Congress Praises TG Ministers: తెలంగాణలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ.. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లును పార్లమెంటులోనూ ఆమోదించి, అమలు చేయాలని.. ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా బీసీ సంఘాలు ధర్నా నిర్వహించిన సంగతి తెలిసిందే.. అదేవిధంగా.. దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేపట్టాలని, 33 శాతం మహిళా రిజర్వేషన్లలో.. బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని బీసీ నేతలు డిమాండ్ చేశారు. ఢిల్లీ వేదికగా బీసీల గొంతు కేంద్రానికి వినిపించేందుకు.. బీసీ సంఘాలు చేపట్టిన ఆందోళనకు కాంగ్రెస్ మద్దతు తెలిపింది.
రిజర్వేషన్ల అమలు కోసం జంతర్ మంతర్ వేదికగా.. కేంద్రాన్ని నిలదీసింది. బీసీల న్యాయమైన డిమాండ్‌కు మద్దతు తెలపాలని.. బీసీ సంఘాలు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను ఆహ్వానించాయి. కానీ.. ఆ రెండు పార్టీలు జంతర్ మంతర్‌లో బీసీల ధర్నాకు దూరంగా ఉన్నాయి. బీసీల అంశం ఎప్పుడు ప్రస్తావనకొచ్చినా.. తమది బీసీల పార్టీ అని చెప్పుకునే రెండు పార్టీల నాయకులు.. ఢిల్లీ ధర్నాకు ఎందుకు సంఘీభావం తెలపలేదనే ప్రశ్న.. తెలంగాణ సమాజంలో తలెత్తుతోంది? రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ ఇదే చర్చనీయాంశంగా మారింది.
ఢిల్లీలో బీసీల పోరు గర్జనకు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు హాజరయ్యారు. రాహుల్ గాంధీ స్ఫూర్తితో కులగణన చేపట్టామని సీఎం చెప్పారు. ఏడాది పాలన తిరగకముందే.. బీసీల రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ చట్టసభల్లో బిల్లు పెట్టామని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల పెంపు కేంద్రం ప్రభుత్వం పరిధిలోని అంశమని.. బీసీల ధర్మబద్ధమైన కోరికని నెరవేర్చేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ ముందుకు రావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచుకునేందుకు అనుమతి ఇస్తే.. 10 లక్షల మందితో సభ పెట్టి.. మోదీని సన్మానిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
రాష్ట్రంలోని బీజేపీ నేతలు కూడా బీసీ రిజర్వేషన్ల పెంపుపై స్పష్టమైన వైఖరి తెలపట్లేదు. కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి చేయట్లేదు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై.. బీఆర్ఎస్ నేతలు కూడా ఏదీ స్పష్టంగా చెప్పట్లేదు. అయితే.. ఇప్పుడు బాల్ బీజేపీ కోర్టులో ఉంది. బీసీ రిజర్వేషన్లు పెంచాలా? వద్దా? అనేది.. పూర్తిగా కేంద్రం పరిధిలో ఉన్నటువంటి అంశం. అందుకోసమే.. బీసీ సంఘాలన్నీ కలిసి ఢిల్లీలో తమ గొంతు వినిపించాయి. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోరాయి. కానీ.. కాంగ్రెస్ నేతలు మాత్రమే ఢిల్లీకి వెళ్లి సంఘీభావం తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్.. ఈ ధర్నాకు దూరంగా ఉన్నాయి.
బీజేపీ, బీఆర్ఎస్‌కు.. కాంగ్రెస్ ప్రధాన రాజకీయ ప్రత్యర్థే కావొచ్చు. కానీ.. ఈ రిజర్వేషన్ అంశం బీసీలకు సంబంధించింది. బీసీల ఆందోళనకు మద్దతిస్తే.. కాంగ్రెస్‌కు ఎంత రాజకీయ లబ్ధి చేకూరుతుందనేది పక్కనబెడితే.. బీసీలకు ఎంత మేలు జరుగుతుందనేదే మేజర్ పాయింట్. బీసీల విషయంలో.. రెండు పార్టీలు స్పష్టమైన వైఖరితో లేకపోవడం పట్ల.. బీసీ సమాజంలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు.. బీసీలకు రిజర్వేషన్ పెంపుపై హామీ ఇచ్చి.. విఫలమైంది. బీజేపీ కూడా బీసీ నేతని ముఖ్యమంత్రి చేస్తామనే హామీ ఇచ్చింది. కానీ.. ఇప్పుడదే బీసీల రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో ధర్నా చేపడితే మాత్రం.. రెండు పార్టీలు దూరంగా ఉండటం కొత్త ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. ఇప్పుడు గనక బీసీల మద్దతు కోల్పోతే.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు పార్టీలకు నష్టం జరిగే అవకాశం ఉందనే విశ్లేషణలు సైతం వినిపిస్తున్నాయి. మరోవైపు.. జంతర్ మంతర్‌లో చేసిన ఈ ధర్నా వర్కవుట్ అవతుందా? లేదా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
Also Read: వక్ఫ్ బోర్డులో మార్పులు.. టైం చూసి దెబ్బకొట్టిన మోడీ
ఈ తరుణంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని కలిశారు తెలంగాణ బీసీ ఎమ్మెల్యేలు. కుల గణన, ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ బిల్లు, జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల దీక్ష తదితర అంశాల గురించి చర్చించారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అటు బీసీలకు రాజకీయ విద్య ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ.. తెలంగాణ శాసన సభలో చట్టం చేయడంపై సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంట్ హాల్ లో జరిగిన ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, అనిల్ యాదవ్, ఇతర బీసీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.