Fake Witnesses: స్వేచ్ఛ బ్యూరో: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అక్రమాలకు, నిబంధనల ఉల్లంఘనలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. భూములు, ప్లాట్ల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కీలకమైన ‘సాక్షి సంతకాలు’ ఇప్పుడు బహిరంగంగానే విక్రయ వస్తువులుగా మారిపోయాయి. కార్యాలయం ఆవరణలో తిష్టవేసిన కొంతమంది మధ్యవర్తులు, బ్రోకర్లు సాక్షులు”గా అవతారమెత్తి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారు.
నిజానికి రిజిస్ట్రేషన్ సమయంలో కొనేవారికి, అమ్మేవారికి ఇరుపక్షాల తరపున తెలిసిన వ్యక్తులు, నమ్మకస్తులు సాక్షులుగా సంతకాలు చేయాలి. కానీ గద్వాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో కథ వేరుగా ఉంది. ప్లాట్లు, స్థలాల క్రయవిక్రయదారులతో ఎలాంటి పరిచయం లేకపోయినా, అసలు ఆ భూమి ఎక్కడుందో తెలియకపోయినా.. కేవలం డబ్బుల కోసం సాక్షి సంతకాలు పెట్టే ముఠాలు ఇక్కడ తయారయ్యాయి. కొంతమంది మధ్యవర్తులు ఒక్కో సంతకానికి ఇంత అని రేటు ఫిక్స్ చేసి, కొనుగోలుదారుల నుంచి వసూలు చేస్తూ ఈ దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు.
కార్యాలయం చుట్టూ తిరిగే కొద్దిమంది వ్యక్తులే రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే వేర్వేరు రిజిస్ట్రేషన్లలో సాక్షులుగా మారుతుండటం గమనార్హం. ఒక్కొక్కరు రోజుకు పదికి పైగా డాక్యుమెంట్లపై సాక్షి సంతకాలు పెడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి డాక్యుమెంట్‌కు ఆధార్ కార్డు, వేలిముద్రలు సేకరిస్తున్నప్పటికీ, ఒకే వ్యక్తి రోజూ ఇన్ని సంతకాలు పెడుతుంటే అధికారులు ఎలా చూస్తూ ఊరుకుంటున్నారనే విమర్శలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి.
ఈ సాక్షుల వల్ల భవిష్యత్తులో భూ వివాదాలు తలెత్తినప్పుడు అసలైన కొనుగోలుదారులు, అమ్మకందారులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చినప్పుడు ఈ నకిలీ సాక్షులు ఆ దస్తావేజులను నిరూపించలేరని, దీనివల్ల అమాయక ప్రజలు మోసపోతారని మేధావులు హెచ్చరిస్తున్నారు. గద్వాల రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సాగుతున్న ఈ ‘ సాక్షుల’ దందాపై రిజిస్ట్రేషన్ అధికారులు తక్షణమే స్పందించాలని, రోజువారీ రిజిస్ట్రేషన్లలో ఒకే వ్యక్తి పదే పదే సాక్షిగా రాకుండా ఆధార్ డేటా ఆధారంగా కఠిన నిబంధనలు అమలు చేయాలని, ఈ అక్రమాలకు పాల్పడుతున్న మధ్యవర్తులపై సంబంధిత జిల్లా అధికారులు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.
Also read: Rythu Bharosa: 5 నుండి 6 ఎకరాలున్న రైతు ఖాతాల్లోకి.. రైతు భరోసా నిధులు విడుదల!