Big Stories

Etela : ఈటల.. ఈ వలసలు ఏల? హైకమాండ్ యాక్షన్?

Etela : అంతన్నారు.. ఇంతన్నారు.. కేసీఆర్ కొమ్ములు వంచే మొనగాడిని తానే నన్నారు. ప్రగతి భవన్ గోడలు బద్దలుకొడతానన్నారు. అన్నట్టు గానే.. హుజురాబాద్ లో గెలిచి సత్తా చాటారు. ఇంకే.. బీజేపీలో ఈటల ఇమేజ్ అమాంతం పెరిగింది. హైకమాండ్ ఫుల్ ఖుషీ అయింది. పార్టీలో మరింత ప్రమోషన్ ఇచ్చింది. ఏకంగా జాయినింగ్ కమిటీ ఛైర్మన్ ను చేసింది. కేసీఆర్ గుట్టుమట్లు.. గులాబీదళంలో లుకలుకలు గురించి బాగా తెలిసిన రాజేందర్ కు.. పార్టీ చేరికల బాధ్యత అప్పగిస్తే.. టీఆర్ఎస్ నేతలను పెద్ద సంఖ్యలో లాగేసి.. కేసీఆర్ ను దెబ్బ కొట్టొచ్చని భావించారు. అయితే, అనుకున్నదొక్కటి.. అవుతున్నది ఇంకోటి. ఈటల, జాయినింగ్ కమిటీ ఛైర్మన్ అయి చాలా కాలమే అవుతున్నా.. ఇప్పటి వరకూ చెప్పుకోదగిన చేరిక ఒక్కటి కూడా జరగలేదని అంటున్నారు. కీలకమైన మునుగోడు ఎలక్షన్ టైమ్ లో బూర నర్సయ్య గౌడ్ ను చేర్చుకోవడంలోనూ రాజేందర్ పాత్ర ఏమీ లేదని చెబుతున్నారు. బూర డీల్.. బండి సంజయ్ ఆధ్వర్యంలోనే జరిగిందని తెలుస్తోంది. కానీ, నర్సయ్య గౌడ్ ఎపిసోడ్ బూమరాంగ్ లా మళ్లీ బీజేపీనే దెబ్బ కొట్టడం.. ఒకరికి బదులు ముగ్గురు బడా నేతలు బీజేపీని వీడటం.. ఇంత జరుగుతుంటే ఈటల ఏం చేస్తున్నారనే ఆగ్రహం.. కమలంలో కల్లోలం రేపుతోంది. అధిష్టానం సైతం ఈ విషయంలో సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. మునుగోడు ఎన్నిక ముగిసే వరకూ.. చేరికలు ఆపేయాలని.. నేతలంగా హైదరాబాద్ ను వీడి మునుగోడులోనే మకాం వేసి.. ప్రచారం మరింత ముమ్మరం చేయాలని ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చాయి.

టీఆర్ఎస్ ను చీల్చి.. నేతలను బీజేపీలోకి ఆకర్షించే విషయంలో ఈటల ఫెయిలయ్యారా? అంటే అవుననే అంటున్నారు. బూర మినహా ఇంత వరకూ ఒక్కరంటే ఒక్క పెద్ద స్థాయి నాయకుడు కూడా కాషాయ కండువా కప్పుకోలేదు. జాయినింగ్ కమిటీ ఛైర్మన్ గా ఈటల ఫ్లాప్ అయ్యారనే చర్చ పార్టీలో జరుగుతోంది. చేరికలు చేయలేకపోయినా.. కనీసం పార్టీ నుంచి వెళ్లిపోయే వారినైనా ఆపాలిగా? ఆ బాధ్యత ఈటలదే కదా? అంటూ వైఫల్యాన్ని పూర్తిగా ఈటలపైనే నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు కొందరు సీనియర్లు.

ఉద్యమకాలం నుంచీ స్వామి గౌడ్, ఈటల రాజేందర్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. అలాంటిది, బీజేపీ నుంచి స్వామి గౌడ్ తిరిగి టీఆర్ఎస్ లోకి వెళ్తున్నారనే కనీస సమాచారం కూడా ఈటల దగ్గర లేకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. చేరికలు లేవు, ఆపడాలు లేవు. మరి, ఈటల ఉంది ఎందుకు అంటూ ఆయన్ను కార్నర్ చేస్తున్నారు.

ఎంత కాదన్నా.. బీజేపీలోనూ గ్రూపు రాజకీయాలు తారాస్థాయికి చేరాయని పార్టీ వర్గాలే అంటున్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి వేరు వేరు గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని ఓపెన్ సీక్రెట్. ఈటల, వివేక్ లాంటి వాళ్లది మరో గ్రూప్ అంటున్నారు. ఒకరు ఎదగకుండా మరొకరు అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారని.. గ్రూపు రాజకీయాలతో పార్టీ నష్టం కలిగిస్తున్నారని అంటున్నారు. స్వామి గౌడ్, శ్రవణ్, బిక్షమయ్య గౌడ్ ల రాజీనామాలో ఈటలను బలిపశువు చేసే ప్రయత్నం కొందరు కావాలనే చేస్తున్నారని చర్చించుకుంటున్నారు. మరి, తాజా వ్యవహారంపై బీజేపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో?

ఇవి కూడా చదవండి

Latest News