Kaleshwaram Commission: కాళేశ్వరం కమిషన్ విచారణకు ముందుకు రానున్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. విచారణ సమయంలో కమిషన్ ముందు ఆయన ఏం చెప్పబోతున్నారు అనేదానిపై రాజకీయ పార్టీల్లో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. మాజీ బాస్‌ను కాపాడుతారా? లేక ఇరికిస్తారా? అనేది అసలు ప్రశ్న.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో జరిగిన అవకతవకలపై విచారణ సాగిస్తోంది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. కమిషన్ విచారణ దాదాపు క్లైమాక్స్‌కు చేరింది. దీంతో శుక్రవారం కమిషన్ ముందుకు రానున్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో కమిషన్ ముందుకు హాజరుకానున్నారు.
బ్యారేజీల నిర్మాణ సమయంలో అప్పటి బీఆర్ఎస్ హయాంలో ఈటల రాజేందర్ ఆర్థికమంత్రిగా పని చేశారు. బ్యారేజీల నిర్మాణాలకు నిధుల విడుదల, మంత్రి మండలి తీర్మానాలపై కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటివరకు జరిగిన విచారణలో మాజీ ఈఎన్సీలు, సీఈలు, ఐఏఎస్ అధికారులు ఆర్థిక సంబంధమైన అంశాలపై కమిషన్ ముందుకు బయటపెట్టారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా ఆర్థిక సంబంధమైన లోపాలు, నిబంధనల ఉల్లంఘనలపై కమిషన్ ప్రశ్నించే అవకాశముంది.
ALSO READ: ఉద్యోగులకు డబ్బుల జల్లు, అకౌంట్లు చెక్ చేసుకోండి
కేబినెట్ ఆమోదం లేకుండానే నిర్ణయాలు తీసుకున్నారని, పలువురు ఇప్పటికే కమిషన్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. పార్టీ మారిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వివిధ సందర్భాల్లో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఈటెల రాజేందర్. ప్రాజెక్టు నిర్మాణం విషయంలో అన్నీ తానై కేసీఆర్ వ్యవహరించారని పలుమార్లు ఆయన మీడియా సాక్షిగా చెప్పారు.
అవన్నీ రాజకీయ ఆరోపణలు మాత్రమేనని సరిపెట్టుకుంటారా? ఆనాటి విషయాల గుట్టును ఈటెల బయటపెడతారా? కమిషన్ ముందు ఆయన మీడియాతో చెప్పిన విషయాలు చెబుతారా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీతో ఆయన సన్నిహితంగా ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది.
పొలిటికల్ వర్గాల సమాచారం మేరకు బీఆర్‌ఎస్‌లోని కీలక నేతలు ఇప్పటికే ఈటెలతో మాట్లాడారని అంటున్నారు. అదే జరిగితే కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఆయన ఎలాంటి సమాచారం ఇవ్వరని అంటున్నారు. ప్రస్తుతం విచారణలో అడిగే అంశాలను ఈటెల దాచినా, రేపటి రోజు అసెంబ్లీలో నివేదిక బయటపెడితే లోగుట్టు బయటపడడం ఖాయమని అంటున్నారు.