాలన్నారామె. ఆల్రడీ డెడ్ అయిన పార్టీ డెడ్ లైన్లు పెట్టడం విచిత్రంగా ఉందంటూ కేటీఆర్ కి కౌంటర్ ఇచ్చారు సీతక్క. సొంత చెల్లెలు కవిత.. కేటీఆర్ ని నాయకుడిగా గుర్తించడం లేదని చెప్పిందని, ఆయన స్థాయి ఏంటో ఆమె తేల్చేసిందని అన్నారు సీతక్క.
అంతభయమెందుకు..?
సీఎం రేవంత్ రెడ్డి ఒక్క మాట మాట్లాడితే కేటీఆర్‌కు ఎందుకు అంత భయం ఎందుకని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎమ్మెల్యేలు వీధుల్లో కొట్లాడుకునే వీధి మనుషులు కాదని, శాసన సభకు ఎన్నికైన వారు అదే సభకు వచ్చి చర్చలో పాల్గొనడానికి భయమెందుకని అన్నారు. కేటీఆర్ తో పాటు కేసీఆర్ పై కూడా సెటైర్లు పేల్చారు కాంగ్రెస్ నేతలు. అసలు కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాడని నిలదీశారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఆయన అసెంబ్లీకి మొహం చాటేయడం, ఫామ్ హౌస్ లో ఉండి ప్రెస్ మీట్లు పెడ్డటమేందని కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో చర్చకు రాకుండా బీఆర్ఎస్ నేతలు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ లండన్ లో బాగా రెస్ట్ తీసుకుని తెలంగాణకు వచ్చారని, అక్కడ రెస్ట్ తీసుకుని ఇక్కడకు వచ్చి రోస్టు మొదలుపెట్టారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని ఆడిపోసుకోవడమే కేటీఆర్ కి పనిగా మారిందన్నారు. అక్కసు, కుళ్లు తప్ప కేటీఆర్ మాటల్లో ఏ మాత్రం పస లేదని ఎద్దేవా చేశారు.