BYD Car In Telangana: తెలంగాణకు మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు రాబోతోంది. చైనా ఈవీ కార్ల దిగ్గజం బీవైడీ చూపు భాగ్యనగరం హైదరాబాద్‌పై పడింది. నగర శివారు ప్రాంతంలో ఈవీ కార్ల యూనిట్ స్థాపించేందుకు రెడీ అవుతోంది. దీనిపై కొంతకాలంగా ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తోంది. దాదాపుగా ఓకే అయినట్టు ఆ కంపెనీ నుంచి సంకేతాలు వస్తున్నాయి. త్వరలో దీనికి సంబంధించి ఒప్పందాలు జరగనున్నట్లు సమాచారం.
దేశంలో ప్రస్తుతం ఈవీ వాహనాల జోరు సాగుతోంది. ఇండియాలో టెస్లా యూనిట్ పెడుతుందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా కార్ల కంపెనీ ఇండియా మార్కెట్‌పై కన్నేసింది. టెస్లా కంటే ముందు భారత్ మార్కెట్‌లో పాగా వేయాలని ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలో భారత్‌లో 10 బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టాలని భావిస్తోంది చైనా ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం BYD.
మార్చిలో న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని బయపెట్టింది ఆ కంపెనీ. కార్ల మేకింగ్ యూనిట్‌తోపాటు 20 గిగావాట్ల బ్యాటరీ ప్లాంట్ ఏర్పాటు చేయాలనేది ఆ కంపెనీ ప్లాన్. చైనా పెట్టుబడుల విషయంలో కేంద్రం నిబంధనలు కఠినంగా ఉన్నాయి. దీనివల్ల ఇప్పటివరకు అది సాధ్యంకాలేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించింది. 49 శాతం పెట్టుబడి పెట్టుకోవచ్చన్న సూచనతో బీవైడీ కంపెనీ ఫోకస్ చేసింది.
ఇక ప్రాజెక్టు విషయాని కొద్దాం.. బీవైడీ కంపెనీ కొన్నాళ్లుగా తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమి కేటాయించడం, అన్నిరకాలుగా మద్దతు ఇస్తామని ఆ సంస్థకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో కార్ల యూనిట్ పెట్టేందుకు సుముఖంగా ఉన్నట్లు ఆ కంపెనీ వర్గాల మాట.
ALSO READ: నకిరేకల్‌లో పదో తరగతి పేపర్ లీక్.. కేసీఆర్‌పై కేసు
యూనిట్ ఏర్పాటుకు అనువైన హైదరాబాద్ శివారులోని మూడు ప్రాంతాలను బీవైడీకి ప్రభుత్వం ప్రతిపాదించింది. వాటిని ఆ సంస్థ ప్రతినిధులు పరిశీలించారు. వారంలో తుది నిర్ణయానికి రావచ్చని సమాచారం. ఆ తర్వాత ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనుంది.
అంతా అనుకున్నట్లుగా జరిగితే ఈవీ కార్ల విభాగంలో అతిపెద్ద ప్రైవేటు ప్రాజెక్టు ఇదే. ఈవీ కార్ల విడిభాగాలతోపాటు ఉత్పత్తి చేసే అనుబంధ యూనిట్లను ఫ్యాక్టరీకి సమీపంలో ఏర్పాటు కానున్నాయి. దీని ద్వారా విద్యుత్తు వాహనాల క్లస్టర్ హైదరాబాద్ సిటీ రూపు దిద్దుకోవడం ఖాయమన్నమాట.
బీవైడీ చాన్నాళ్లుగా భారత్‌లో తన కార్యకలాపాలు సాగిసోంది. కాకపోతే సొంతంగా యూనిట్ లేదు. చైనా నుంచి భారత్‌కు కార్లను తీసుకువచ్చి విక్రయాలు చేస్తోంది. దీనివల్ల అధిక దిగుమతి పన్నులు చెల్లించాల్సి వస్తోంది. దీనికారణంగా ప్రస్తుతం ఆ కార్ల ధర కాసింత ఎక్కువగానే ఉందని చెప్పువచ్చు. ఆశించిన రీతిలో అమ్మకాలు చేయలేకపోతోంది.
ఇక్కడే ఉత్పత్తి చేస్తే ధర తగ్గడమే కాదు, అమ్మకాలు గణనీయంగా పెరిగే ఛాన్స్ ఉందని ఓ అంచనా. హైదరాబాద్ కేంద్రంగా ఈవీ బస్సుల కార్యకలాపాలు సాగిస్తున్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌తో ఏళ్లుగా బీవైడీకి భాగస్వామ్యం ఉంది. బీవైడీ అందించే టెక్నాలజీతో ఎలక్ట్రిక్ బస్సులను ఉత్పత్తి చేసి దేశవ్యాప్తంగా సరఫరా చేస్తోంది. ఈ క్రమంలో విద్యుత్తు కార్ల యూనిట్ ఏర్పాటుకు రాష్ట్రాన్ని ఎంచుకుందని అంటున్నారు.
గతేడాది టెస్లా ఆదాయం సుమారు రూ.8.40 లక్షల కోట్లు. బీవైడీ ఆదాయం రూ.9.20 లక్షల కోట్లు. చైనా, ఐరోపా టెస్లా అమ్మకాలు తగ్గుముఖం పట్టగా, బీవైడీ అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. కేవలం 5 నుంచి 8 నిమిషాల వ్యవధిలో విద్యుత్తు కార్ల బ్యాటరీని ఛార్జి చేయగలిగే ఒక మెగావాట్ ఫ్లాష్ ఛార్జర్‌ను ఇటీవలే విడుదల చేసింది ఈ సంస్థ.