Mumbai Attack Tahavvur Rana | ముంబై దాడుల కేసులో కీలక నిందితుడైన తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించే విషయంలో చివరికి అన్ని అవరోధాలు తొలగిపోయాయి. రాణా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను అమెరికా సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. భారత్-అమెరికా మధ్య ఉన్న నేరస్థుల అప్పగింత ఒప్పందం ప్రకారం అమెరికా లోయర్ కోర్టు గతంలోనే రాణాను భారత్‌కు అప్పగించాల్సిందిగా ఆదేశించింది. కానీ, ఆ ఆదేశాలను సవాల్ చేసే అవకాశం ఇక రాణాకు లేదని తేలింది.
2008 ముంబై దాడులు
2008 నవంబర్ 26న ముంబైలోని తాజ్ హోటల్, పరిసర ప్రాంతాల్లో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో వెనుక మాస్టర్ మైండ్ తహవూర్ రాణా కీలక పాత్ర పోషించాడని ఆరోపణలు ఉన్నాయి. పాకిస్థాన్ మూలాలున్న కెనడియన్ రాణా, ఆ దాడులకు ఆర్థిక సాయం అందించాడని.. ప్రధాన నిందితుడు డేవిడ్ హెడ్లీకి అత్యంత సన్నిహితుడని భారత్ విచారణాధికారులు పేర్కొన్నారు.
విచారణలో తహవూర్ రాణా గురించి తేలింది ఇదే..
దాడులకు ముందు తుది రెక్కీ నిర్వహించిందీ తహవూరేనని మరో నిందితుడు డేవిడ్ హెడ్లీ తన విచారణలో వెల్లడించాడు. గతంలో, ఉగ్రవాద మూకలకు సహాయం చేసిన కేసులో షికాగో కోర్టు రాణాకు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం అతడు లాస్ ఏంజెలెస్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో శిక్ష అనుభవిస్తున్నాడు.
Also Read: ప్రియురాలి కోసం అక్రమంగా పాకిస్తాన్ వెళ్లిన భారతీయుడు.. మోసం చేసిన యువతి..కానీ..
రాణా పిటిషన్ల పర్యవసానం
భారత్ అభ్యర్థనను అనుసరించి, కాలిఫోర్నియా డిస్ట్రిక్ కోర్టు రాణాను అప్పగించాలనే ఆదేశాలు ఇచ్చింది. అయితే, ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాణా పలు ఫెడరల్ కోర్టుల్లో పిటిషన్లు వేశాడు. ఈ భాగంగానే అతడికి ఇల్లినాయిస్ కోర్టు నిర్దోషిగా తీర్పు వెలువరించింది. కానీ కాలిఫోర్నియా కోర్టు తీర్పునే అమెరికా ప్రభుత్వం గౌరవించడంతో తహవూర్ రాణాకు కష్టాలు మొదలయ్యాయి. దీంతో విషయం అమెరికా సుప్రీం కోర్టుకి చేరింది. చివరకు, 2023 నవంబరులో సుప్రీం కోర్టులో రిట్ ఆఫ్ సెర్షియోరరి దాఖలు చేశాడు. ఈ రిట్‌ను కింది కోర్టుల ఆదేశాలను రద్దు చేయడంలో ఉపయోగిస్తారు. క్యాలిఫోర్నియా కోర్టు ఆదేశాలను రద్దు చేయాలని రాణా తన రిట్ పిటీషన్‌లో కోరాడు.
సుప్రీం కోర్టు తీర్పు
అయితే, ప్రభుత్వం తరఫున సోలిసిటర్ జనరల్ ఎలిజబెత్ ప్రెలోగర్ వాదనలు వినిపిస్తూ.. ఇల్లినాయిస్ కోర్టు రాణాను నిర్దోషిగా పేర్కొన్నప్పటికీ, భారత్ అభియోగాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని.. అతనికి ఉపశమనం ఇవ్వకూడదని కోర్టును కోరారు. ఈ వాదనల ఆధారంగా సుప్రీం కోర్..టు రాణా పిటిషన్‌ను తిరస్కరించింది. చివరికి రివ్యూ పిటిషన్ కూడా కొట్టివేయడంతో, రాణా ముందు ఉన్న అన్ని మార్గాలు మూసుకుపోయాయి.
తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించడానికి మార్గం సుగమం కావడం, భారత ప్రభుత్వం సాధించిన విజయమని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత, రాణాను త్వరలో భారత్‌కు అప్పగిస్తారని అధికారులు చెబుతున్నారు. ఈ పరిణామంతో ముంబై దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు న్యాయం అందించడానికి మొదటిఅడుగుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.