Big Stories

Telangana Politic : ఆ ముగ్గురు.. ఆ లెక్కే వేరు!.. ఆఫ్ ది రికార్డ్ మేటర్

Telangana Politic : తెలంగాణ రాజకీయం ఇప్పుడు ‘గోపి’ల చుట్టే తిరుగుతోంది. జంపింగ్ జపాంగ్ లకు ఫుల్ డిమాండ్. నిన్నామొన్నటి వరకూ టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వలసలు ఉంటే.. లేటెస్ట్ గా గులాబీ దళం దూకుడు పెంచింది. ఆపరేషణ్ ఆకర్ష్ తో కమలం రేకులు రాలగొడుతోంది. కేంద్రంలో అధికారం.. బలమైన జాతీయ పార్టీ.. అయినా, బీజేపీ నుంచి కీలక నేతలను బయటకు రప్పించారంటే.. వాళ్లపై ఏ రేంజ్ లో బల, ధన ప్రయోగం జరిగుంటుందో అనే చర్చ మొదలైంది. స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్, బూడిద బిక్షమయ్య గౌడ్.. ఒక్కొక్కరిదీ ఒక్కో అవసరం. సామ, దాన, దండోపాయాలతో ఆ ముగ్గురిని కారులోకి లాగేసింది. ఆ మాయాజాలం గురించి టీఆర్ఎస్ బిగ్ సర్కిల్స్ లో ఆసక్తికరమైన టాక్ నడుస్తోంది.

స్వామి గౌడ్. బలమైన నేత. తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వట్లేదని.. ఇటీవలే కారు దిగి కాషాయ కండువా కప్పుకున్నారు. ఈయన ఇంత ఈజీగా గులాబీ బుట్టలో ఎలా పడ్డారనేది ఆసక్తికరం. కేసీఆర్ పై సడెన్ గా ప్రేమ, నమ్మకం వచ్చే అవకాశమే లేదు. మరి ఎందుకు స్వామి గౌడ్ మళ్లీ గులాబీ వనంలో కలిసిపోయారు? అంటే, ఓ కారణం చెబుతున్నారు. గచ్చిబౌలిలోని టీఎన్జీవో హౌజింగ్ సొసైటీకి ఛైర్మన్ గా ఉన్నారు స్వామిగౌడ్. సొసైటీకి చెందిన భూముల పర్మిషన్ ను కొంతకాలంగా ప్రభుత్వం తొక్కిపెట్టిందట. ఆ ఫైల్ క్లియర్ చేస్తాం.. పార్టీలోకి వచ్చేసేయ్.. అంటూ అటునుంచి ప్రపోజల్ వచ్చిందని అంటున్నారు. నీకు కావాల్సింది ఎమ్మెల్సీయేగా.. ఈసారి పక్కాగా ఇస్తా. ముందు గులాబీ కండువా కప్పుకో అంటూ హామీ ఇవ్వడంతో.. స్వామి గౌడ్ మెత్తబడ్డారట. ఇష్టం లేకపోయినా.. ప్రగతి భవన్ ఒత్తిడికి తలొగ్గక తప్పలేదంటున్నారు ఆయన సన్నిహితులు.

బూడిద బిక్షమయ్య గౌడ్ ది మరో రకం డీల్. స్వతహాగా ఆయన వ్యాపారి. రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఉన్నాయి. ఎలాగూ లూప్ హోల్స్ ఉంటాయిగా. సరిగ్గా వాటిని పట్టి లాగి.. బూడిద బిజినెస్ కు కొర్రీల మీద కొర్రీలు పెట్టారని తెలుస్తోంది. వ్యాపారం సాఫీగా సాగాలంటే.. పార్టీలోకి రా.. త్వరలో ఉమ్మడి నల్గొండలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ సీటు నీకే ఇస్తాం అంటూ ఎర కూడా వేశారట. దీంతో, బిక్షమయ్య గౌడ్.. ఆరు నెలల్లోనే బీజేపీ నుంచి తిరిగి టీఆర్ఎస్ లోకి వచ్చేశారని అంటున్నారు.

దాసోజు శ్రవణ్ ది ఇంకో తరహా వ్యవహారం. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు టాప్ లీడర్ గా చెలామణి అయిన దాసోజుకు.. బీజేపీలో అంత ప్రాధాన్యం ఉండట్లేదట. బీజేపీలోకి ఎందుకొచ్చానా? అనే ఆవేదనలో ఉన్నారని పసిగట్టిన గులాబీ నేతలు.. ఇదే మంచి టైమ్ అంటూ.. ఆయన ఆర్థిక అవసరాలు తీర్చేసి.. పార్టీ కండువ కప్పేశారని ప్రచారం జరుగుతోంది.

ఇలా, చాలా మంది నేతల లిస్ట్ కేసీఆర్ టేబుల్ మీద ఉందని.. ఒక్కొక్కరినీ ఒక్కో తరహాలో డీల్ చేస్తున్నారని.. త్వరలోనే మరింత మంది నాయకులు కారు ఎక్కడం ఖాయమని అంటున్నారు. మరి, టీఆర్ఎస్ దూకుడును బీజేపీ ఎలా ఫేస్ చేస్తుందో? ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ పేరుతో తెలంగాణలోకి ఈడీ, సీబీఐల ఎంట్రీ ఇచ్చి.. వార్నింగ్ బెల్స్ మోగించినా.. కేసీఆర్ మాత్రం తగ్గేదే లే అనేలా బీజేపీని బాగా కవ్విస్తుండటంతో కమలదళంలో ఆగ్రహం రెట్టింపవుతోంది. ముందుముందు ఆ రెండు పార్టీల రాజకీయం మరింత రంజుగా సాగడం ఖాయం.

ఇవి కూడా చదవండి

Latest News