డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబుతో హరీష్ రావు డిస్కషన్..
మంత్రి పొంగులేటితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాటామంతీ
మంత్రి శ్రీధర్ బాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, గంగుల కమలాకర్ భేటీ
మినిస్టర్ జూపల్లి కృష్ణారావుతో కొత్త ప్రభాకర్ రెడ్డి మంతనాలు
తుమ్మల నాగేశ్వరరావుకి తలసాని విన్నపాలు
మంత్రి సీతక్కకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అభ్యర్థనలు
తెలంగాణ బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా అసెంబ్లీలో ఆవిష్కృతమైన దృశ్యాలివి. ఈ దృశ్యాలు చూస్తుంటే కచ్చితంగా అధికార కాంగ్రెస్ పార్టీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే ఓవైపు అసెంబ్లీలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఆ విమర్శల పర్వం పూర్తికాగానే బీఆర్ఎస్ నేతలు నేరుగా మంత్రుల పక్కకు వచ్చి కూర్చున్నారు. తమ తమ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. పనులు పూర్తి చేస్తామనే హామీలను పొందారు.
వీడియోలు, ఫొటోలు వైరల్..
అసెంబ్లీలో మంత్రుల సీట్ల వద్దకు వచ్చి బీఆర్ఎస్, బీజేపీ నేతలు మాట్లాడుతున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు ఈ ఫొటోలను వైరల్ చేశారు. అప్పటి వరకు కాంగ్రెస్ నేతలపై విమర్శలు చేసిన బీఆర్ఎస్ నేతలు, నియోజకవర్గ పనులకోసం తిరిగి వారి వద్దకే వెళ్లారని కామెంట్లు పెట్టారు. అలా వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నేతలు కూడా సానుకూలంగా ఆహ్వానించారు. వారి ప్రతిపాదనలను ఓపికగా విన్నారు. పనులు పూర్తి చేస్తామంటూ హామీ ఇచ్చి పంపించారు.
ఇది కదా ప్రజాస్వామ్యమంటే..
అప్పటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్న నేతలు ప్రజా సమస్యలకోసం తమ విరోధాన్ని పక్కనపెట్టడం విశేషం. పోనీ బీఆర్ఎస్ నేతలు తమ నియోజకవర్గ పనులకోసం వెళ్లారనుకుందాం. ఆయా నియోజకవర్గాల్లో పనులు చేస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చే లాభం లేదని అనుకోకుండా మంత్రులు కూడా వారికి సానుకూలంగా స్పందించడం ఇక్కడ గొప్ప విషయం అని నెటిజన్లు అంటున్నారు.
బీఆర్ఎస్ హయాంలో ఇలా..
2014కి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ఆరోగ్యకర స్థితిలోనే రాజకీయాలు ఉండేవని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ పాలన మొదలయ్యాకే రాజకీయాల మరీ దారుణంగా తయారయ్యాయని అంటున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమాత్రం పనులు చేసేది కాదు. పనులు కావాలంటే కండువా మార్చుకోవాలనే నిబంధన ఉండేది. 2014లో అలా టీడీపీ ఎమ్మెల్యేలను భయపెట్టి, బెదిరించి ఆ పార్టీని బీఆర్ఎస్ లో విలీనం చేసుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ ని టార్గెట్ చేసినా బీఆర్ఎస్ కుటిల పన్నాగం అమలు కాలేదు.
తీరా ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ నేతలు పనులకోసం వారి చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం గత బీఆర్ఎస్ లాగా ప్రతీకార రాజకీయాలు చేయాలనుకోలేదు. ఎమ్మెల్యే మన పార్టీ అయినా, ప్రత్యర్థి పార్టీ అయినా ఆ నియోజకవర్గానికి నిధులివ్వడం, పనులు చేయడమే మన విధి అని భావిస్తున్నారు మంత్రులు. అందుకే బీఆర్ఎస్ నేతల నియోజకవర్గాల్లో కూడా పనులు సజావుగా సాగుతున్నాయి. అదీ బీఆర్ఎస్ కీ, కాంగ్రెస్ కీ మధ్య ఉన్న తేడా అని అంటున్నారు నెటిజన్లు.