Krishi Vaas App: సాధారణంగా రైతులు తాము సాగు చేసిన పంటను చూడాలంటే అదే పనిగా పొలం వద్దకు వెళ్ళాల్సిందే. అలాగే ఏదైనా పురుగు పట్టిందా అనే ఆందోళన కలిగిందా పొలం బాట పట్టాల్సిందే. అంతేకాదు పొలంలో ఏం జరుగుతుందో ఆందోళన ఎక్కడ ఉన్నా చెందాల్సిందే. తాను సాగు చేసే పంటను ప్రాణం కంటే మిన్నగా రైతు చూసుకుంటారు. అందుకు ప్రధాన కారణం నేల తల్లిని నమ్ముకొని కుటుంబాన్ని సాగించే రైతన్నలు ఇలా తమ పంట సాగులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అటువంటి రైతన్నల కష్టాలకు, ఆందోళనలకు ఇక శుభం కార్డు వేసినట్లే. అందుకు ప్రధాన కారణం రైతన్న ఎక్కడ ఉన్నా.. తన పంటను జస్ట్ ఒక్క క్లిక్ చూసుకోగలిగే ఆధునిక టెక్నాలజీ చెంత చేరింది. ఇలాంటి ఎన్నో ఆవిష్కరణలను చేరువ చేసింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం.
సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో రైతు పండుగను నిర్వహిస్తోంది. అందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా పాలమూరులో గురువారం రైతు గర్జనను నిర్వహించింది. ఈ గర్జనలో రైతులకు సంబంధించిన 120 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ లో ఎన్నో ఆవిష్కరణలు, సులభతర వ్యవసాయం, పంటలకు చీడపీడ పురుగులు పట్టితే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, సేంద్రీయ వ్యవసాయ సాగుతో లాభాలు ఏమిటనే సందేహాలకు సమాధానంగా స్టాల్స్ ఉన్నాయన్నది రైతుల మాట.
ఇందులో ఓ స్టాల్ మాత్రం రైతులతో నిండిపోయింది. ఇంతకు అసలు ఆ స్టాల్ స్పెషాలిటీ ఏమిటని బిగ్ టీవీ ప్రత్యేకంగా స్టాల్ నిర్వాహకులను పలకరించగా, వ్యవసాయానికి సంబంధించిన సూపర్ యాప్ గురించి వివరించారు. మారిన ఆధునిక కాలంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని వ్యవసాయం సాగిస్తే, సులభతర అవకాశాలు మన ముంగిట ఉన్నాయని స్టాల్ ను చూసిన రైతులు తెలుపుతున్నారు. మరి ఈ స్టాల్ ఏమిటంటే.. అదే క్రిషి వాస్.
క్రిషి వాస్ స్టాల్ అంటే ఏమిటో అనుకుంటే పొరపాటే.. జస్ట్ ఈ ఒక్క యాప్ రైతు మొబైల్ ఫోన్ లో ఉంటే చాలు.. ఎన్నో చిక్కులకు చెల్లు చీటీనే. ముందుగా రైతు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ కలిగి ఉండి, క్రిషి వాస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. తన మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ కావాలి. ఆ తర్వాత పంట విస్తీర్ణం, ఏ పంట సాగు చేస్తున్నారో అందులో పొందుపరచాలి. అలాగే ఏరోజు పంట విత్తే తేదీ అయితే ఆ తేదీని అందులో నమోదు చేస్తే చాలు, పంట కోత తేదీ ఆటోమేటిక్ గా వస్తుంది. అనంతరం సబ్మిట్ చేసిన తరువాత, పంట సరిహద్దును పొలంలో ఉండి నమోదు చేయాల్సి ఉంటుంది.
ఇలా పంట నమోదుకు మూడు పద్దతులు ఉన్నట్లు స్టాల్ నిర్వాహకులు తెలిపారు. ఒకటి మ్యాప్ ఆధారంగా నమోదు చేయడం, రెండవది పొలం గట్టు వెంట నడుస్తూ నమోదు, మూడవది ఆఫ్ లైన్ విధానంలో నమోదు చేయడం కూడా యాప్ లో సలభతర విధానం ఉందన్నారు. మొత్తం బౌండరీ నమోదు చేసిన అనంతరం అప్పుడు పొలం గట్లు మనకు యాప్ లో కనిపిస్తాయి. వాటిని ఒకదానికి ఒకటి అనుసంధానం చేస్తే చాలు, జియో ట్యాగ్ విధానం ద్వారా మన పొలం సేవ్ అవుతుంది. 48 గంటల తర్వాత మనకు మన పొలం మన మొబైల్ ఫోన్లో కనిపిస్తుంది.
ఇక అంతే అసలు పొలంలో ఏం జరుగుతుంది? పొలంలో పంట పరిస్థితి, పంటకు పురుగు పట్టిందా.. పడితే మనం ఏమి చేయాలి, ఇలా అన్నీ మనం ఎక్కడి నుండైనా చూసుకోవచ్చు. రైతన్నలు ప్రతి విషయానికి పొలం వద్దకు వెళ్లకుండ, ఎక్కడి నుండైనా తన పొలాన్ని, పంట పరిస్థితిని చూసుకొనే బృహత్తర అవకాశం క్రిషి వాస్ యాప్ ద్వారా కలుగుతుందని స్టాల్ నిర్వాహకులు తెలిపారు. ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా సమయం ఆదా అవుతుందని, ప్రతి ఒక్క రైతు ఈ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
Also Read: Indian Railway Complaints: రైలులో ప్రయాణిస్తున్నారా.. అలా జరిగితే.. ఇలా చేసేయండి!
ఈ స్టాల్ సందర్శించిన అనంతరం బిగ్ టీవీతో రైతులు మాట్లాడుతూ.. రైతు గర్జన కార్యక్రమం ద్వార తమకు సులభతర వ్యవసాయ పద్దతులు తెలిశాయని, సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కు తాము కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. మరి ఇంతలా రైతన్నలకు సమయం ఆదా.. డబ్బు ఆదా చేస్తున్న ఈ యాప్ మాత్రం డౌన్లోడ్ చేసుకోండి.. మీరు ఎక్కడినుండైనా మీ పంటపై ఓ లుక్కేయండి!